ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధం 

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది.

  • Published By: veegamteam ,Published On : March 22, 2019 / 02:20 AM IST
ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధం 

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది.

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో కాసేపట్లో ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రారంభం కానున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో పట్టభద్రుల కోటాలో రెండు, ఉపాధ్యాయ కోటాలో ఒకటి, తెలంగాణలో పట్టభద్రుల కోటాలో ఒకటి, ఉపాధ్యాయ కోటాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఉదయం 8  గంటల నుంచి సాయంత్రం 4  వరకు పోలింగ్ కొనసాగనుంది. ఈనెల 26న కౌంటింగ్ జరగనుంది.

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. తెలంగాణలోని కరీంనగర్-మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్‌లో ఉపాధ్యాయ కోటాలో ఏడుగురు అభ్యర్థులు.. పట్టభద్రుల కోటాలో 17మంది పోటీలో ఉన్నారు. టీఆర్ఎస్ మద్దతుతో గ్రూప్ వన్ ఆఫీసర్  మామిండ్ల చంద్రశేఖర్‌గౌడ్, కాంగ్రెస్ సపోర్ట్‌తో ఆ పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డి బరిలో ఉన్నారు. లక్షా 96వేల321మంది పట్టభద్రులు, 23వేల 214మంది ఉపాధ్యాయులు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

నల్లగొండ-ఖమ్మం-వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో 9మంది అభ్యర్థులు బరిలో ఉండగా.. ఇద్దరిమ ధ్యే పోటీ కనిపిస్తోంది. ఈ ఎమ్మెల్సీ స్థానం పరిధిలో 20వేల 585మంది ఉపాధ్యాయులున్నారు. పీఆర్టీయూ నుంచి పూల రవీందర్‌ను టీఆర్ఎస్  బలపరుస్తోంది. యూటీఎఫ్ మద్దతుతో అలుగుబెల్లి నర్సిరెడ్డి పోటీలో ఉన్నారు. 

ఆంధ్రప్రదేశ్‌లోని మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఉభయగోదావరి- కృష్ణా గుంటూరు జిల్లాలకు చెందిన పట్టభద్రుల కోటాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లా ఉపాధ్యాయుల కోటాలో ఒక ఎమ్మెల్సీ స్థానానికి  పోలింగ్ జరగనుంది. పట్టభద్రులు, ఉపాధ్యాయుల కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ప్రధాన పార్టీలు అభ్యర్ధులను ప్రకటించకపోవటంతో దాదాపు 93 మంది ఇండిపెండెంట్లు నామినేషన్లు దాఖలు చేశారు. రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి ఒక నామినేషన్ దాఖలైంది. 

కృష్ణా -గుంటూరు స్థానానికి 46 నామినేషన్లు, తూర్పు-పశ్చిమ గోదావరి పట్టభద్రుల స్థానానికి 40 నామినేషన్లు వచ్చాయి. ఇక విశాఖ-విజయనగరం- శ్రీకాకుళం పాధ్యాయుల కోటా ఎమ్మెల్సీ స్థానానికి 8 మంది నామినేషన్లు దాఖలయ్యాయి. కృష్ణా జిల్లాలో 166,  గుంటూరులో 176,  తూర్పుగోదావరి జిల్లాలో 166, పశ్చిమ  గోదావరి జిల్లాలో 133 పోలింగ్  కేంద్రాలను ఏర్పాటు చేశారు. కృష్ణా గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గంలో 2 లక్షల 44 వేల 635 మంది, తూర్పు- పశ్చిమ గోదావరి జిల్లా పట్టభద్రుల నియోజకవర్గంలో 2  లక్షల 90 వేల 780 మంది  ఓటర్లు ఉన్నారు.

అలాగే ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గంలో 19 వేల 593 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఓటర్లు 11 రకాల కార్డులను  అధీకృత  దృవపత్రాలను చూపించి ఓటు హక్కును  వినియోగించుకోవచ్చని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభమై.. సాయంత్రం 4గంటలకు ముగియనుంది. ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈనెల 26న చేపట్టనున్నారు.