China-Taliban : తాలిబన్లతో చైనా చెట్టాపట్టాల్!

ఆఫ్గనిస్తాన్ ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకునేందకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న తాలిబన్లు ఇప్పుడు చైనా చెంతకు చేరారు.

China-Taliban : తాలిబన్లతో చైనా చెట్టాపట్టాల్!

Taliban

China-Taliban అమెరికా,నాటో దళాల ఉపసంహరణ తర్వాత ఆఫ్గనిస్తాన్ ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకునేందకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న తాలిబన్లు ఇప్పుడు చైనా చెంతకు చేరారు. ఇప్పటి వరకు పాకిస్తాన్ చేతుల్లో కీలుబొమ్మలా మారిన తాలిబన్లు.. ఇప్పుడు చైనాతో తమ సంబంధాలను మెరుగుపర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆఫ్గనిస్తాన్ లో తాము బలపడేందుకు మద్దతివ్వాలని తాలిబన్లు చైనా మద్దతు కోరారు.

రెండు రోజుల చైనా పర్యటనకు వెళ్లిన ముల్లా అబ్దుల్ ఘనీ బరదర్ నేతృత్వంలోని తొమ్మిదిమంది తాలిబన్ల ప్రతినిధుల బృందం బుధవారం ఈశాన్య చైనాలోని టియాంజిన్ నగరంలో చైనా విదేశాంగశాఖ మంత్రి వాంగ్ యితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇతర దేశాలపై దాడులకు ఆఫ్గన్ గడ్డను ఉపయోగించుకోవడానికి ఉగ్రవాదులను అనుమతించబోమని చైనాకు తాలిబన్లు హామీ ఇచ్చారు. చైనాలోని వీఘర్ తీవ్రవాద ఉద్యమానికి ఆఫ్గనిస్తాన్ లోని వాఖన్ కారిడార్ ఆశ్రయమిచ్చే అవకాశం ఉందని చైనా ఆందోళన చెందుతోన్న నేపథ్యంలో తాలిబన్లు..డ్రాగన్ దేశానికి ఈ భరోసా ఇచ్చారు.

ముల్లా బరదర్ నేతృత్వంలోని తాలిబన్ల బృందం వాంగ్‌ యితో పాటు చైనా డిప్యూటీ ఫారిన్ మినిస్టర్, ఆఫ్ఘనిస్థాన్ వ్యవహారాలకు సంబంధించిన చైనీస్ స్పెషల్ రిప్రజెంటేటివ్‌తో కూడా చర్చలు జరిపింది.ఆఫ్గన్ ప్రజలకు నిరంతరం సహకరిస్తున్నందుకు చైనాకు తాలిబన్ల ప్రతినిధి బృందం ధన్యవాదాలు తెలిపింది. కరోనా వైరస్ మహమ్మారికి వ్యతిరేకంగా పోరాటానికి చైనా అందజేసిన సహకారానికి ధన్యవాదాలు చెప్పింది. ఆఫ్గనిస్తాన్ లో ప్రస్తుత పరిస్థితులు, శాంతి ప్రక్రియ గురించి చైనాతో చర్చించినట్లు తాలిబన్ వెల్లడించింది. ఇరు దేశాల రాజకీయ, ఆర్థిక, భద్రత సంబంధిత సమస్యలపై ప్రధాన దృష్టితో ఈ చర్చలు సాగినట్లు తాలిబన్ ప్రతినిధి మొహమ్మద్ నయీమ్ తెలిపారు.

మరోవైపు, ఆఫ్గనిస్తాన్ యుద్ధాన్ని ముగించడం లేదా ఆఫ్గాన్ శాంతి ప్రక్రియలో మరియు దేశాన్ని పునర్నిర్మించడంలో తాలిబన్లు కీలక పాత్ర పోషిస్తారని భావిస్తున్నామని చైనాని సందర్శించిన తాలిబాన్ ప్రతినిధి బృందానికి డ్రాగన్ దేశం తెలిపిందని చైనా విదేశాంగశాఖ బుధవారం తెలిపింది. అదేవిధంగా,చైనా యొక్క జిన్జియాంగ్ ప్రాంతంలో యాక్టివ్ గా ఉంటూ చైనా యొక్క జాతీయ భద్రతకు ప్రత్యక్ష ముప్పు అయిన తూర్పు తుర్కెస్తాన్ ఇస్లామిక్ ఉద్యమాన్ని(ETIM) తాలిబాన్ అణిచివేస్తుందని తాను ఆశిస్తున్నానని చైనా విదేశాంగ మంత్రి తెలిపారు.