Brooklyn Subway Shooting : అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం.. ప్రయాణికులకు తీవ్ర గాయాలు

అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చెలరేగింది. ఈ కాల్పుల్లో ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి.

Brooklyn Subway Shooting : అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం.. ప్రయాణికులకు తీవ్ర గాయాలు

Brooklyn Subway Shooting

Brooklyn Subway Shooting : అగ్రరాజ్యం అమెరికా మరో ఉగ్రదాడితో విలవిలలాడింది. అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చెలరేగింది. న్యూయార్క్ లోని బ్రూక్లిన్ మెట్రో సబ్ వే లో పేలుడు, కాల్పులు చోటు చేసుకున్నాయి. బిజీగా ఉన్న సమయంలో దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో 13 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. గ్యాస్ మాస్క్ తో మెట్రో సబ్ వే లోకి చొరబడిన దుండగుడు.. విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. కాల్పుల్లో గాయపడిన వారిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలంలో పేలుడు పదార్దాలను పోలీసులు గుర్తించారు. కాగా, గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

పలువురు వ్యక్తులు రక్తపు గాయాలతో ప్లాట్ ఫామ్ పై పడి ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. ఈ ఘటనతో అలర్ట్ అయిన పోలీసులు బ్రూక్లిన్ లోని 36వ స్ట్రీట్ పరిసరాలను మూసివేశారు. పౌరులు ఎవరూ అటుగా వెళ్లొద్దని ఆదేశించారు. రద్దీగా ఉన్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌.. దేశంలో తుపాకుల వినియోగంపై కొత్త నియంత్రణ చర్యలను ప్రకటించిన ఒక రోజు తర్వాత ఈ ఘటన జరగడం గమనార్హం. ఈ ఘటనను ఉగ్రదాడిగా పేర్కొంటున్నా.. అధికార వర్గాలు ఈ విషయాన్ని ధ్రువీకరించలేదు. కాల్పులు జరిపిన దుండుగుడు నిర్మాణ రంగ కార్మికుడి దుస్తులు, గ్యాస్‌ మాస్క్‌ ధరించి ఉన్నట్లు తెలుస్తోంది.

కాల్పుల ఘటన స్థానికులను ఉలిక్కిపడేలా చేసింది. ఎప్పుడు ఎటువైపు నుంచి ప్రమాదం ముంచుకొస్తుందో అర్థం కాక ఆందోళన చెందుతున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతకాల్సి వస్తోందని వాపోతున్నారు.