ఓట్ల తొలగింపు ఇలా జరుగుతోంది : పూస గుచ్చినట్టు వివరించిన సీపీ

  • Published By: veegamteam ,Published On : March 7, 2019 / 02:27 AM IST
ఓట్ల తొలగింపు ఇలా జరుగుతోంది : పూస గుచ్చినట్టు వివరించిన సీపీ

హైదరాబాద్: ఐటీ గ్రిడ్స్, డేటా చోరీ కేసులో అసలేం జరిగింది? సేవామిత్ర యాప్ లో ఏం జరుగుతోంది? ఐటీ గ్రిడ్స్ కంపెనీలో ఏం చేస్తున్నారు? ఓట్లను ఎలా తొలగిస్తున్నారు? ఈ ప్రశ్నలు అందరిలోనూ ఉత్కంఠ రేపుతున్నాయి. అసలేం జరుగుతోంది? అనేది తెలుసుకునేందుకు అంతా ఆసక్తిగా ఉన్న వేళ.. హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్‌ కీలక వివరాలు తెలిపారు. ఐటీ గ్రిడ్స్‌ వ్యవహారంలో ‘టీడీపీ కీ-పర్సన్‌’ అనే కోడ్‌తో పిలిచే వారు కీలకంగా వ్యవహరించారని గుర్తించారు. టీడీపీకి ఈ ‘కీ’ పర్సన్స్‌ ఎవరనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. ఈ యాప్‌ వ్యవహారంలో ఆన్‌లైన్‌లో జరిగే కీలక పరిణామాలను మ్యాప్‌ రూపంలో సీపీ వివరించారు.
Also Read: మీ ఓటు సేఫ్‌గా ఉండాలంటే : వెంటనే ఇలా చేయండి

ఏపీ ప్రజలకు చెందిన ఆధార్, ఓటర్ ఐడీ లాంటి సున్నితమైన సమాచారం సేకరించి ఓట్ల తొలగింపునకు పాల్పడుతున్నారని సీపీ తెలిపారు. టీడీపీకి చెందిన ‘సేవా మిత్ర’ యాప్‌ ద్వారా ఎన్నికల సరళిపై సర్వే చేస్తున్నారని అన్నారు. నియోజకవర్గాల వారీగా ప్రజల ఆధార్‌ నంబర్‌, సామాజిక వర్గం, ఏ పార్టీకి అనుకూలంగా ఉన్నారు తదితర వివరాలు సేకరిస్తున్నారని చెప్పారు. క్షేత్ర స్థాయిలో సేకరించిన సమాచారాన్ని ఐటీ గ్రిడ్స్ పరిశీలిస్తోందని.. అనంతరం ఈ సమాచారాన్ని టీడీపీ బూత్‌ కన్వీనర్లకు చేరవేస్తున్నారని… వారు పార్టీకి అనుకూలంగా లేని వ్యక్తులను గుర్తించి.. తమ ఓట్లను తొలగించాలంటూ ఆయా ఓటర్లే కోరుతున్నట్లుగా దరఖాస్తు చేస్తున్నట్లు అనుమానం వ్యక్తం చేశారు.

* సేవామిత్ర యాప్‌ను రూపొందించిన ఐటీ గ్రిడ్స్‌ సంస్థ.. వివిధ మార్గాల్లో ఏపీ ప్రజల వ్యక్తిగత, రహస్య డేటా సేకరించింది.
* దీని ఆధారంగా ఇక్కడి కాల్‌ సెంటర్‌లోని వాళ్లు, క్షేత్రస్థాయిలో ఉన్న సర్వేయర్లు ముందుగా రూపొందించుకున్న ప్రశ్నావళి ప్రకారం ఓటర్ల అభిప్రాయాలు సేకరిస్తారు.
* వారు చెప్పే అంశాలను పొందుపరుస్తూ.. ఆ వివరాలను సేవామిత్ర సైట్‌కు అప్‌లోడ్‌ చేస్తారు.
* ఈ డేటాను ఐటీ గ్రిడ్స్‌ సంస్థ ఓ క్రమపద్ధతిలో ఏర్పాటు చేస్తుంది.
* దీన్ని నియోజకవర్గాల్లోని బూత్‌ స్థాయి సేవామిత్ర కన్వీనర్లకు అనువుగా తయారు చేసి వారికి పంపిస్తుంది.
* క్షేత్రస్థాయిలో సర్వే చేస్తూ అందులోని ఓటర్ల వివరాలను సరిచూసే ఈ బూత్‌ స్థాయి కన్వీనర్లు వారి ఆధార్, మొబైల్‌ నంబర్లు, కులం, రాజకీయ ప్రాధాన్యం వివరాలు సేకరిస్తారు.
* ఇలా రూపొందించిన డేటాను మళ్లీ హైదరాబాద్‌లోని అయ్యప్పసొసైటీలో ఉన్న ఐటీ గ్రిడ్స్‌ సంస్థకు పంపిస్తారు.
* ఈ డేటాను మరికొన్ని కోణాల్లో విశ్లేషించే ఐటీ గ్రిడ్స్‌ సంస్థ టీడీపీ వ్యతిరేక ఓటర్లు, ఆయా ప్రాంతాల్లో లేని వారిని గుర్తిస్తుంది. ఇలా సమగ్ర విశ్లేషణతో తయారు చేసిన జాబితాలను టీడీపీ ‘కీ’ పర్సన్‌కు పంపిస్తుంది. యాప్‌లో వీరికి ‘టీడీపీ కీ-పర్సన్‌’ అనే కోడ్‌ వర్డ్‌ ఇచ్చారు.
* ఆ కీపర్సన్‌ తనకు అందిన ఫైనల్‌ జాబితాలోని ఓటర్లు టీడీపీకి చెందిన వారు కాదని నిర్ధారించుకుంటాడు.
* వారి పేరుతో తప్పుడు మార్గంలో ఫామ్‌-7 రూపొందించి ఓట్లు తొలగించేందుకు ఓటర్‌ ప్రమేయం లేకుండానే సంబంధిత అధికారికి పంపించేస్తారు.
* సేవామిత్ర సర్వేలో వేరే పార్టీకి ప్రాధాన్యం ఇచ్చిన వారు తమకు ఓటు వేయరనే ఉద్దేశంతో తొలగించేస్తున్నారు. సర్వే సమయంలో అందుబాటులో లేని వాళ్లు.. పోలింగ్‌ సమయంలో వచ్చి వేరే  పార్టీకి ఓటు వేస్తారనే ఉద్దేశంతో తీయించేస్తున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు.

సర్వే చేయడానికి ఐటీ గ్రిడ్ సంస్థ ప్రశ్నావళి తయారు చేసిందని చెప్పిన సీపీ అంజనీ కుమార్.. ఆ ప్రశ్నావళిలోని కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను బయటపెట్టారు.
Also Read: గుడ్ న్యూస్ : డబుల్ కానున్న కనీస వేతనం

* మీరు మీ నియోజకవర్గంలో ఉన్నారా? లేకపోతే వేరే చోట ఉంటున్నారా?
* మీరు ఏ పార్టీకి చెందిన వారు?
* వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటు వేస్తారు?
* వచ్చే ఎన్నికల్లో ఎవరికి ఓటు వేస్తారు?
* ఏ పార్టీకి ఎంత రేటింగ్ ఇస్తారు?

ఇలాంటి సున్నితమైన సమాచారాన్ని సేకరించి ఆ డేటాను భద్రపరిచి కీలక వ్యక్తికి చేరవేస్తున్నట్లు సీపీ తెలిపారు. ఆ వ్యక్తి ఫీల్డ్ లెవల్ సేవామిత్రకు చేరవేయగా.. వాళ్లు సదరు వ్యక్తుల ఆధార్, ఓటర్ కార్డును సేకరిస్తున్నట్లు వెల్లడించారు. ఆ సమాచారమంతా ఐటీ గ్రిడ్ సంస్థ భద్రపరుస్తున్నట్లు చెప్పారు. ఎవరైతే నియోజకవర్గాల్లో లేరో వారి ఓట్లనే తీసేస్తున్నారని సీపీ తెలిపారు. ఈ అంశంపై ఎన్నికల సంఘానికి లేఖ రాశామని, మరిన్ని గైడ్‌లైన్స్ కోరామన్న సీపీ.. దీని వెనుక ఎంత పెద్ద వ్యక్తులు ఉన్నా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Also Read: ఎరక్కపోయి..ఇరక్కపోయాడు : చిన్నోడికి చిలుక కష్టాలు