Afghan People Fear : తాలిబన్ల అప్పటి క్రూర పాలన.. వణికిపోతున్న అఫ్ఘాన్ ప్రజలు!
తాలిబన్ల ఒకప్పటి క్రూరపాలన తలుచుకుంటే చాలు.. అక్కడి అప్ఘాన్ ప్రజల వెన్నులో వణుకుపుట్టిస్తోంది. ప్రాణభయంతో పరుగులు పెడుతున్నారు.

Afghan People Fear For Their Future As Taliban
Afghan People Fear : తాలిబన్ల ఒకప్పటి క్రూరపాలన తలుచుకుంటే చాలు.. అక్కడి అప్ఘాన్ ప్రజల వెన్నులో వణుకుపుట్టిస్తోంది. ప్రాణభయంతో పరుగులు పెడుతున్నారు. అప్ఘాన్ రాజధాని కాబూల్ ను తాలిబన్లు ఆక్రమించుకోబోతున్నారని తెలియగానే ఆఫ్ఘాన్ల గుండెల్లో గుభేలుమంది. ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకుని ఎక్కడికి పారిపోవాలో తెలియక గజగజ వణికిపోతున్నారు. కుర్రాళ్లంతా కంగారుగా ఇళ్లకు పరుగులు తీస్తున్నారు. వేసుకున్న టీ షర్ట్, జీన్స్‌లను తీసిపారేశారు. సంప్రదాయ దుస్తులను ధరిస్తున్నారు. బ్యూటీ పార్లర్ గోడపై మహిళ ఫొటోపై రంగు పూసి అది కనిపించకుండా చేశాడు.
అలాగే కాబూల్ యూనివర్శిటీ విద్యార్థినులు అధ్యాపకులకు తుది వీడ్కోలు చెప్పేశారు. ఇక యూనివర్శిటీకి వచ్చే పరిస్థితి ఉండకపోవచ్చుంటూ కన్నీంటిపర్యంతమయ్యారు. మహిళలు ఇంట్లో నుంచి బయటకు రావాలంటే భయంతో వణికిపోతున్న పరిస్థితి. ఇప్పటికే తాలిబన్ల ఆక్రమణతో వివిధ దేశాల రాయబార కార్యాలయాలన్నీ మూతపడ్డాయి. ఈ విపత్కర పరిస్థితుల్లో ఏ దేశానికైనా వెళ్లి ఆశ్రయం పొందే అవకాశం లేక అక్కడి ప్రజలంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బతికితే తాలిబన్ల పాలనలో బతకాలి.. కాదని ఎదురుతిరిగితే ప్రాణాలు పోగట్టుకోవాల్సిందే..
భవిష్యత్తుపై బాలికల్లో తీవ్ర ఆందోళన :
అఫ్గాన్‌లో ప్రజాస్వామ్యానికి తావులేకుండా పోయింది. తాలిబన్ల రాకతో ఆ కలలన్నీ కలగానే నిలిచిపోయాయి. 1996-2001 మధ్య తాలిబన్ల క్రూర పాలన ఇప్పటికీ కళ్లకు కట్టినట్టుగా కనిపిస్తోంది. తాలిబన్ల నుంచి విముక్తి పొందిన గత రెండు దశాబ్దాల్లో సాధించిన అభివృద్ధి కూడా నాశనమవుతుందని మహిళలు, స్థానిక మైనార్టీల్లో తీవ్ర ఆందోళన కనిపిస్తోంది. ఒక తరం పూర్తిగా నష్టపోయే పరిస్థితులు ఎదురయ్యాయంటూ ఆవేదన వెల్లగక్కుతున్నారు. దేశంలో శాంతిని, కొత్త శకాన్ని స్థాపిస్తామని తాలిబన్ల మాటలు విశ్వసించే పరిస్థితులు లేవు.
తాలిబన్లు పలు పాఠశాలలు, కార్యాలయాలను ఆక్రమించేశారు. మహిళలంతా బయటకు రావాలంటేనే భయంతో వణికిపోతున్నారు. మహిళా వైద్యులు కూడా బయటకు రావడం లేదు. ఒకప్పుడు తాలిబన్ల పాలనలో అమలు చేసిన కఠిన ఆంక్షలు మళ్లీ అమలు చేస్తారేమోనన్న భయమే ఎక్కువగా అప్ఘాన్ ప్రజల్లో కనిపిస్తోంది. 12 ఏళ్లు దాటిన బాలికలు పాఠశాలకు వెళ్లకూడదనే ఆంక్షలను ఎక్కడ అమలు చేస్తారనన్న భయాందోళనగా ఉన్నారు.
Trump: అఫ్ఘానిస్తాన్ సంక్షోభం.. బైడెన్ రాజీనామాకు ఇదే సమయం.. ట్రంప్ పిలుపు
ఒకవైపు సైనికులకు, ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిన వారిలోనూ భయం కమ్మేసింది. ఎవరికి హాని తలపెట్టబోమని తాలిబన్లు ప్రకటించినప్పటికీ అక్కడి ప్రజల్లో నమ్మకం కలగడం లేదు. ఇప్పటికే రాష్ట్రంలోని మలిస్థాన్ జిల్లాలో ఇంటింటికి వెళ్లిన ఘజనీ.. అక్కడి ప్రభుత్వానికి మద్దతుగా నిలిచినవారి వివరాలు సేకరించే పనిలో పడ్డారు. దాంతో అక్కడి ప్రజల్లో మరింత భయం పట్టుకుంది. హజరా మైనార్టీలు సైతం తాలిబన్ల రాకతో భయంతో వణికిపోతున్నారు. తాలిబన్లను ఆదేశాలను ధిక్కరించి పలు రంగాల్లో అభివృద్ధి సాధించారు.
ఎక్కడా తమపై తాలిబన్లు దాడిచేస్తారేమోనన్న భయంతో సురక్షిత ప్రాంతాలకు పారిపోయేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కాబూల్ నగరమంతా ఖాళీగా కనిపిస్తోంది. రోడ్లన్నీ వెలవెలబోతున్నాయి. తాలిబన్లకు మద్దతుగా వారి నలుపు, తెలుపు జెండాలను పట్టుకొని తిరుగుతున్నవారే కనిపిస్తున్నారు. మిగిలిన వారు ఎవరూ బయట కనిపించడం లేదు. ఇక ఆ దేవుడి తమను కాపాడాలంటూ వేడుకుంటున్నారు. దేవుడిపై భారం వేసి ప్రాణాలను గుప్పిట్లో పట్టుకుని బిక్కుబిక్కుమంటున్నారు.
Taliban : అఫ్ఘాన్‌లో మళ్లీ తాలిబన్ల రాజ్యం!