ఒవైసీని అరెస్ట్ చేయండి : రాజాసింగ్ డిమాండ్

  • Published By: chvmurthy ,Published On : November 9, 2019 / 12:53 PM IST
ఒవైసీని అరెస్ట్ చేయండి : రాజాసింగ్ డిమాండ్

అయోధ్యలో వివాదాస్పద రామజన్మభూమి స్ధల వివాదంపై శనివారం నవంబర్ 9న సర్వోన్నత న్యాయస్ధానం తీర్పు చెప్పింది.  సుప్రీం తీర్పపై దేశవ్యాప్తంగా పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖులు ప్రజలంతా సంయమనం పాటించాలని, శాంతితో మెలగాలని  సందేశమిస్తున్నారు. 

అయితే.. అయోధ్యలోని వివాదాస్పద స్థలాన్ని హిందువులకు కేటాయిస్తూ తీర్పు చెప్పడంపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మసీదు నిర్మాణానికి అయోధ్యలోనే మరోచోట భూమిని కేటాయించాలని సుప్రీం ఇచ్చిన తీర్పుపై స్పందిస్తూ.. ‘మాకు ఎవరి భిక్ష అవసరం లేదు’ అని అన్నారు. ఐదెకరాల ప్రత్యామ్నాయ భూమిని ‘ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు’ తిరస్కరించాలని సూచించారు.

కాగా ఒవైసీ వ్యాఖ్యలపై హైదరాబాద్ , గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అభ్యంతరం తెలిపారు. ఓవైసీ  భయానక వాతావరణాన్ని సృష్టించాలని చూస్తున్నారని ఆయన విమర్శించారు. ఇరు మతాలకు చెందిన ప్రజలు తీర్పును స్వాగతించారని చెప్పారు. హైదరాబాద్‌లో గానీ, ఇతర నగరాల్లో గానీ ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టాలని చూస్తే సహించేది లేదని ఆయన చెప్పారు. రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తున్న ఓవైసీని అరెస్ట్ చేయాలని దేశ హోం మంత్రిత్వ శాఖకు, హోం మంత్రి అమిత్‌షాను కోరుతూ ఆయన ట్విట్టర్‌లో ట్యాగ్ చేశారు.