Visakha Sai Priya Case : ప్రియుడితో పారిపోయిన విశాఖ సాయిప్రియ కేసులో ట్విస్టులే ట్విస్టులు.. అమ్మాయి తండ్రిపైనా కేసు నమోదు

భర్తతో పాటు అందరినీ తప్పుదోవ పట్టించి ప్రియుడితో పారిపోయిన సాయిప్రియ కేసులో కొత్త కొత్త ట్విస్టులు తెరపైకి వస్తున్నాయి. ఇప్పటికే సాయిప్రియ, ఆమె ప్రియుడు రవితేజపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పుడు సాయిప్రియ తండ్రిపైనా కేసు బుక్ చేశారు.

Visakha Sai Priya Case : ప్రియుడితో పారిపోయిన విశాఖ సాయిప్రియ కేసులో ట్విస్టులే ట్విస్టులు.. అమ్మాయి తండ్రిపైనా కేసు నమోదు

Visakha Sai Priya Case : భర్తతో పాటు అందరినీ తప్పుదోవ పట్టించి ప్రియుడితో పారిపోయిన సాయిప్రియ కేసులో కొత్త కొత్త ట్విస్టులు తెరపైకి వస్తున్నాయి. ఇప్పటికే సాయిప్రియ, ఆమె ప్రియుడు రవితేజపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పుడు సాయిప్రియ తండ్రిపైనా కేసు బుక్ చేశారు. కూతురి ప్రేమ వ్యవహారం తెలిసినా ఏమీ చెప్పకుండా దాచి బాధ్యత లేకుండా వ్యవహరించారంటూ అప్పలరాజుపై కేసు నమోదు చేశారు.

విశాఖలోని ఆర్కే బీచ్ లో అదృశ్యమై ప్రియుడితో ప్రత్యక్షమైన సాయిప్రియ కేసులో సినిమాను మించి ట్విస్టులు బయటపడుతున్నాయి. ఈ కేసు రోజుకో మలుపు తిరుగుతూనే ఉంది. భర్తతో పాటు ఆర్కే బీచ్ కు వచ్చిన సాయిప్రియ సడెన్ గా అక్కడి నుంచి అదృశ్యమైపోయింది. తన భార్య సముద్రంలో గల్లంతైందని భావించిన భర్త శ్రీనివాస్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఒక ప్రాణం ఆపదలో ఉందని తెలియగానే పోలీసులు, నేవీ, సముద్ర తీరంలో గస్తీ దళం అంతా రంగంలోకి దిగారు. సముద్రాన్ని జల్లెడపట్టారు. అయినా సాయిప్రియ జాడ దొరకలేదు. దీంతో అందరిలోనూ ఆందోళన పెరిగిపోయింది. సాయిప్రియకు ఏం జరిగిందోనని అంతా టెన్షన్ పడ్డారు. అయ్యో పాపం అని జాలి చూపించారు.

కట్ చేస్తే.. సాయిప్రియ అందరికీ ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. అందరి మైండ్ బ్లాంక్ అయ్యేలా చేసింది. సాయిప్రియ అదృశ్యం అవ్వలేదు. అక్కడి నుంచి తానే స్వయంగా జంప్ అయ్యింది. ప్రియుడితో వెళ్లిపోయిన సాయిప్రియ అతడిని పెళ్లి చేసుకుంది. తన కోసం వెతక్కొద్దు అంటూ, మమ్మల్ని వదిలేయండి అంటూ పేరెంట్స్ కి మేసేజ్ పెట్టింది. దీంతో ఆమె భర్తతో సహా అంతా షాక్ తిన్నారు. ఆ తర్వాత తన ప్రియుడితో కలిసి విశాఖ పోలీస్ స్టేషన్ లో ప్రత్యక్షమైన సాయిప్రియ.. తమకు రక్షణ కల్పించాలంటూ మరో ట్విస్ట్ ఇచ్చింది. అందరినీ తప్పుదోవ పట్టించి జిల్లా యంత్రాంగాన్ని పరుగులు పెట్టించిన సాయిప్రియతో పాటు ఆమె ప్రియుడు రవితేజపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదంతా పాత కథ. ఇప్పుడు కథలో ట్విస్ట్ ఏంటంటే.. సాయిప్రియ తండ్రిపైనా పోలీసులు కేసు పెట్టారు.

నిజానికి సాయిప్రియ తండ్రికి కూతురి ప్రేమ వ్యవహారం తెలుసు. అయినా తనకేమీ తెలియనట్లుగా ఏమీ చెప్పకుండా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించినందుకు అతడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఉద్దేశపూర్వకంగానే జిల్లా యంత్రాంగాన్ని, పోలీసులను, కోస్ట్ గార్డ్ ను తప్పుదోవ పట్టించినందుకే కేసు పెట్టారు. అటు ప్రభుత్వ ధనంతో పాటు సమయాన్ని వృథా చేసినందుకు గాను కోర్టు అనుమతితో ఇప్పటికే సాయిప్రియ ఆమె ప్రియుడు రవితేజపై పోలీసులు కేసు పెట్టారు. సాయిప్రియ కథలో ఇలా వరుసగా ట్విస్టుల మీద ట్విస్టులు బయటకు రావడంతో కేసుల మీద కేసులు నమోదవుతున్నాయి. ప్రేమ పేరుతో ప్రభుత్వ యంత్రాంగంతో ఆటలాడితే ఎలా ఉంటుందో రుచి చూపిస్తున్నారు.

విషయం అంతా తెలిసినా, అటు జిల్లా యంత్రాంగం అంతా సముద్రాన్ని జల్లెడ పట్టడం చూసినా.. ఏమీ తెలియనట్లుగా నటించిన సాయిప్రియ తండ్రికి కూడా సమస్యలు తప్పలేదు. పెద్దలు చేసిన పెళ్లి ఇష్టం లేకపోతే, ప్రియుడితో పారిపోవాలని అనుకుంటే చాలా దారులే ఉన్నాయి. అంతేకానీ, భర్తతో పాటు ప్రభుత్వ యంత్రాంగాన్ని కూడా తప్పుదోవ పట్టించాల్సిన అవసరం లేదు. అలా చేస్తే ఎలా ఉంటుందో, పోలీసులు ఎంత సీరియస్ గా తీసుకుంటారో చెప్పడానికి సాయిప్రియ కేసు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్.

తమ ప్రేమ కోసం అందరినీ తప్పుదోవ పట్టించి ఇష్టానుసారంగా వ్యవహరిస్తామంటే కుదరదు. అలా చేస్తే దాని పర్యవసానం తప్పుచేసిన వారితో పాటు వారి కుటుంబసభ్యులు కూడా అనుభవించాల్సిందే. ఇప్పుడు సాయిప్రియ వ్యవహారంలో కేసులైతే నమోదు చేశారు. ఇక వారి పని జైళ్లు, కోర్టుల చుట్టూ తిరగాల్సిందే. అయితే, మరి సాయిప్రియ గాలింపు కోసం అయిన ఖర్చును ఎలా వెనక్కి రాబడతారో తెలియాల్సి ఉంది.