అమెరికా కరోనా వ్యాక్సిన్ డేటా దొంగిలించే ప్రయత్నంలో చైనా హ్యాకర్లు

  • Published By: vamsi ,Published On : July 31, 2020 / 01:57 PM IST
అమెరికా కరోనా వ్యాక్సిన్ డేటా దొంగిలించే ప్రయత్నంలో చైనా హ్యాకర్లు

కరోనా కట్టడికి వ్యాక్సిన్‌ ఒక్కటే మార్గం కాగా.. మొట్టమొదట ఎవరు వ్యాక్సిన్‌ అభివృద్ధి చేస్తారో వారే కోవిడ్‌–19 యుద్ధంలో విజేతగా నిలుస్తారు. ఈ క్రమంలో అగ్ర రాజ్యాల మధ్య వ్యాక్సిన్‌ వార్‌ నడుస్తుంది. అమెరికా, కెనడా, బ్రిటన్‌ చేస్తున్న టీకా పరిశోధనలకు అడుగడుగునా రష్యా, చైనా అడ్డు తగులుతున్నట్లుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.



ఈ క్రమంలో కరోనా వైరస్ వ్యాక్సిన్ మానవులపై ట్రయల్స్‌లో విజయవంతం అయిన మొదటి సంస్థలలో ఒకటి, చైనా ప్రభుత్వంతో అనుసంధానించబడిన మోడరనా ఇంక్‌ను చైనా హ్యాకర్లు ఎటాక్ చెయ్యాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ దాడి ద్వారా కరోనా వ్యాక్సిన్‌కు సంబంధించిన పరిశోధనలను, విలువైన డేటాను దొంగిలించే ప్రయత్నం జరిగింది. చైనా హ్యాకింగ్ కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్న అమెరికా భద్రతా అధికారులు ఈ విషయాన్ని వెల్లడించారు.



కరోనా వైద్య పరిశోధనలను దొంగలించేందుకు మూడు ప్రదేశాల్లో దాడులు జరిగాయని వారు చెబుతున్నారు. జనవరిలో మసాచుసెట్స్‌లోని బయోటెక్ కంపెనీ నెట్‌వర్క్‌ను చైనా హ్యాకర్లు ర్యాక్ చేసినట్లుగా ఆ ప్రకటన తెలిపింది. కరోనా వ్యాక్సిన్‌పై ఈ కంపెనీ పనిచేస్తోంది. కంపెనీ ఎఫ్‌బీఐ (ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్) తో సంప్రదింపులు జరుపుతోందని, హ్యాకింగ్ గ్రూప్ అనుమానం ఉందని మోడర్నా రాయిటర్స్‌కు ధృవీకరించింది.



చైనాలోని వూహాన్‌లో పుట్టిన కరోనా వైరస్‌తో ప్రపంచంలో అత్యధికంగా అమెరికాకే నష్టం జరిగింది. దీంతో రెండు దేశాల మధ్య అంతరం పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా క్లినికల్‌ ట్రయల్స్‌ దశకి వచ్చిన వ్యాక్సిన్‌లు 25 వరకు ఉంటే, అందులో అమెరికా ఫార్మా కంపెనీలు తొమ్మిదికి పైగా ఉన్నాయి. చైనాకు చెందిన కంపెనీలు నాలుగు ఉన్నాయి.