Panjshir : అప్ఘాన్ లకు అండగా ” పంజ్ షిర్”..ఆయన పేరు వింటేనే తాలిబన్లకు వణుకు

కాబూల్ ఆక్రమణతో అప్ఘానిస్తాన్ లో ప్రభుత్వ ఏర్పాటుకి తాలిబన్ ఏర్పాట్లు చేసుకుంటున్న విషయం తెలిసిందే.

Panjshir : అప్ఘాన్ లకు అండగా ” పంజ్ షిర్”..ఆయన పేరు వింటేనే తాలిబన్లకు వణుకు

Afghan (3)

Panjshir కాబూల్ ఆక్రమణతో అప్ఘానిస్తాన్ లో ప్రభుత్వ ఏర్పాటుకి తాలిబన్ ఏర్పాట్లు చేసుకుంటున్న విషయం తెలిసిందే. అప్ఘానిస్తాన్ ని మెరుపు వేగంతో ఆక్రమించేసిన తాలిబన్లు ఒక్క రాష్ట్రంలో మాత్రం కాలు పెట్టలేకపోతున్నారు. ప్రస్తుతం అప్ఘానిస్తాన్ రాజకీయ వ్యవూహాలకు కేంద్ర బిందువుగా మారిన ” పంజ్ షిర్” ప్రాంతంలో అడుగుపెట్టాలని 25ఏళ్ల నుంచి తాలిబన్ ఎన్ని ప్రయత్నాలు చేసినా సాధ్యపడలేదు. ఎలాగైనా ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకొని.. అక్కడి ప్రజలను తమ కాళ్ల కింద తొక్కిపెట్టాలని తాలిబన్ చేస్తున్న కుట్రలు నేటికీ సాగడం లేదు. దానికి కారణం “పంజ్ షిర్” కి చెందిన అహ్మద్ షా మసూద్ పేరు వింటేనే తాలిబన్ ఫైటర్లకి వెన్నులో వణుకు పుడుతోంది. రాక్షసత్వానికే మారుపేరైన తాలిబన్లకు అహ్మద్ షా మసూద్ అంటే ఎందుకు అంత భయం..తాలిబన్లకు ప్రస్తుతం కంటిమీద కుణుకు లేకుండా చేస్తున్న పంజ్ షిర్ ప్రాంతం గురించి కొన్ని ఆశక్తికర విషయాలు తెలుసుకుందాం.

ఐదు సింహాల గడ్డ “పంజ్‌ షిర్‌”
అప్ఘానిస్తాన్ రాజధాని కాబూల్ కి ఉత్తరాన 150 కిలోమీటర్ల దూరంలో హిందూకుష్ పర్వత శ్రేణులకు సమీపంలో పంజ్ షిర్ రాష్ట్రం ఉంది. పంజ్‌ షిర్‌ అంటే సంస్కృతంలో ‘ఐదు సింహాలు’ అని అర్థం. 11వ శాతాబ్దంలో ఈ ప్రాంతానికి పెద్ద వరద వచ్చినప్పుడు వరద నీటిని అడ్డుకునేందుకు ఐదురుగురు సోదరులు వరద నీటిని అడ్డుకోవడానికి ప్రయత్నించడంతో ఈ ప్రాంతానికి ఐదు సింహాల గడ్డగా పేరు వచ్చిందని చరిత్ర చెబుతోంది. ఈ రాష్ట్ర జనాభా 1.73 లక్షలు. 400 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ప్రాంతంలోని ప్రజలు ఎన్నడూ ఒకరి కింద బానిసలుగా లేరు. పంజ్‌ షిర్‌ పేరుకు తగ్గటే అక్కడి ప్రజల్లో తెగింపు చాలా ఎక్కువ. ఈ ప్రాంతాన్ని ఇప్పటివరకూ విదేశీయులు, ఉగ్రవాదులు ఎవ్వరూ ఆక్రమించుకోలేకపోయారు. తాజాగా అఫ్గాన్‌లోని 34 ప్రావిన్సుల్లో 33 ప్రావిన్సుల్లో పాగా వేసిన తాలిబన్లు.. పంజ్‌ షిర్‌లోకి చొరబడలేకపోయారు. గతంలో తాలిబన్ల పాలనను తుదిముట్టించడంలోనూ ఈ ప్రాంతానిదే కీలక పాత్ర. అక్కడి ప్రజల్లో పోరాట పటిమతో పాటు అడవులు ఆ ప్రాంతానికి కోటలా రక్షణ నిలవడం అదనపు బలంగా ఉంది.

పంజ్ షిర్ సింహం “అహ్మద్ షా మసూద్”
పంజ్ షిర్ ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని రగిలించిన వారిని మార్గదర్శకత్వం చేసిన తాలిబన్ వ్యతిరేక నాయకుడు అహ్మద్ షా మసూద్. ఈయన రాజకీయ నాయకుడు మాత్రమే కాకుండా మిలటరీ కమాండర్ కూడా. 1970-80లో సోవియట్‌ రష్యా దండయాత్రను తిప్పికొట్టేందుకు ఆయన కొంత మంది యువకులతో గెరిల్లా సేనను తయారుచేశారు. యుద్ధ సమయాల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ఆధునిక ఆయుధాల వాడకంలో తర్ఫీదునిచ్చారు. దీంతో ఆ సేనలు సోవియట్‌ దళాల్ని ‘పంజ్‌షిర్‌’లోకి అడుగుపెట్టకుండా తిప్పికొట్టగలిగాయి. కాలక్రమేణా నార్తర్న్‌ అలయన్స్‌ (ఉత్తర కూటమి)గా ఏర్పడిన ఆ సేనలు 1996-2001 మధ్య తాలిబన్ల నుంచి పంజ్‌షిర్‌ను రక్షించాయి. దీంట్లో ప్రజల భాగస్వామ్యంతో పాటు ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన కొండలు ‘పంజ్‌షిర్‌’కు రక్షణగా నిలిచాయి.

2001లో యూరప్ ను సందర్శించి తాలిబన్లకు పాకిస్తాన్ మద్దతు లేకుండా ఒత్తిడి చేయాలంటూ యూరోపియన్ పార్లమెంట్ నేతలను కోరారు. తాలిబన్లు,అల్ ఖైదా ఉగ్రవాదులు కలిసి నకిలీ విలేకరుల వేషాల్లో మీడియా ఇంటర్వ్యూ చేస్తూ సెప్టెంబర్-9,2001న జరిపిన ఆత్మాహుతి దాడిలో అహ్మద్ షా మసూద్ ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత రెండు రోజులకే అమెరికాపై అల్ ఖైదా దాడులు చేయడం యావత్ ప్రపంచాన్నే ఆందోళనకు గురిచేసిన విషయం తెలిసిందే. ఇదే చివరకు అమెరికా,నాటో దళాలు అప్ఘానిస్తాన్ పై దాడి చేయడం,మసూద్ దళాలతో ఆ బలగాల స్నేహానికి దారితీసింది. ఆ తర్వాత ఉత్తర కూటమి తాలిబన్ల పాలనకు వ్యతిరేకంగా రెండు నెలల పాటు సుదీర్ఘ పోరాటం జరిపింది. చివరకు డిసెంబర్ 2001 నాటికి తాలిబన్ల పాలనను అంతం చేసి విజయం సాధించింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన హమీద్ కర్జాయ్…అహ్మద్ షా మసూద్ ని నేషనల్ హీరోగా ప్రకటింయడంతో పాటు ఆయన మరణం రోజుని సెలవు దినంగా నిర్ణయించారు.

ప్రస్తుతం తాలిబన్లకు సవాల్ విసురుతున్న పంజ్‌ షిర్‌

ఆదివారం కాబూల్ ని తాలిబన్లు ఆక్రమించడంతో అప్ఘాన్ అధ్యక్షుడు అష్రఫ్‌ ఘనీ దేశం నుంచి పారిపోగా, ఆపద్ధర్మ అధ్యక్షుడిని తానేనంటూ ఆ దేశ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సాలేహ్‌ ప్రకటించుకున్నారు. అయన ఈ కీలక ప్రకటన చేసింది ‘పంజ్‌షిర్‌’ నుంచే. అహ్మద్ షా మసూద్ కుమారుడు, నార్తర్న్‌ అలయన్స్‌లో కీలక పాత్ర పోషిస్తున్న అహ్మద్‌ మసూద్‌ (జూనియర్‌)తో కలిసి తాలిబన్లకు వ్యతిరేకంగా చేపట్టాల్సిన వ్యూహాలపై అమ్రుల్లా చర్చలు జరుపుతున్నారు. కాగా, తాలిబన్లను ఎదుర్కొనేందుకు నార్తర్న్‌ అలయన్స్‌తో కలిసి పనిచేస్తామని అఫ్గాన్‌ సేనలు, ప్రజలు ముందుకొస్తున్నారు.