పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలి : కాంగ్రెస్

పార్టీ ఫిరాయింపులపై కాంగ్రెస్ నేతలు నిరసన తెలిపారు. ఈమేరకు అసెంబ్లీ ప్రాంగణంలోని గాంధీ విగ్రహం ముందు ఆ పార్టీ ఎమ్మెల్యేలు ధర్నా చేపట్టారు.

  • Published By: veegamteam ,Published On : March 3, 2019 / 12:35 PM IST
పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలి : కాంగ్రెస్

పార్టీ ఫిరాయింపులపై కాంగ్రెస్ నేతలు నిరసన తెలిపారు. ఈమేరకు అసెంబ్లీ ప్రాంగణంలోని గాంధీ విగ్రహం ముందు ఆ పార్టీ ఎమ్మెల్యేలు ధర్నా చేపట్టారు.

హైదరాబాద్ : పార్టీ ఫిరాయింపులపై కాంగ్రెస్ నేతలు నిరసన తెలిపారు. ఈమేరకు అసెంబ్లీ ప్రాంగణంలోని గాంధీ విగ్రహం ముందు ఆ పార్టీ ఎమ్మెల్యేలు ధర్నా చేపట్టారు. నల్ల బ్యాడ్జీలు ధరించి భైఠాయించారు. సేవ్ డెమోక్రసీ అంటూ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కేసీఆర్ కొనుగోలు చేశారని పేర్కొన్నారు.

ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, ఆత్రం సక్కులపై అనర్హత వేటు వేసి ఓటింగ్ కు దూరం చేయాలని ఉత్తమ్ అన్నారు. ఇద్దరు ఎమ్మెల్యేల ఫిరాయింపుపై ఈసీకి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. సంఖ్యా బలం లేకుండా ఐదో అభ్యర్థిని పెట్టడం కేసీఆర్ బరితెగింపు అని మండిపడ్డారు. సంప్రదాయాల కోసమే స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ల ఎన్నికకు సహకరించామని తెలిపారు. కేసీఆర్ రెండో సారి సీఎం అయ్యాక స్టేట్స్ మెన్ గా ఉంటారనుకున్నామని.. కానీ రాజకీయాలను భ్రష్టుపట్టిస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ తీరుకు నిరసనగా మార్చి 5న రాష్ట్ర వ్యాప్త నిరసనలు తెలుపుతామని చెప్పారు. 

ఫిరాయింపులు రాజ్యాంగ వ్యతిరేక చర్య అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, ఆత్రం సక్కులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మార్చి 6న పినపాక, ఆసిఫాబాద్ లోని అన్ని మండల కేంద్రాల్లో నిరసనలు తెలియజేస్తామని చెప్పారు. మార్చి 8న ఎమ్మెల్యేలం అందరం కలిసి నిరసన చేపడుతామని హెచ్చరించారు. పోడు భూములపై హక్కులిచ్చిన కాంగ్రెస్ కు ద్రోహం చేస్తున్నారని మండిపడ్డారు. గిరిజనుల నుంచి భూములు లాక్కున్న కేసీఆర్ దగ్గరకే వెళ్తున్నారని పేర్కొన్నారు. కేసీఆర్ కు బుద్ధి చెప్పేందుకు కార్యాచరణ ఉంటుందన్నారు.