lady Singham : డ్రగ్స్ కేసులో రాజస్ధాన్ లేడీ సింగం అరెస్ట్

రాజస్ధాన్ లో లేడీ సింగంగా పేరుపొందిన పోలీసు సబ్ ఇనస్పెక్టర్ సీమ జఖర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. స్మగ్లర్లు పారిపోవటానికి ఆమె సహకరించారనే ఆరోపణలతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని ఈ రోజు కోర్టులో ప్రవేశ పెట్టారు.

lady Singham : డ్రగ్స్ కేసులో రాజస్ధాన్ లేడీ సింగం అరెస్ట్

Rajasthan Lady Singham

Lady Singham :  రాజస్ధాన్ లో లేడీ సింగంగా పేరుపొందిన పోలీసు సబ్ ఇనస్పెక్టర్ సీమ జఖర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. స్మగ్లర్లు పారిపోవటానికి ఆమె సహకరించారనే ఆరోపణలతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని ఈ రోజు కోర్టులో ప్రవేశ పెట్టారు.

సాధారణంగా అవినీతి చేసే విషయంలో మహిళా పోలీసులు  పురుష పోలీసుల కంటే కాస్త దూరంగానే ఉంటారని వినికిడి.  కానీ రాజస్థాన్ లోని సిరోహ్ జిల్లా బార్లుట్ పోలీసు స్టేషన్ కు చెందిన మహిళా ఎస్‌హెచ్ఓ సీమ జఖర్ మాత్రం స్మగ్లర్లతో కుమ్మక్కయ్యింది.  గతేడాది నవంబర్ 14 రాత్రి జిల్లా ఎస్పీ ఆదేశాలతో స్మగ్లర్లను పట్టుకోటానికి  వెళ్లింది. సంఘటనా స్దలానికి   చేరుకున్న ఆమె స్మగ్లర్లతో  రూ.10 లక్షల రూపాయలకు డీల్ కుదుర్చుకుంది.

అక్కడ నుంచి స్మగ్లర్లను తన సొంత వాహానంలో   సంచోర్   తీసుకు వెళ్లి దింపి వచ్చింది. అక్కడి నుంచి 10 లక్షల రూపాయలు తెచ్చుకుంది.  మర్నాడు   సీమ జఖర్  ఆ 10 లక్షల తో ఉదయ్ పూర్ వెళ్లింది.   అప్పటికే  ఈవార్త నగరంలో గుప్పు మంది.  ఈ విషయంపై సమాచారం తెప్పించుకున్న జిల్లా ఎస్పీ సీమ జఖర్ ఉదంతం మొత్తం సీసీటీవీ ఫుటేజి తెప్పించుకున్నారు.

డ్రగ్స్ మాఫియా నుంచి  లంచం తీసుకుందనే ఆరోపణలు రావటంతో ఆమెను పదవి నుంచి సస్పెండ్ చేశారు.  ఆమెతో పాటు మరో ముగ్గరు కానిస్టేబుల్స్ ను కూడా ప్రభుత్వం నవంబర్ 26న సస్పెండ్ చేసింది.  ఈ ఘటన అనంతరం నవంబర్ 29 ఆమె వివాహం జోథ్ పూర్ లో జరిగింది.  ఈవివాహానికి    పలువురు రాజకీయ నాయకులు హాజరయ్యారు. ఆ ఫోటోలు చాలాకాలం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

అయితే అవినీతి ఆరోపణలతో   సస్పెండైన సీమ జఖర్ ను పోలీసులు ఆదివారం రాత్రి జోథ్‌పూర్‌లోని ఆమె అత్తగారి ఇంటిలో అరెస్ట్ చేసినట్లు   సిరోహి పోలీసు సూపరింటెండెంట్ ధర్మేంద్ర సింగ్ తెలిపారు.  ఆమెను నిన్న స్వరూప్ గంజ్ పోలీసు స్టేషన్ లో  విచారించారు.  ఈరోజు ఆమెను కోర్టులో హజరు పరిచారు. ఈకేసులో ఇంతవరకు నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

సీమ జఖర్ సస్పెండయ్యే సమయంలో ఆమెకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్స్   ఫాలోయింగ్ ఉంది. సోషల్ మీడియాలో ఆమె తనకు తాను లేడీ సింగంగా సంబోధించు కునేది.   కాగా ఆమె ఉద్యోగం నుంచి సస్పెండ్ అయిన తర్వాత సోషల్ మీడియాలో ఎటువంటి అప్ డేట్ చేయలేదు. ఇన్ స్టాగ్రాంలో కూడా తన ప్రోపైల్ ఫోటో ఉండే  చోట జస్టిస్ అని రాసుకుంది.

Also Read : Maharashtra Crisis: మ‌హారాష్ట్ర డిప్యూటీ స్పీక‌ర్‌, సర్కారుకు సుప్రీంకోర్టు నోటీసులు