స్వైన్ ఫ్లూ పంజా: గాంధీలో నల్సార్ విద్యార్థులు

  • Published By: veegamteam ,Published On : January 29, 2019 / 03:06 AM IST
స్వైన్ ఫ్లూ పంజా: గాంధీలో నల్సార్ విద్యార్థులు

హైదరాబాద్ : శీతగాలుల ధాటికి పలు వైరస్ లు విజృంభిస్తున్నాయి. దీంతో నగరవాసులు వణికిపోతున్నారు. ఉష్ణోగ్రతలు భారీగా  పడిపోతుండటంతో స్వైన్ ఫ్లూ వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. ఈ క్రమంలో  సోమవారం (జనవరి 28)న స్వైన్‌ ఫ్లూ లక్షణాలతో  శామీర్‌పేటలోని నల్సార్ యూనివర్సిటీకి చెందిన నలుగురు  స్టూడెంట్ సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. వీరితో కలిపి  స్వైన్‌ ఫ్లూతో గాంధీ ఆస్పత్రిలో  చికిత్స పొందుతున్నవారు తొమ్మిది మందికి చేరారు.

రోజుకో తీరుగా మారిపోతున్న వాతావరణంలో అనూహ్యంగా మార్పులు చోటుచేసుకోవటంతో స్వైన్ ఫ్లూ వ్యాధి వేగంగా స్ప్రెడ్ అవుతోందని గాంధీ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఈ క్రమంలో  చిన్నారులు, వృద్ధులు, గర్భిణీ స్త్రీలు అత్యవతసరంగా తగిన జాగ్రత్తలు  పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. ఫ్లూ లక్షణాలు ఉన్నట్లయితే వెంటనే  ఆసుపత్రికి వెళ్లి డాక్టర్స్ సలహాలు, సూచనలకు పాటించాలని లేదంటే అది మరింతగా వ్యాపించి ప్రాణాపాయానికి కూడా దారి తీసే అవకాశం ఉంటుందని డాక్టర్స్ హెచ్చరిస్తున్నారు.

స్వైన్ ఫ్లూ కారక హెచ్1 ఎన్1 వైరస్ కారణంగా తెలంగాణలో ఇప్పటికే 75 మందికి పైగా మరణించిన సంగతి తెలిసిందే. చల్లదనం పెరిగే కొద్దీ మరింతగా వ్యాపించే ఈ వ్యాధికి గురయ్యే అవకాశముంటుదంటున్నారు. పడిపోతున్న ఉష్ణోగ్రతలు.. పెరుగుతున్న శీత గాలులు హైదరాబాద్ నగరవాసులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. సాధారణ జలుబులో ఉండే లక్షణాలే స్వైన్ ఫ్లూకు ఉండటం గమనార్హం. 

మరోవైపు.. మరో 48 గంటల పాటు శీతల గాలుల ప్రభావం మరింత అధికంగా ఉంటుందని..హైదరాబాద్‌లో కనిష్ట ఉష్ణోగ్రత 17 డిగ్రీలుగా నమోదు కాగా, గరిష్టంగా 21 డిగ్రీలు నమోదయ్యాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీంతో ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది. మహారాష్ట్రలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం రాష్ట్రంపై కొనసాగుతోందని మరో రెండు రోజుల పాటు చిరుజల్లులు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.