డెన్మార్క్ లో ‘ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్’ వినియోగం నిలిపివేత

డెన్మార్క్ లో ‘ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్’ వినియోగం నిలిపివేత

డెన్మార్క్ ప్రభుత్వం ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ వినియోగాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ మేరకు డెన్మార్క్ ఆరోగ్య శాఖ గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ తీసుకున్నవారిలో బ్లడ్ క్లాట్స్(రక్తం గడ్డకట్టడం)బయటపడ్డ ఘటనలు వెలుగు చూసిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అక్కడి ఆరోగ్య అధికారులు తెలిపారు. డెన్మార్క్ ఆరోగ్యశాఖ వివరాల ప్రకారం.. వ్యాక్సిన్ తీసుకున్న ఒకరు బ్లడ్ క్లాట్స్ వల్ల చనిపోయినట్లు కూడా తెలిసింది. డెన్మార్క్ లోని యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ(EMA)ఈ మరణంపై దర్యాప్తు ప్రారంభించింది.

అయితే, వ్యాక్సిన్ కు-బ్లడ్ క్లాట్స్ మధ్య సంబంధం ఉందా లేదా అనే దానిపై ఇంకా స్పష్టత లేదని డెన్మార్క్ ఆరోగ్య శాఖ తెలిపింది. దీనిపై లోతైన దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందని డెన్మార్క్ ఆరోగ్యమంత్రి తెలిపారు.
అయితే..ముందు జాగ్రత్త చర్యగా తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఆస్ట్రాజెనికా వినియోగాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలంటూ అక్కడి అధికారులను ఆదేశించింది. ఈ విషయమై రోబోయే రెండు వారాల్లో డానిష్ మెడిసిన్స్ ఏజెన్సీ సంప్రదింపులు జరపనున్నట్లు డెన్మార్క్ ప్రభుత్వం తన ఆదేశాలలో పేర్కొంది.

ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ వినియోగాన్ని తాము రద్దు చేయలేదని,కేవలం తాత్కాలికంగా దాన్ని వినియోగాన్ని మాత్రమే నిలిపివేస్తున్నామని అందరూ గుర్తించాల్సిన అవసరముందని డానిష్ హెల్త్ అథారిటీ డైరక్టర్ సోరెన్ బ్రాస్ట్రోమ్ ఓ ప్రకటనలో తెలిపారు. ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ సురక్షితమైనది మరియు ప్రభావవంతమైనదని చెప్పేందుకు విస్తృత డాక్యుమెంటేషన్ తమ వద్ద ఉందని,కానీ తాము మరియు డానిష్ మెడిసిన్స్ ఏజెన్సీ రెండూ తప్పనిసరిగా డెన్మార్క్ మరియు ఇతర యూరోపియన్ దేశాలలో వ్యాక్సిన్ తీవ్రమైన దుష్ప్రభావాల గురించి సమాచారం తీసుకోవాల్సి ఉందని బ్రాస్ట్రోమ్ తెలిపారు. రెండు వారాల తర్వాత… వ్యాక్సిన్ పై సస్పెన్షన్ కొనసాగించాలా వద్దా అన్నదానిపై రివ్యూ చేయబడుతుందని తెలిపింది. ఇక, ఆస్ట్రాజెనికా నుంచి కొనుగోలు చేసిన వ్యాక్లిన్ల వినియోగాన్ని మరో ఆరు యూరప్ దేశాలు కూడా నిలిపివేసినట్లు సమాచారం.

మరోవైపు, ప్రస్తుతం భారత్ లో వినియోగిస్తున్న రెండు కోవిడ్ వ్యాక్సిన్లలో ఒకటి ఆస్ట్రాజెనికా కంపెనీ అభివృద్ధి చేసిందే. ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ-ఆస్ట్రాజెనికా సంయుక్తంగా అభివృద్ధి చేసిన “కోవిషీల్డ్” వ్యాక్సిన్ ను పూణేలోని సీరం ఇనిస్టిట్యూట్ ఉత్పత్తి చేస్తోన్న విషయం తెలిసిందే.