అంబులెన్స్ సైరన్ వినపించకూడదని మాఫియా వార్నింగ్ ..కుయ్..కుయ్ మని సౌండ్ చేస్తే చంపేస్తామని డ్రైవర్లకు బెదిరింపులు

అంబులెన్స్ సైరన్ వినపించకూడదని మాఫియా వార్నింగ్ ..కుయ్..కుయ్ మని సౌండ్ చేస్తే చంపేస్తామని డ్రైవర్లకు బెదిరింపులు

Do not sirens ambulance drivers Italy mafia War : రోడ్లమీద అంబులెన్స్ లు వెళుతుంటే దారి ఇవ్వటానికి సైరన్ మోగిస్తుంటారు. ట్రాఫిక్ ఉంటే దారి ఇవ్వాలని కుయ్ కుయ్ మంటూ సైరస్ మోగిస్తుంటారు. కానీ అంబులెన్స్ లు కుయ్ కుయ్ మంటూ సైరస్ సౌండ్ మోగించకుండా వెళ్లాలని మాఫియా అంబులెన్స్ డ్రైవర్లను బెదిరిస్తోంది. సైరన్ మోగిస్తే చంపేస్తామంటూ వార్నింగ్ కూడా ఇచ్చారు. దీంతో అంబులెన్స్ డ్రైవర్లు భయపడిపోతున్నారు. ఇలాగైతే మేం డ్యూటీలు చేయలేమని మాకు పోలీసు సెక్యూరిటీ కావాలని కోరుతున్న పరిస్థితి ఉంది ఇటలీలో..

ఇటలీలోని నేపుల్స్‌లో మాఫియా కార్యకలాపాలు ఎక్కువగా జరుగుతుంటాయి. స్మగ్లింగులు, కిడ్నాపులు, హత్యలు వంటివి మాఫియాకు సర్వసాధారణంగా జరుగుతుంటాయి. చోటా మోసా నేరాల నుంచి పెద్ద పెద్ద లావాదేవీలు, సెటిల్ మెంటుల వరకూ రకరకాల మాఫియా ‘బిజినెస్’లు నేపుల్స్ లో జరుగుతుంటాయి.

దీంతో నేపుల్స్ లో నిత్యం కార్యకలాపాలు చేసే మాఫియా సభ్యులకు అంబులెన్స్, ఎమర్జెన్సీ వాహనాల సైరన్లు బాగా డిస్ట్రబ్ చేస్తున్నాయట. ఆ సైరెన్ సౌండులు విని.. పోలీసులు వచ్చేస్తున్నారనే భయంతో పరుగులు తీస్తున్నారట. అంబులెన్స్ సైరన్, పోలీసుల వ్యాన్ల సైరన్ ఒకలాగానే ఉండటంతో ఆ వచ్చేది పోలీసులా? లేక అంబులెన్సో తెలీక వాళ్లు గందరగోళానికి గురవుతున్నారు. డిస్ట్రబ్ అవుతున్నారు.

దీంతో మాఫియా అంబులెన్స్ సైరన్ లపై తీవ్ర ఆగ్రహానికి గురవ్వుతోంది. దీంతో ఏకంగా మరణాయుధాలతో అంబులెన్స్ డ్రైవర్లను బెదిరిస్తున్నారు. మళ్లీ సైరన్ వేసుకుని తిరిగితే చంపేస్తామని హెచ్చరిస్తున్నారు. దీంతో మాఫియా చేతుల్లో చిత్రహింసలకు గురై ఎక్కడ చావాల్సి వస్తోందోననే భయంతో అంబులెన్స్ డ్రైవర్లు పోలీసులు భద్రత కోరుతున్నారు. లేకుంటే డ్యూటీలకు వెళ్లలేమని భయపడిపోతున్నారు.

కాగా కరోనా కేసుల వల్ల అంబులెన్స్ ల సర్వీసులు బాగా ఎక్కువయ్యాయి. దీంతో డ్రైవర్లకు మాఫియాల బెదిరింపులు మరీ ఎక్కువయ్యాయని అంబులెన్సు డ్రైవర్లు వాపోతున్నారు. గతంలో అంటే కరోనాకు ముందు అప్పుడప్పుడు మాత్రమే అంబులెన్సులు తిరిగేవి. అప్పుడు మాఫియాకు పెద్దగా ఇబ్బంది ఉండేది కాదు. కానీ కరోనా వైరస్ వల్ల ఇటలీలో అంబులెన్సులు తిరగడం ఎక్కువైంది. వాటి సైరన్ల వల్ల నేరగాళ్లకు నిద్ర కరవైంది. వారి పనులకు ఇబ్బందికలుగుతోంది. అంబులెన్స్ లు సైరన్ వేసుకుని వస్తుంటే..పోలీసులు వస్తున్నారనే భయంతో పనులను మధ్యలోనే వదిలేసి పారిపోవాల్సి వస్తోందట..లేదా దాక్కోవాల్సి వస్తోందట. దీంతో అంబులెన్స్ సర్వీసులు నడవాలంటే సైరస్ వినిపించకుండా చేసుకోండి అంటోంది మాఫియా.

మాఫియా బెదిరింపులతో ఓ అంబులెన్సు డ్రైవర్ మాట్లాడుతూ.. ‘‘సైరన్ వేసుకుంటూ అంబులెన్సు నడుపుతున్న సమయంలో ఇద్దరు దుండగులు బైకు మీద ఫాలో అయ్యారు. అంబులెన్సు అద్దాలను గుద్దుతూ వెంటనే సైరన్ ఆపాలని వార్నింగ్ ఇచ్చాడు. ఇంకోసారి సైరన్ వాడావంటే షూట్ చేసి..చంపిపారేస్తాం జాగ్రత్త అంటూ వార్నింగ్ ఇచ్చారని భయపడుతూ తెలిపాడు. దీంతో మేం పోలీసులకు ఫోన్ చేశాం. హాస్పిటల్‌కు చేరే వరకు భద్రత కల్పించాలని కోరాం’’ అని తెలిపాడు. దీంతో హెల్త్, ఎమర్జెన్సీ సిబ్బంది అంబులెన్సులో వెళ్లాలంటేనే హడలిపోతున్నారు.

కాగా..నేపుల్స్‌ చుట్టుపక్కల గల సనిటా, ట్రయానో ప్రాంతాల్లో కూడా అంబులెన్సుల సైరన్‌లపై మాఫియా ఆంక్షలు విధించింది. దీంతో అంబులెన్సులకు భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ప్రజల ప్రాణాలు కాపాడే ఉద్యోగుల ప్రాణాలకే రక్షణ లేకపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.