కరోనా రెచ్చిపోతుంది.. గతేడాది ఫలితాలే రిపీట్

కరోనా రెచ్చిపోతుంది.. గతేడాది ఫలితాలే రిపీట్

coronavirus cases: కరోనా భూతం మళ్లీ సెగ పెంచింది. కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా శ్రమిస్తున్నా ఆందోళన పెంచుతున్న కొత్త రెండు కరోనా స్ట్రెయిన్స్‌ కనిపించి భయం పెంచుతున్నాయి. మహారాష్ట, కేరళలో కనిపించిన కేసుల గురించి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ మంగళవారం వెల్లడించింది. ఈ రెండింటిలో ఒకటి తెలంగాణలో కూడా ఉంది.

‘ఇప్పుడు శాస్త్రవేత్తలు వీటి గురించే చర్చిస్తున్నారు. ఎన్‌440కే, ఈ484క్యూ అనే రెండు కొత్త స్ట్రెయిన్స్‌ దేశంలో నమోదవుతున్నాయి. మహారాష్ట్ర, కేరళ, తెలంగాణ రాష్ట్రాల్లో రెండు కొత్త రకాల కేసులు వెలుగులోకి వచ్చాయి’ అని నీతిఅయోగ్‌ సభ్యుడు డాక్టర్‌ వీకే పాల్‌ స్పష్టం చేశారు. జన్యుమార్పులకు లోనైన ఈ కరోనా రకాలు బ్రిటన్, దక్షిణాఫ్రికా, బ్రెజిల్‌ నుంచి వ్యాప్తి అయ్యాయని తెలిపారు. ఇప్పటివరకు ఉన్న గణాంకాల ప్రకారం 187 మందిలో యూకే స్ట్రెయిన్, ఆరుగురిలో దక్షిణాఫ్రికా, ఒక్కరిలో బ్రెజిల్‌ రకం కరోనా కేసులు నమోదయ్యాయని పాల్‌ వెల్లడించారు.

రెండు రాష్ట్రాల్లో 75శాతం యాక్టివ్‌ కేసులు
దేశవ్యాప్తంగా ఉన్న యాక్టివ్‌ కేసుల్లో 75% కేసులు మహారాష్ట్ర, కేరళలోనే ఉన్నాయి. 38% కేరళలో, 37% మహారాష్ట్రలో, 4% కర్ణాటకలో, 2.78% తమిళనాడులో యాక్టివ్‌ కేసులున్నట్టుగా కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్‌ భూషణ్‌ చెప్పారు. ఇప్పటికీ యాక్టివ్‌ కేసులు లక్షన్నర కంటే తక్కువగా ఉన్నట్లు సమాచారం. మంగళవారం మధ్యాహ్నం నాటికి కోటీ 17 లక్షల 64 వేల 788 మందికి కరోనా టీకా ఇచ్చినట్టు అధికారులు చెబుతున్నారు. 24 గంటల్లో దేశంలో 10వేల 584 కేసులు నమోదయ్యాయి.

మళ్లీ పుంజుకుంటున్న కరోనా
* మహారాష్ట్రలోని అమరావతి డివిజన్‌లో అకోలా, అమరావతి, వార్ధా, యావత్మాల్‌ జిల్లాల్లో గతేడాది సెప్టెంబర్‌ నాటి పరిస్థితులు కనిపిస్తున్నాయి.
* మహారాష్ట్ర 81%, మధ్యప్రదేశ్‌ 43% పంజాబ్‌ 31%, జమ్మూకశ్మీర్‌ 22%, ఛత్తీస్‌గఢ్‌ 13%, హరియాణా 11% పెరిగిపోతున్న కేసులు.
* ఢిల్లీలో 4.7%, కర్ణాటక 4.6%, గుజరాత్‌లో 4% పెరుగుతున్న కేసులు.
* 16 రాష్ట్రాలు–కేంద్ర పాలిత ప్రాంతాల్లో వారం రోజులుగా కరోనా కేసుల పెరుగుదల.