Food Delivery App : యాప్‌ల దోపిడీ.. కస్టమర్లను అడ్డంగా దోచుకుంటున్న ఫుడ్ డెలివరీ యాప్స్

కొన్ని ఫుడ్ డెలివరీ యాప్ ల తీరు వివాదానికి దారి తీస్తోంది. పలు ఫుడ్ డెలివరీ యాప్ లు కస్టమర్లను దోచుకుంటున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తాయి. హైదరాబాద్ లో చోటు చేసుకున్న ఓ ఘటన ఇందుకు నిదర్శనం.

Food Delivery App : యాప్‌ల దోపిడీ.. కస్టమర్లను అడ్డంగా దోచుకుంటున్న ఫుడ్ డెలివరీ యాప్స్

Delivery App

Food Delivery App : కొన్ని ఫుడ్ డెలివరీ యాప్ ల తీరు వివాదానికి దారి తీస్తోంది. పలు ఫుడ్ డెలివరీ యాప్ లు కస్టమర్లను దోచుకుంటున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తాయి. హైదరాబాద్ లో చోటు చేసుకున్న ఓ ఘటన ఇందుకు నిదర్శనం. రెస్టారెంట్లు, హోటల్స్ లో ఆహార పదార్ధాలకు వసూలు చేసే ధరకన్నా ఎక్కువగా ఫుడ్ డెలివరీ యాప్ కస్టమర్ల నుంచి వసూలు చేస్తోంది. హైదరాబాద్ నగరానికి చెందిన సామాజిక కార్యకర్త విజయగోపాల్ దీనికి సంబంధించి ఓ పోస్టును సోషల్ మీడియాలో పెట్టారు. ధరల్లో వ్యత్యాసాలను ప్రశ్నిస్తూ ఆయన పోస్టు పెట్టారు. రెస్టారెంట్ లో ఒక ధర ఉంటే, ఫుడ్ డెలివరీ యాప్ మరో ధరను వసూలు చేస్తోందని ఆయన వాపోయారు.

పారడైజ్ రెస్టారెంట్ లో నిజామీ మటన్ బిర్యానీ ధర రూ.265. అక్కడ కౌంటర్ లో ఈ ధరకు బిర్యానీ ఇస్తారు. అయితే ఫుడ్ డెలివరీ యాప్ మాత్రం అదే బిర్యానీకి రూ.405 తన నుంచి వసూలు చేసిందని ఆయన ఆరోపించారు. ధర వ్యత్యాసంపై ఆయన తీవ్రంగా స్పందించారు.

”ఇది ఎలాంటి వ్యాపారం? ఇది కరెక్ట్ కాదు. ఒకే ఫుడ్ ఐటెమ్. పారడైజ్ రెస్టారెంట్ రూ.265కు అమ్ముతోంది. ఆన్ లైన్ యాప్స్ మాత్రం రూ.405 వసూలు చేస్తున్నాయి. పీయూష్( వినియోగదారు వ్యవహారాల శాఖ), గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇంత అన్యాయంగా కస్టమర్ల నుంచి వసూలు చేస్తుంటే ఏం చేస్తున్నారు? వినియోగదారుల రక్షణ అథారిటీ వెంటనే జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా” అని గోపాల్ తన ఫేస్ బుక్ లో పోస్టు పెట్టారు.

చాలా మంది ఆయనకు మద్దతు తెలిపారు. రెస్టారెంట్లు వంటకాలను తమకు నచ్చిన రేట్లకు అమ్ముతున్నాయి. ఒక్కో రెస్టారెంట్ ఒక్కో ధర వసూలు చేస్తున్నాయి. ఫిక్స్డ్ ఎమ్మార్పీ లేదు. అయితే ఫుడ్ డెలివరీ యాప్స్ మాత్రం కమిషన్, డెలివరీ చార్జీలు, అడ్వర్ టైజ్ మెంట్ ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. ఈ భారం మొత్తాన్ని కస్టమర్ పై వేస్తున్నాయి. నేరుగా రెస్టారెంట్ కు వెళ్లలేని పరిస్థితుల్లో ఆన్ లైన్ యాప్స్ లో ఫుడ్ ఆర్డర్ చేస్తే, ఆ యాప్ లు కస్టమర్లను దోచుకుంటున్నాయనే అభిప్రాయిన్ని నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు.

ధరల వ్యత్యాసాలు, ఆన్ లైన్ డెలివరీ యాప్ ల దోపిడీని నిలదీస్తూ విజయ్ గోపాల్ నెల క్రితం ఫేస్ బుక్ లో పోస్టు పెట్టారు. అయితే ఇంతవరకు దీనిపై అధికారులు స్పందించ లేదు.