జనతా కర్ఫ్యూ, కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోలేదా? సైన్స్ ఏం చెబుతోంది

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి మన దేశంలోనూ చాప కింద నీరులా వేగంగా విస్తరిస్తోంది. రోజురోజుకి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే

  • Published By: veegamteam ,Published On : March 22, 2020 / 05:20 AM IST
జనతా కర్ఫ్యూ, కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోలేదా? సైన్స్ ఏం చెబుతోంది

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి మన దేశంలోనూ చాప కింద నీరులా వేగంగా విస్తరిస్తోంది. రోజురోజుకి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి మన దేశంలోనూ చాప కింద నీరులా వేగంగా విస్తరిస్తోంది. రోజురోజుకి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే కేసుల సంఖ్య 300 దాటింది. ఇప్పటికే ఒక దశను దాటేశాం. మూడో దశ చాలా ప్రమాదకరంగా ఉంటుంది. ఆ తర్వాత మన దేశంలో కరోనా వ్యాపిస్తే కట్టడి చేయడం చాలా కష్టం అని నిపుణులు అంటున్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. కరోనా కట్టడికి ప్రధాని మోడీ కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనాపై యుద్ధం ప్రకటించిన ప్రధాని మోడీ జనతా కర్ఫ్యూకి పిలుపునిచ్చారు. ప్రధాని పిలుపు మేరకు మార్చి 22న 14 గంటల పాటు జనతా కర్ఫ్యూలో యావత్ దేశ ప్రజలు పాల్గొంటున్నారు. 

జనతా కర్ఫ్యూ ద్వారా ఏంటి ప్రయోజనం అంటే, ప్రజలు 14 గంటల పాటు ఇళ్లలోనే ఉండటం వల్ల కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవచ్చని, కరోనా వైరస్ గొలుసుని అరికట్టవచ్చని అభిప్రాయం వినిపిస్తోంది. దీని ద్వారా మన దేశంలో వైరస్ వ్యాప్తిని రెండో దశ నుంచి తరిమికొట్టొచ్చని అంటున్నారు. ఒక ప్రదేశంలో కరోనా 12 గంటలు మాత్రమే బతికుంటుంది. జనతా కర్ఫ్యూ 14 గంటల పాటు పాటిస్తాం. కాబట్టి కరోనా వైరస్ చనిపోతుంది. గాలిలో, అన్ని ప్రాంతాల్లో కరోనా వైరస్ పూర్తిగా పోతుంది, ఆ తర్వాత మనకు కరోనా అంటుకోదు అని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.

అయితే ఈ ప్రచారంలో వాస్తవం లేదని నిపుణులు అంటున్నారు. జనతా కర్ఫ్యూ కరోనా వైరస్ వ్యాప్తిని కానీ, కరోనా వైరస్ గొలుసుని కానీ అరికట్టలేదని చెబుతున్నారు. దీనికి కారణం కూడా చెప్పారు. నిపుణుల అధ్యయనం ప్రకారం కరోనా వైరస్ వస్తువులపై మూడు రోజుల పాటు బతికే ఉంటుంది. కరోనా సోకిన వ్యక్తి మరో రెండు వారాల పాటు వైరస్ ని వ్యాప్తి చేయగలడు.

ఒక వైరల్ ఇన్ ఫెక్షన్ ఒకరి నుంచి మరొకరికి అనేక మార్గాల్లో వ్యాప్తి చెందుతుంది.
1. ప్రత్యక్షంగా : ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి వ్యాప్తి, టచ్ చేయడం ద్వారా, బాధితుడు దగ్గినా, తుమ్మినా వ్యాప్తి
2. పరోక్షంగా : ఇన్ ఫెక్ట్ అయిన వ్యక్తి ఏవైనా వస్తువులు ముట్టుకున్నప్పుడు, వాటిని మరొకరు టచ్ చేసినప్పుడు వైరస్ వ్యాపిస్తుంది

కరోనా వైరస్ వస్తువుల మీద మూడు రోజుల పాటు యాక్టివ్ గా(మనుగడ) ఉంటుంది కనుక, 14 గంటల స్వీయ నిర్బంధం కరోనా వ్యాప్తి గొలుసుని అరికట్టలేదని నిపుణులు అంటున్నారు. అయితే జనతా కర్ఫ్యూ వల్ల కొత్త సంక్రమణలు(new infections) అరికట్టవచ్చని స్పష్టం చేశారు.

కరోనా వైరస్ సంక్రమణ రేటు(incubation rate) అధికంగా ఉంది. శాస్త్రవేత్తలు అంచనా ప్రకారం ఒక కరోనా రోగి సగటున 2.6 మందికి కరోనా సోకించగలడు. కరోనా బారిన పడిన వ్యక్తి దానిని రెండు వారాల వరకు ఇతరులకు వ్యాపించగలడు. అతడిలో కరోనా లక్షణాలు బయటపడకపోయినా జరగాల్సిన నష్టం జరిగిపోతుందన్నారు.

కరోనా వైరస్ గాల్లో, బయటి ఉపరితలాలపై(వస్తువులు) ఎంత సేపు మనుగడ సాగించగలదన్న దానిపై జరిపిన అధ్యయనంలో కీలక విషయాలు తెలిశాయి. కరోనా వైరస్‌ గాలిలో 3గంటల పాటు సజీవంగా ఉంటుందని అధ్యయనంలో వెల్లడైంది. ఈ కొవిడ్‌-19 వైరస్‌ సులువుగా ఇతరుల శరీరాల్లోకి ప్రవేశిస్తుందని అమెరికాకు చెందిన అలర్జీ, అంటువ్యాధుల పరిశోధనా సంస్థ శాస్త్రవేత్తలు తెలిపారు. ప్లాస్టిక్‌, స్టెయిన్‌ లెస్ స్టీల్‌ ఉపరితలాలపై మూడు రోజుల వరకు ఇది క్రియాశీలకంగా ఉంటుందని గుర్తించారు. అట్టపెట్టెలపై ఒక రోజు, రాగి పాత్రలపై 4 గంటల పాటు  కరోనా వైరస్‌ మనుగడ ఉంటుందని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతుండటానికి ఈ సామర్థ్యమే కారణమని అభిప్రాయపడ్డారు.

సోషల్ మీడియాలో చెబుతున్నట్టుగా 14 గంటల జనతా కర్ఫ్యూ కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టలేదని నిపుణులు చెబుతున్నారు. ఏది ఏమైనా జనతా కర్ఫ్యూ అనే మంచి నిర్ణయం అన్నారు. కొత్తగా కరోనా కేసులు నమోదు కాకుండా చేయడంలో ఈ తరహా లాక్ డౌన్ సమర్థవంతంగా పని చేస్తుందన్నారు.