Virender Sehwag : పాండ్యకు నో ఛాన్స్.. టీ20 ప్రపంచకప్ కోసం సెహ్వాగ్ ఎంచుకున్న భారత జట్టు ఇదే..
ఐపీఎల్ ఫీవర్ ముగియగానే టీ20 ప్రపంచకప్ ఆరంభం కానుంది.

Virender Sehwag Names His Strongest India XI For T20 World Cup 2024
Virender Sehwag – Hardik Pandya : ఐపీఎల్ ఫీవర్ ముగియగానే టీ20 ప్రపంచకప్ ఆరంభం కానుంది. జూన్ 1 నుంచి ఆరంభం కానున్న ఈ టోర్నీకి, వెస్టిండీస్, అమెరికా దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. ఈ మెగాటోర్నీకి జట్టును ఎంపిక చేయాల్సిన గడుపు సమీపిస్తున్న తరుణంలో పలువురు మాజీ క్రికెటర్లు భారత జట్టు గురించి తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు. ఈ క్రమంలో టీమ్ఇండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా తన జట్టును ప్రకటించాడు.
ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు హార్దిక్ పాండ్య నాయకత్వం వహిస్తున్నాడు. ఈ ఆల్‌రౌండర్ అటు బ్యాట్‌తోగానీ, ఇటు బాల్‌తో గానీ రాణించడం లేదు. పేలవ ఫామ్‌తో టీ20 ప్రపంచకప్‌లో తన చోటును ప్రశ్నార్థం చేసుకుంటున్నాడు. ఈ క్రమంలో టీ20 ప్రపంచకప్‌లో తుది జట్టులో ఆడే 11 మంది ఆటగాళ్ల పేర్లను చెప్పాలని సెహ్వాగ్‌ను అడిగినప్పుడు అతడు హార్దిక్ పాండ్యను ఎంపిక చేయలేదు. అయితే.. 15 మంది సభ్యుల గల స్క్వాడ్‌లో మాత్రం అతడు ఉండాలన్నాడు.
PAK vs NZ : కివీస్ చేతిలో పాక్ ఓటమి.. వెక్కి వెక్కి ఏడ్చిన చిన్నారి..
క్లబ్ ప్రైరీ ఫైర్ పోడ్‌కాస్ట్‌లో సెహ్వాగ్ మాట్లాడుతూ.. కెప్టెన్ రోహిత్ శర్మతో యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్‌కు ఓపెనింగ్ చేయాలని సెహ్వాగ్ సూచించాడు. ఆ తరువాత వరుసగా విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్ రావాలన్నాడు. ఇక వికెట్ కీపర్‌గా రిషబ్ పంత్‌కు సెహ్వాగ్ ఓటేశాడు. రింకూ సింగ్ లేదా శివమ్ దూబేలో ఒకరిని తుది జట్టులోకి తీసుకోవాలని సెహ్వాగ్ సూచించాడు. ఇద్దరు స్పిన్నర్లు రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ కాగా.. ముగ్గురు పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, సందీప్ శర్మలను ఎన్నుకున్నాడు.
వీరేంద్ర సెహ్వాగ్ టీమ్ఇండియా ప్లేయింగ్ ఎలెవన్ టీ20 వరల్డ్ కప్:
రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, శివమ్ దూబే/రింకు సింగ్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, సందీప్ శర్మ.