Tokyo Olympics 2020: టోక్యో ఒలింపిక్స్ పతకాల పట్టికలో 48వ స్థానంలో భారత్..చైనాను అధిగమించిన అమెరికా

టోక్యో లో ఒలింపిక్స్ క్రీడలు ముగిసాయి. ఈ క్రీడల్లో పతకాల సాధనలో అమెరికా టాప్ 1 స్థానాన్ని దక్కించుకుంది.రెండో స్థానంలో చైనా ఉండగా 48వ స్థానంలో భారత్ ఉంది.

Tokyo Olympics 2020: టోక్యో ఒలింపిక్స్ పతకాల పట్టికలో 48వ స్థానంలో భారత్..చైనాను అధిగమించిన అమెరికా

America Tops China And India 48th Place In Medals The End Of Tokyo Olympics

Tokyo Olympics 2021 : జపాన్ రాజధాని టోక్యోలో ఒలింపిక్స్ క్రీడలు ముగిశాయి. కొద్దిసేపటి కింద ఒలింపిక్స్ ముగింపు ఉత్సవాలు నిర్వహించారు. జులై 23న ఒలింపిక్ క్రీడలు ప్రారంభం కాగా..కరోనా సంక్షోభ సమయంలోనూ జపాన్ ప్రభుత్వం ఎంతో దృఢ సంకల్పంతో క్రీడలు నిర్వహించింది. కరోనా నిబంధనలు పాటించటంలో ఏమాత్రం రాజీ పడకుండా..కట్టుదిట్టమైన బయో బబుల్ నిబంధనలు అమలు చేసి సజావుగా ఒలింపిక్స్ నిర్వహించి అందరి ప్రశసంలు అందుకుంది.

కరోనా ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న సమయంలో కూడా జపాన్ ఈ క్రీడల్ని సమర్థవంతంగా నిర్వహిచింది. 2020లో జరగాల్సి ఉండగా..సంవత్సరం పాటు వాయిదా ప‌డి..అసాధార‌ణ ప‌రిస్థితుల్లో ప్రేక్ష‌కుల‌ను అనుమ‌తించ‌కుండా జ‌రిగిన తొలి ఒలింపిక్ గేమ్స్ టోక్యోవే ఇవే కావ‌డం విశేషం. గేమ్స్ ప్రారంభానికి ముందు టోక్యోలో ఎమ‌ర్జెన్సీ ప‌రిస్థితులు..క్రీడల గ్రామంలో అథ్లెట్లు కొవిడ్ బారిన ప‌డినా మొత్తానికి రెండు వారాలకుపైగా టోక్యో ఒలింపిక్స్ ప్ర‌పంచాన్ని ఉర్రూతలూగించిన విశ్వ క్రీడా వేదిక ఒలింపిక్స్ ఘ‌నంగా ముగిశాయి.

పతకాల సాధనలు అమెరికా, చైనా నువ్వా నేనా..
ఈ టోక్యో ఒలింపిక్స్ లో పతకాల సాధన కోసం అన్ని దేశాలు తమ తమ ప్రతిభా పాటవాలను ప్రదర్శించాయి. కానీ ఎప్ప‌టిలాగే ఈసారి కూడా మెడ‌ల్స్ జాబితాలో టాప్‌లో ఉండ‌టానికి అమెరికా, చైనా మ‌ధ్య తీవ్ర‌మైన పోటీ నెల‌కొంది. నువ్వా నేనా అన్నట్లుగా సాగించి ఈ రెండు దేశాల మధ్యా పతకాల గెలుపు. గేమ్స్‌లో చాలా రోజుల వ‌ర‌కూ టాప్‌లో ఉన్న చైనాను చివ‌రి రోజు అమెరికా డ్రాగన్ దేశాన్ని వెన‌క్కి నెట్ట‌ేసి టాప్ 1 స్థానాన్ని కైవసం చేసుకుంది. శ‌నివారం వ‌ర‌కూ చైనా 38 గోల్డ్ మెడ‌ల్స్‌తో టాప్‌లో ఉండ‌గా.. అమెరికా ఖాతాలో 36 మాత్ర‌మే ఉన్నాయి.

కానీ ఆదివారం పరిస్థితి తారుమారు అయ్యింది. బాస్కెట్‌బాల్‌, వాలీబాల్‌ల‌తోపాటు సైక్లిస్ట్ జెన్నిఫ‌ర్ వాలెంటీ కూడా గోల్డ్ గెల‌వ‌డంతో అమెరికా మ‌ళ్లీ టాప్‌లోకి దూసుకుపోయింది. ఒలింపిక్స్‌లో అత్య‌ధిక మెడ‌ల్స్‌తో అమెరికా ముగించ‌డం ఇది వ‌రుస‌గా మూడోసారి. రికార్డు స్థాయిలో 600కుపైగా అథ్లెట్ల‌తో బ‌రిలోకి దిగిన అమెరికా.. మొత్తానికి త‌న అగ్ర‌స్థానాన్ని ప‌దిలం చేసుకుంది.

అమెరికా ఖాతాలో 39 గోల్డ్ మెడ‌ల్స్‌తోపాటు 41 రజతాలు, 33 కాంస్యాలు సహా మొత్తం 113 పతకాలు సాధించింది. గోల్డ్‌మెడ‌ల్ ప‌రంగా చూసినా, మొత్తంగా చూసినా అమెరికానే టాప్‌లో ఉంది. అయితే రియోగేమ్స్‌లో అమెరికాకు 121 మెడ‌ల్స్ వ‌చ్చాయి. అందులో 46 గోల్డ్ మెడ‌ల్స్ ఉన్నాయి. ఇక చైనాతో 38 స్వ‌ర్ణాల‌తోపాటు మొత్తం 88 మెడ‌ల్స్‌తో రెండోస్థానంతో స‌రిపెట్టుకుంది. గోల్డ్ మెడ‌ల్స్ ప‌రంగా జ‌పాన్ (27), బ్రిట‌న్ (22), ర‌ష్య‌న్ ఒలింపిక్ క‌మిటీ (20) టాప్ 5లో ఉన్నాయి.

48 వస్థానంలో ఇండియా

టోక్యో ఒలింపిక్స్‌లో ఇండియా ప‌రిస్థితి గతం కంటే కాస్త మెరుగుపడిందనే చెప్పాలి. రియో గేమ్స్‌లో 67వ స్థానంతో స‌రిపెట్టుకున్న భార‌త్‌.. ఈసారి ఏకంగా 19 స్థానాలు ఎగ‌బాకింది. శ‌నివారం ఉద‌యం వ‌ర‌కూ ఇండియా 66 స్థానానికి అటుఇటూగా ఉంటూ వ‌చ్చింది. అయితే జావెలిన్ త్రోలో నీర‌జ్ చోప్రా గోల్డ్ మెడ‌ల్‌తో ఒకేసారి 47వ స్థానానికి చేరుకుంది. ఆదివారం ఆట‌లు ముగిసే స‌మ‌యానికి ఒక స్థానం దిగ‌జారి 48తో స‌రిపెట్టుకుంది. ఇండియా ఖాతాలో 1 గోల్డ్‌, 2 సిల్వ‌ర్‌, 4 బ్రాంజ్ మెడ‌ల్స్ స‌హా మొత్తం 7 మెడ‌ల్స్ ఉన్నాయి. ఒలింపిక్స్‌లో ఇండియా సాధించిన అత్య‌ధిక మెడ‌ల్స్ ఇవే కావ‌డం విశేషం.