చల్లని కబురు : తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన

  • Published By: veegamteam ,Published On : March 10, 2019 / 02:46 AM IST
చల్లని కబురు : తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన

మాడు పగులకొట్టే ఎండలు, చెమట్లు పట్టించే ఉక్కపోతలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు వినిపించింది. రాగల 3 రోజులు అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర ఇంటీరియర్ కర్నాటక దాని పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 0.9  కిలోమీటర్ల ఎత్తు వద్ద ఉపరితల ఆవర్తనం స్థిరంగా కొనసాగుతోందని, దీని ప్రభావంతో పలుప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశముందన్నారు.

హైదరాబాద్ వాసులు కాస్త రిలీఫ్ పొందారు. వాతావరణం కొంత చల్లబడింది. ఎండ నుంచి ఉపశమనం లభించింది. ఉపరితల ఆవర్తన ప్రభావం కారణంగా గ్రేటర్ హైదరాబాద్‌లో ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గి వాతావరణం కొంత కూల్ అయ్యింది. గరిష్ఠ ఉష్ణోగ్రత 34.8 డిగ్రీలు, కనిష్ఠం 23.1 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైనట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. గ్రేటర్‌లోని పలుచోట్ల ఆదివారం(మార్చి,10) తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని చెప్పారు. సోమవారం(మార్చి 11) నుంచి రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంటుందని వాతావరణ కేంద్రం అధికారి తెలిపారు.

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. వేసవి ప్రారంభంలోనే సూర్యుడు మంట పుట్టిస్తున్నాడు. ఎండలతో జనాలను ఠారెత్తిస్తున్నాడు. ఏపీ, తెలంగాణలోని  జిల్లాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. హైదరాబాద్‌లో 35 డిగ్రీలకు పైగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలకు తోడు కాంక్రీట్‌ మహారణ్యం కారణంగా అతినీల లోహిత కిరణాల తీవ్రత భారీగా పెరిగింది.  అల్ట్రా వయొలెట్‌ రేడియేషన్‌ ఇండెక్స్‌ (యూవీ) సూచి ‘10’పాయింట్లకు చేరింది. సాధారణంగా యూవీ సూచీ 9 పాయింట్లకు మించితే అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. కానీ మార్చిలోనే 10 మార్కు దాటేసింది. ఉష్ణోగ్రతల్లో పెరుగుదల ఇలాగే కొనసాగితే ఏప్రిల్, మేలో యూవీ సూచి 12 పాయింట్లకు చేరే ప్రమాదముందని వాతావరణ శాఖ అంచనా వేసింది.