ఇదో ట్రెండ్ : ప్లేస్ మారినా గెలుపు మారలేదు

హైదరాబాద్: ఒక్క ఛాన్స్... ఒకే ఒక్క ఛాన్స్.. ఇదీ లీడర్ల మనసులో మాట. ఒక్కసారి అవకాశం వస్తే చట్టసభల్లో వాణి వినిపించాలని ఉవ్విళ్లూరుతుంటారు నేతలు. ఆ అవకాశాన్ని

  • Published By: veegamteam ,Published On : March 20, 2019 / 03:32 PM IST
ఇదో ట్రెండ్ : ప్లేస్ మారినా గెలుపు మారలేదు

హైదరాబాద్: ఒక్క ఛాన్స్… ఒకే ఒక్క ఛాన్స్.. ఇదీ లీడర్ల మనసులో మాట. ఒక్కసారి అవకాశం వస్తే చట్టసభల్లో వాణి వినిపించాలని ఉవ్విళ్లూరుతుంటారు నేతలు. ఆ అవకాశాన్ని

హైదరాబాద్: ఒక్క ఛాన్స్… ఒకే ఒక్క ఛాన్స్.. ఇదీ లీడర్ల మనసులో మాట. ఒక్కసారి అవకాశం వస్తే చట్టసభల్లో వాణి వినిపించాలని ఉవ్విళ్లూరుతుంటారు నేతలు. ఆ అవకాశాన్ని దక్కించుకోవడం కోసం… నియోజకవర్గం మొత్తం చుట్టేస్తారు. ప్రజల నోళ్లలో పేరు నానేలా ప్రయత్నిస్తారు. విజయం కోసం చెమటోడ్చాలి. అలాంటిది నియోజకవర్గమే మారితే… మళ్లీ కథ మొదటికి వస్తుంది. కానీ… తెలంగాణలో స్థానాలు మారినా విజయం సాధించిన నేతలు ఎంతో మంది ఉన్నారు.

తెలంగాణ రాష్ట్రం నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించి దేశ రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగిన నేతలు చాలా మందే ఉన్నారు. ప్రజల్లో పేరు తెచ్చుకుని.. పార్టీ తరఫున టికెట్ సంపాదించి.. విజయం కోసం తీవ్రంగానే శ్రమించారు నేతలు. ఒకే నియోజకవర్గం నుంచి కాకుండా.. మరో స్థానానికి మారిన వారిలో ఈజీగా విక్టరీ సాధించారు కొందరు నేతలు.

ఈ జాబితాలో మొదట మాజీ ప్రధాని పీవీ నరసింహారావు పేరు చెప్పుకోవచ్చు. ఉమ్మడి ఏపీకి సీఎంగా చేసిన నరసింహారావు.. ఆ తర్వత ఎంపీగా పోటీ చేశారు. తొలిసారి 1977లో హన్మకొండ లోక్‌సభ స్థానం నుంచి గెల్చి… పార్లమెంట్‌లో అడుగుపెట్టారు. 1980లో కూడా అదే స్థానం నుంచి విజయం సాధించారు. 1984 జరిగిన ఎన్నికల్లో హన్మకొండతో పాటు.. మహారాష్ట్ర రాంటెక్ నుంచి పోటీ చేశారు. హన్మకొండలో ఓటమిపాలైనా.. రాంటెక్‌లో పీవీ సునాయాసంగా విజయం సాధించారు. ఆ తర్వాత 1989లో కూడా రాంటెక్ నుంచే ప్రాతినిథ్యం వహించారు. రాజీవ్ హత్య తర్వాత అనూహ్యంగా ప్రధాని పదవి చేపట్టిన ఆయన… ఉప ఎన్నికల్లో నంద్యాల నుంచి రికార్డు స్థాయి మెజారిటీతో విజయం సాధించారు. 5సార్లు లోక్‌సభకు ప్రాతినిథ్యం వహంచిన పీవీ… 3 స్థానాలు మారినా విజయం సాధించి అరుదైన ఘనత సాధించారు.

లోక్‌సభకు పోటీ చేసిన ప్రతిసారి విజయం సాధించారు ప్రస్తుత సీఎం కేసీఆర్. ప్రతిసారి కొత్త నియోజకవర్గం నుంచి బరిలోకి దిగి రికార్డ్ సృష్టించారు. 2004లో క‌రీంన‌గ‌ర్ నుంచి పోటీ చేసి గెల్చినా… ఒకే ట‌ర్మ్‌లో 2సార్లు రిజైన్ చేసి.. అదే స్థానం నుంచి విజ‌యం సాధించారు. 2009లో మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ నుంచి గెల్చినా… 2014 వచ్చే సరికి మెద‌క్ లోక్‌స‌భ స్థానానికి మారారు. అక్కడ కూడా విజయం సాధించి… 3 సార్లు వేర్వేరు నియోజకవర్గాల నుంచి గెల్చిన నేతగా విలక్షణత చాటుకున్నారు.

సీనియ‌ర్ నేత జైపాల్ రెడ్డి కూడా ఘ‌న‌మైన రికార్డు సొంతం చేసుకున్నారు. మొదట మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ స్థానం నుంచి 1984లో ఎన్నిక‌య్యారు. తిరిగి 1998లో మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ నుండే ఎన్నిక‌యిన జైపాల్ రెడ్డి..1999లో మిర్యాలగూడ స్థానానికి మారారు. అక్కడి నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు. 2004లో కూడా మిర్యాలగూడ నుంచి పోటీ చేసి గెలుపొందిన జైపాల్‌రెడ్డి.. ఆ తర్వాత ఆ నియోజకవర్గం రద్దు కావడంతో… 2009లో చేవెళ్ల నుండి పోటీ చేసి విజయం సాధించారు. 2014 ఎన్నిక‌ల్లో మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ నుండి బ‌రిలోకి దిగిన ఆయ‌న.. ఓట‌మి పాల‌య్యారు. ఇక అదే మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ నుండి లోక్ స‌భ‌కు ఎన్నిక‌యిన జే రామేశ్వర‌రావు.. మొదట గ‌ద్వాల నుండి ప్రాతినిథ్యం వ‌హించారు. స్వాతంత్ర స‌మ‌ర యోధుడు జేబీ ముత్యాలరావు కూడా మ‌హ‌బూబ్ న‌గ‌ర్ నుండి ఓసారి.. నాగ‌ర్‌క‌ర్నూల్ నుంచి మ‌రోసారి ఎన్నిక‌య్యారు.

విద్యార్థి నేతగా ప్రస్తానాన్ని ప్రారంభించిన మ‌ల్లిఖార్జున్.. జాతీయ రాజ‌కీయాల్లో చెరగని ముద్ర వేశారు. 1971లో మెదక్ స్థానం నుండి ఎంపీగా గెల్చిన ఆయన.. అదే నియోజకవర్గం నుంచి వ‌రుస‌గా రెండుసార్లు ప్రాతినిథ్యం వ‌హించారు. 1980లో ఇందిరాగాంధీ కోసం మెదక్ సీటును త్యాగం చేసి.. మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ నుండి పోటీ చేసి విజయం సాధించారు. 1984 మిన‌హా మొత్తం నాలుగు సార్లు మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ నుండి ఎంపీగా గెలిచారు.

పెద్దపల్లి, నాగర్‌కర్నూలు, సిద్దిపేట నియోజకవర్గాలకు కూడా ఓ విశిష్టత ఉంది. ఇక్కడ గెల్చిన నేతలు.. ఇతర నియోజకవర్గాల్లోనూ విజయం సాధించారు. జీ వెంకటస్వామి సిద్దిపేట నుంచి 3 సార్లు… పెద్దపల్లి నుండి 4 సార్లు ఎంపీగా గెలుపొందారు. 6 సార్లు లోక్ స‌భ‌కు, 2 సార్లు రాజ్యసభకు నంది ఎల్లయ్య గెల్చారు. అందులో సిద్దిపేట నుండి 5 సార్లు, నాగ‌ర్ క‌ర్నూల్ నుండి ఓసారి ఎంపీగా ఎన్నిక‌య్యారు. పెద్దపల్లి నుంచి 2 సార్లు గెలిచిన ఎంఆర్ కృష్ణ.. క‌రీంన‌గ‌ర్ నుండి కూడా 2 సార్లు విక్టరీ కొట్టారు. పెద్దప‌ల్లి నుండి 2 సార్లు గెలిచిన తుల‌సీరాం.. నాగ‌ర్‌ క‌ర్నూల్‌కు కూడా ప్రాతినిథ్యం వహించారు. సిద్దిపేట నుంచి ఎంపీగా గెల్చిన సర్వే సత్యనారాయణ… మ‌ల్కాజిగిరిలోనూ విజ‌యం సాధించారు.

నాగర్‌ కర్నూలు, పెద్దపల్లి, సిద్దిపేట నుంచి ప్రాతినిథ్యం వహించిన వారిలో ఎక్కువగా స్థానికేతరులే కావడం ఓ రికార్డు. కరీంనగర్, మహబూబ్‌నగర్ నుంచి గెల్చిన వారిలో ఎక్కువ మంది కేంద్ర మంత్రులుగా పని చేశారు. తెలంగాణ నుంచి ప్రాతినిథ్యం వహించిన ఇందిరా గాంధీ.. ప్రధానమంత్రి కావడం మరో విశేషం. మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ నుండి ఎంపీలుగా ఎన్నికైన మ‌ల్లిఖార్జున్, కేసీఆర్… ఇద్దరూ మెదక్ ఎంపీలుగా కూడా చేశారు.