Tamilnadu SI Murder Case : వదిలేయమని బతిమలాడినా కనికరించలేదు… అందుకే చంపేసాం

మేకలు దొంగతనం చేసిన తమను విడిచి పెట్టమని ఎంత బతిమలాడినా ఎస్సై కనికరించకపోవడంతోనే హత్య చేసినట్లు నిందితులు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు

Tamilnadu SI Murder Case : వదిలేయమని బతిమలాడినా కనికరించలేదు… అందుకే చంపేసాం

Tamilnadu Ssi Bhoominathan

Tamilnadu SI Murder Case :  మేకలు దొంగతనం చేసిన తమను విడిచి పెట్టమని ఎంత బతిమలాడినా ఎస్సై కనికరించకపోవడంతోనే హత్య చేసినట్లు నిందితులు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. తమిళనాడులోని తిరుచ్చి జిల్లా నావల్‌పట్టి పోలీస్ స్టేషన్ కు చెందిన స్పెషల్ ఎస్సై ని హత్య చేసిన నిందితుల్లో ఇద్దరు మైనర్లు ఉన్నారు. నిందితుల్లో ఒకడైన తంజావూరు జిల్లా  కల్లనై సమీపంలోని తొగూర్ కు చెందిన మణికందన్ (19) ను అదుపులోకి తీసుకునేప్పడు గ్రామస్తుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయ్యింది. తుపాకులు చూపించి గ్రామస్తులను భయపెట్టి పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

నావల్‌పట్టి పోలీసుస్టేషన్ లో స్పెషల్ ఎస్‌ఐ గా పని చేస్తున్న భూమినాథన్(50) శనివారం రాత్రి పెట్రోలింగ్ చేస్తుండగా తిరుచ్చి జిల్లా శివార్ల లోని పూలంగుడి కాలనీ సమీపంలో   తెల్లవారుఝూమున 2-3 గంటల మధ్య సమయంలో మేకలు తోలుకుంటూ వెళుతున్న నలుగురు యువకులు కనపడ్డారు.  అనుమానం వచ్చిన భూమినాథన్ వారిని ప్రశ్నించాడు. భూమినాథన్ కు యువకులు నిజం చెప్పేశారు.

మేకలను దొంగతనం చేసామని ఎస్సైకు చెప్పి అక్కడి నుంచి పారిపోవటానికి ప్రయత్నించారు. ఎస్సై  వెంబడించి చివరికి వారిని పట్టుకున్నాడు. మమ్నల్ని విడిచి పెట్టమని నిందితులు చాలా సేపు వేడుకున్నారు.  భూమినాథన్ వినలేదు.  ఎవరికో ఫోన్ చేసి త్వరగా రావాలని చెప్పటంతో తన వద్ద ఉన్న కత్తితో హత్యచేశానని నిందితుడు మణిగందన్ పోలీసులకు తెలిపాడు.
Also Read : Priyanka Chopra : స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా విడాకులు??
అతనిచ్చిన సమాచారంతో ఈ హత్యలో పాల్గోన్న మరో ఇద్దరు మైనర్లను (14,16 ఏళ్లు ) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరూ పుదుక్కోటై జిల్లాకు చెందిన వారు. మరోక నిందితుడు పరారీలో ఉన్నాడు. నిందితుల్లో ఇద్దరు మైనర్లు కావటంతో వారిని రహస్య ప్రదేశంలో ఉంచి విచారిస్తున్నారు.

నిందితుల దాడిలో మృతి చెందిన ఎస్సై భూమినాథన్ అంత్యక్రియలు ఆదివారం పోలీసు లాంఛనాలతో నిర్వహించారు. మరణించిన ఎస్సైకు భార్య, ఒక కుమారుడు ఉన్నారు. ఎస్సై కుటుంబానికి సీఎం స్టాలిన్ కోటి రూపాయలు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. ఇంట్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తున్నట్లు ప్రకటించారు. అదుపులోకి తీసుకున్న ముగ్గురు నిందితులపై ఐపీసీ సెక్షన్ 405, 302 కింద కేసునమోదు చేసి పోలీసులు విచారణ జరుపుతున్నారు.