KMC Polls 2021 : నాటు బాంబులతో దాడి..హింసాత్మకంగా కోల్‌కతా మున్సిపల్ ఎన్నికలు

  కోల్‌కతా మున్సిపల్‌ కార్పొరేషన్‌(KMC)ఎన్నికల్లో అక్కడక్కడా స్వల్ప ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. కోల్‌కతాతో పాటు చుట్టు పక్కల ఉన్న నగరాల్లో అధికారులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు

KMC Polls 2021 : నాటు బాంబులతో దాడి..హింసాత్మకంగా కోల్‌కతా మున్సిపల్ ఎన్నికలు

Kolkata

Updated On : December 19, 2021 / 3:42 PM IST

KMC Polls 2021 :  కోల్‌కతా మున్సిపల్‌ కార్పొరేషన్‌(KMC)ఎన్నికల్లో అక్కడక్కడా స్వల్ప ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. కోల్‌కతాతో పాటు చుట్టు పక్కల ఉన్న నగరాల్లో అధికారులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినా హింసాత్మక సంఘటనలు జరిగాయి. ఇప్పటి వరకు రెండు చోట్ల బాంబు పేలుళ్లు చోటు చేసుకున్నాయి. సీల్డా ప్రాంతంలోని టాకి బాయ్స్‌ స్కూల్‌ లోని పోలింగ్ బూత్ వద్ద నాటు బాంబు దాడి జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు ఓటర్లకు గాయాలయ్యాయి. ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఖన్నా ప్రాంతంలోని మరో పోలింగ్ బూత్ వద్ద మరో బాంబు దాడి జరిగింది. ఈ క్రమంలో ఎన్నికల సంఘం పోలీసుల నుంచి నివేదిక కోరింది. స్పాట్ కు చేరుకున్న పోలీసు బృందాలు.. బాంబు పేల్చిన వారిని గుర్తించేందుకు సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు.

ఇక,కొన్ని కేంద్రాల్లో సీసీటీవీ కెమెరాలు సరిగా పనిచేయడం లేదని విపక్ష పార్టీలు ఆరోపించాయి. తమ ఏజెంట్లను పోలింగ్ బూత్ లలోకి అనుమతించడం లేదని ఆరోపిస్తూ భగా జతిన్ ప్రాంతంలో రోడ్డుపై సీపీఐ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.మరోవైపు,తమ ఏజెంట్లను కూడా పలు వార్డుల్లోని పోలింగ్ బూత్ లలోకి అనుమతించడం లేదని ఆరోపించింది బీజేపీ. టీఎంసీ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడుతోందని సీపీఐ,బీజేపీ పార్టీలు ఆరోపించాయి. అయితే విపక్షాల ఆరోపణలను అధికార టీఎంసీ కొట్టిపారేసింది. విపక్షాల ఆరోపణల్లో వాస్తవం లేదని తెలిపింది. అయితే ఎన్నికల్లో హింస,అవకతవకలకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా శాంతియుత ఆందోళనలు నిర్వహిస్తామని బెంగాల్ బీజేపీ ప్రకటించింది.

జొరాషంకో ప్రాంతంలో బీజేపీ కౌన్సిలర్ మీనాదేవి పురోహిత్.. టీఎంసీ కార్యకర్తలపై పోలీసులకు కంప్లెయింట్ చేశారు. టీఎంసీ కార్యకర్తలు తనను ఎగతాళి చేస్తూ మాట్లాడారని ఆరోపించారు. ఈ క్రమంలో ఉద్రిక్తత తలెత్తగా తన దుస్తులు కొద్దిగా చినిగిపోయాయని అన్నారు. అయితే, పురోహిత్ వ్యాఖ్యలను టీఎంసీ ఖండించింది. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఉద్రిక్తతలు రాజేసేందుకు తప్పుడు ఆరోపణలు చేయడం ఆమెకు సాధారణమేనని టీఎంసీ తెలిపింది.

కాగా, కోల్‌కతా మున్సిపల్‌ కార్పొరేషన్ లోని మొత్తం 144 వార్డులకు పోలింగ్ జరుగుతోంది. 40 లక్షల మంది అర్హులైన ఓటర్లు ఈ వార్డుల పరిధిలో ఉన్నారు.  బీజేపీ 142 వార్డుల్లో పోటీ చేస్తుండగా,సీపీఐ-ఎమ్ 96 వార్డుల్లో,కాంగ్రెస్ 121 వార్డుల్లో పోటీ చేస్తోంది. ఇక, అధికార టీఎంసీ మొత్తం 144 వార్డుల్లో తన అభ్యర్థులను నిలబెట్టింది. ఇవాళ ఉదయం ఏడు గంటలకు ఓటింగ్ ప్రారంభం కాగా..సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ కొనసాగనుంది. డిసెంబర్ 21న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.

ALSO READ Omicron Fear : అమెరికా, యూకేలను వణికిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్