Army Chopper Crash : భారత తొలి త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ మృతి..20ఏళ్లకే ఆర్మీలో చేరి..

బుధవారం తమిళనాడులోని కూనూర్ సమీపంలో సైనిక హెలికాఫ్టర్ కూలిన ఘటనలో భారతదేశ తొలి త్రివిధ దళాధిపతి(చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్)జనరల్ బిపిన్ రావత్ మృతి చెందారు.

Army Chopper Crash : భారత తొలి త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ మృతి..20ఏళ్లకే ఆర్మీలో చేరి..

Plnae2 (1)

Army Chopper Crash :  బుధవారం తమిళనాడులోని కూనూర్ సమీపంలో సైనిక హెలికాఫ్టర్ కూలిన ఘటనలో భారతదేశ తొలి త్రివిధ దళాధిపతి(చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్)జనరల్ బిపిన్ రావత్(63) మృతి చెందారు.
2015లో నాగాలాండ్ లో జరిగిన హెలికాఫ్టర్ ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడిన రావత్..ఇప్పుడు మాత్రం సేఫ్ గా తిరిగిరాలేకపోయారు. 40 ఏళ్లుగా దేశ రక్షణలో సేవలందించిన బిపిన్ రావత్ మృతి పట్ల ప్రధాని మోదీ,రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్,హోం మంత్రి అమిత్ షా సహా పలువురు నేతలు,ప్రముఖులు,త్రివిధ దళాలకు చెందిన అధికారులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశ రక్షణలో ఏళ్ల పాటు ఆయన అందించిన సేవలను కొనియాడారు. హెలికాఫ్టర్ ప్రమాదంలో బిపిన్ రావత్ తో పాటు ఆయన భార్య మధుళిత సహా అందులోని మొత్తం 14మంది మరణించారు.

బిపిన్ రావత్ బాల్యం-విద్య
1958 మార్చి-16న ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని పౌరి టౌన్ లో తరతరాలుగా భారత ఆర్మీలో సేవలందిస్తోన్న హిందూ గర్హ్వాలీ రాజపుత్ కుటుంబంలో బిపిన్ రావత్ జన్మించారు. బిపిన్ రావత్ పూర్తి పేరు-బిపిన్ లక్ష్మణ్ సింగ్ రావత్. రావత్ తండ్రి.. లక్ష్మణ్ సింగ్ లెఫ్టినెంట్ జనరల్ ర్యాంకు వరుకు ఆర్మీలో ఎదిగారు. ఉత్తరకాశీ మాజీ ఎమ్మెల్యే కిషన్ సింగ్ పర్మార్ కూతరే బిపిన్ రావత్ తల్లి.

బిపిన్ రావత్… డెహ్రాడూన్‌లోని కేంబ్రియన్ హాల్ స్కూల్‌లో మరియు సిమ్లాలోని సెయింట్ ఎడ్వర్డ్స్ స్కూల్‌లో చదివాడు. ఆ తర్వాత మహారాష్ట్రలోని ఖడక్వాస్లాలో ఉన్న నేషనల్ డిఫెన్స్ అకాడమీలో బీఎస్పీ పూర్తి చేసిన తర్వాత డెహ్రాడూన్‌లోని ఇండియన్ మిలిటరీ అకాడమీలో చేరాడు. ఇండియన్ మిలటరీ అకాడమీలో రావత్ కి ‘స్వర్డ్ ఆఫ్ హానర్’ అవార్డు లభించింది.

రావత్.. తమిళనాడులోని వెల్లింగ్టన్ లోని డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజ్ (DSSC) గ్రాడ్యుయేట్ కూడా. అమెరికాలోని కాన్సాస్‌లోని యునైటెడ్ స్టేట్స్ ఆర్మీ కమాండ్ జనరల్ స్టాఫ్ కాలేజీలో ఉన్నత కమాండ్ కోర్సులో కూడా రావత్ గ్రాడ్యుయేట్ పట్టా పొందారు. DSSCలో ఉన్న కాలంలో.. డిఫెన్స్ స్టడీస్‌లో ఎంఫిల్ డిగ్రీతో పాటు మద్రాస్ విశ్వవిద్యాలయం నుండి మేనేజ్‌మెంట్ మరియు కంప్యూటర్ స్టడీస్‌లో రావత్ డిప్లొమాలు పొందాడు. 2011లో మీరట్‌లోని చౌదరి చరణ్ సింగ్ విశ్వవిద్యాలయం.. సైనిక-మీడియా వ్యూహాత్మక అధ్యయనంపై చేసిన పరిశోధనలకు గాను రావత్ కు డాక్టరేట్ ఆఫ్ ఫిలాసఫీని ప్రదానం చేసింది.

మిలటరీ సర్వీస్

డిసెంబర్-16, 1978న ఆర్మీ సర్వీసులో చేరాడు. 11 గూర్ఖా రైఫిల్స్ 5వ బెటాలియన్‌లో తన తండ్రి మాదిరిగానే రావత్ నియమించబడ్డాడు. అధిక-ఎత్తు యుద్ధంలో చాలా అనుభవం గడించాడు రావత్. సర్వీసులో అంచెలంచెలుగా ఎదిగారు రావత్. అనేక ప్రాంతాల్లో, వివిధ హోదాల్లో విధులు నిర్వర్తించారు. పరమ వశిష్ఠి సేవా మెడల్ తో పాటు తన సర్వీసులో వివిధ మెడల్స్ ను రావత్ అందుకున్నారు.

1987లో సుమ్‌డోరాంగ్ చు లోయలో సైనిక ఘర్ణణ తలెత్తిన సమయంలో రావత్ యొక్క బెటాలియన్ చైనీస్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి వ్యతిరేకంగా మోహరించబడింది. 1962 యుద్ధం తర్వాత వివాదాస్పదమైన మెక్‌మాన్ లైన్‌లో జరిగిన మొదటి సైనిక ఘర్షణ ఈ ప్రతిష్టంభన. కాంగోలో కూడా యూఎన్ మిషన్ మీద కొన్నాళ్లు రావత్ పనిచేశారు.

జూన్ 2015లో మణిపూర్‌లో యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ వెస్ట్రన్ సౌత్ ఈస్ట్ ఏషియా (UNLFW)కి చెందిన మిలిటెంట్లు జరిపిన మెరుపుదాడిలో పద్దెనిమిది మంది భారతీయ సైనికులు మరణించారు. ఆ సమయంలో సరిహద్దు దాడులతో భారత సైన్యం ప్రతిస్పందించింది. రావత్ నేతృత్వంలోని పారాచూట్ రెజిమెంట్‌లోని 21వ బెటాలియన్‌కు చెందిన యూనిట్లు మయన్మార్‌లోని NSCN-K స్థావరంపై దాడి చేసింది.

ఆర్మీ కమాండర్ గ్రేడ్‌కు పదోన్నతి పొందిన జనవరి-1 2016న జనరల్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ సదరన్ కమాండ్‌గా బాధ్యతలు చేపట్టారు. కొద్దినెలల్లోనే సెప్టెంబర్-1,2016న వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ పదవిని చేపట్టాడు. ఈ పదవి చేపట్టిన మూడు నెలల్లోనే 17 డిసెంబర్ 2016న భారత ప్రభుత్వం రావత్ ని 27వ ఆర్మీ చీఫ్‌గా నియమించింది. 31 డిసెంబర్ 2016న 27వ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‌(COAS)గా బాధ్యతలు చేపట్టిన బిపిన్ రావత్..2019 డిసెంబర్ -31 వరకు ఆర్మీ చీఫ్ గా బాధ్యతలు నిర్వహించారు. జనవరి-1,2020న దేశ తొలి త్రివిధ దళాధిపతిగా బాధ్యతలు చేపట్టారు.

కొన్నాళ్లుగా పలు సందర్భాల్లో ప్రత్యర్ధి దేశాలకు బలమైన కౌంటర్లు ఇస్తూ,సరిహద్దుల్లో జవాన్లను కలుస్తూ తనదైన ముద్ర వేస్తూ వచ్చిన రావత్ త్రివిధ దళాధిపతి పదవిలో ఉండగానే బుధవారం తమిళనాడులో జరిగిన హెలికాఫ్టర్ ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు.