గాంధీలో ఓపీ సేవల సమయం పెంపు

  • Published By: madhu ,Published On : May 11, 2019 / 03:32 AM IST
గాంధీలో ఓపీ సేవల సమయం పెంపు

ప్రభుత్వాసుపత్రుల్లో ఓపీ సేవలను పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పేరొందిన గాంధీ ఆస్పత్రిలో కూడా ఔట్ పేషెంట్ విభాగం సేవల సమయాన్ని పెంచాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటేల రాజేందర్ మే 10వ తేదీ శుక్రవారం ఆదేశించారు. ఇకపై ఓపీ విభాగం మధ్యాహ్నం 2 వరకు రోగులకు అందుబాటులో ఉండనుంది. ప్రస్తుతం ఓపీ సేవలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే పనిచేస్తున్నాయి.

దూర ప్రాంతాల నుండి ఎంతో మంది గాంధీ ఆస్పత్రికి వస్తుంటారు. అయితే…ఇక్కడ ఔట్ పేషెంట్ సేవలు కేవలం 12గంటల వరకు మాత్రమే పనిచేస్తుండేవి. వారు వచ్చే వరకు టైం అయిపోవడంతో ఆ రోజంతా అక్కడే పడిగాపులు పడాల్సి వచ్చేది. రోగుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం పై విధంగా నిర్ణయం తీసుకుంది. సమయాన్ని పెంచడంతో ఆనంద వ్యక్తం చేస్తున్నారు. 

అదే విధంగా ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 వరకు ఉన్న డయాగ్నిస్టిక్స్ సమయాన్ని కూడా పెంచారు. సాయంత్రం 4గంటల వరకు పనిచేయనుంది. దీనివల్ల ఎంతో మంది పేదలకు వైద్య సేవలపరంగా ప్రయోజనం చేకూరనుందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే మంత్రి ఆదేశాల మేరకు వైద్య విధాన పరిషత్ పరిధిలోని 110 ఆస్పత్రులకు కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ యోగితారాణా ఆదేశాలు జారీ చేశారు.