అమెరికా అధ్యక్ష ఎన్నికలపై ట్రంప్ సంచలన ట్వీట్

  • Published By: madhu ,Published On : July 31, 2020 / 01:15 PM IST
అమెరికా అధ్యక్ష ఎన్నికలపై ట్రంప్ సంచలన ట్వీట్

కరోనా మహమ్మారి కారణంగా అమెరికా అధ్యక్ష ఎన్నికల నిర్వహణకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అమెరికా రాజ్యాంగం ప్రకారం నవంబర్‌ నెలలో మొదటి సోమవారం తర్వాత వచ్చే మొదటి మంగళవారం నాడు అధ్యక్ష ఎన్నికలు జరగాల్సి ఉంటుంది. ఆ లెక్కన ఈ ఏడాది నవంబర్‌ 3న ఓటింగ్ జరగాలి. అయితే కరోనా సాకు చూపి ఎన్నికలు వాయిదా వేయాలనే ఆలోచనలో ట్రంప్ ఉన్నట్లు తెలుస్తోంది.



ఈ మేరకు ఆయన చేసిన ట్వీట్‌ ట్రంప్‌కు ఎన్నికల మీద ఉన్న భయాన్ని రూజువు చేస్తోంది. నవంబర్‌ 3న జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికలను కొద్దిరోజుల పాటు వాయిదా వేయాలని ట్రంప్‌ సూచించారు. దేశంలో కరోనా వైరస్‌ విస్తృతి నేపథ్యంలో ప్రజలు ధైర్యంగా ఓటు వేసే వరకు ఎన్నికలు వాయిదా వేయడం మంచిదని అభిప్రాయపడ్డారు. ఒకవేళ మెయిల్‌-ఇన్‌ ఓటింగ్‌ చేపడితే 2020 ఎన్నికలు తప్పుడు, మోసపూరిత ఎన్నికలుగా చరిత్రలో నిలిచిపోతాయని ఆయన పేర్కొన్నారు.

కరోనా నుంచి కోలుకుని ప్రజలు సరిగ్గా, క్షేమంగా తమ ఓటు హక్కు వినియోగించుకునే వరకు ఎన్నికలను వాయిదా వేయాలి అని ట్వీట్‌ చేశారు. మెయిల్‌-ఇన్‌ ఓటింగ్‌ ప్రక్రియను ట్రంప్‌ తొలి నుంచీ వ్యతిరేకిస్తున్నారు. అయితే, నవంబర్‌లో జరగబోయే ఎన్నికలను రద్దు చేసేందుకు లేదా వాయిదా వేసేందుకు ట్రంప్‌ మొగ్గుచూపుతారని మొదటి నుంచీ డెమోక్రాట్‌లు చెబుతూ వస్తున్నారు. అమెరికా జీడీపీ భారీగా క్షీణించినట్లు వార్తలు వచ్చిన కాసేపటికే ఆయన ట్రంప్‌ ఈ ట్వీట్‌ చేశారు.



అయితే, అమెరికా ఎన్నికల తేదీని మార్చే అధికారం అధ్యక్షుడికి లేదు. అది అమెరికా రాజ్యాంగంలో పొందుపరిచి ఉంది. 1845 నుంచీ ఎన్నికలు నవంబర్‌ నెలలో మొదటి సోమవారం తర్వాత వచ్చే మొదటి మంగళవారం నాడే జరుగుతున్నాయి. ఆ తేదీలను మార్చడం అంత తేలికైన విషయం కాదు.

అధ్యక్ష ఎన్నిక‌ల‌ను వాయిదా వేయాల‌ని ట్రంప్ చేసిన ప్రతిపాద‌నను ఆయన పార్టీ పెద్దలే వ్యతిరేకించారు. క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో దేశం ఆర్థిక మాంద్యంలోకి వెళ్లింద‌ని.. ఎన్నిక‌ల‌ను వాయిదా వేయాల‌న్న ట్రంప్ అభ్యర్థన‌ను సేనేట్ రిప‌బ్లిక‌న్ మెజారిటీ నేతలు తోసిపుచ్చారు. అధ్యక్ష ఎన్నిక‌లను వాయిదా వేసే అధికారం ట్రంప్‌కు లేద‌ని క‌మిటీ రిప‌బ్లిక‌న్ నేత‌లు తేల్చారు.

ఒక‌వేళ వాయిదా వేయాల‌నుకుంటే, అప్పుడు దానికి ఉభ‌య‌స‌భ‌ల ఆమోదం ఉండాల‌న్నారు. అమెరికాలో అధ్యక్ష ఎన్నికలను వాయిదా వేయాలంటే రాజ్యాంగ సవరణ జరగాలని చెప్తున్నారు. ట్రంప్ చేసిన ప్రతిపాద‌నను సొంత పార్టీ వారే వ్యతిరేకిస్తుండడం ట్రంప్‌కు తలనొప్పిగా మారింది.

మరోవైపు ట్రంప్ పరపతి తగ్గుతోంది. రేటింగ్‌ తగ్గింది. కరోనా విషయంలో స్పందించాల్సిన విధంగా స్పందించలేదన్న ఆరోపణలున్నాయి. మధ్య మధ్యలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హైడ్రాక్సీ క్లోరోక్విన్ వాడకం వద్దని అధికారులు చెబుతున్నా పట్టించుకోలేదు. దీనికి తోడు నిరుద్యోగం పెరిగింది. వృద్ధి రేటు తగ్గింది. ఇవన్నీ రేటింగ్‌ను తగ్గించాయి.



మరోవైపు బిడెన్‌ మాత్రం నెమ్మదిగా తన పాపులారిటీ పెంచుకుంటున్నారు. ప్రజలతో దగ్గరగా మెలిగే బిడెన్ సహజ స్వభావం ఆయన ఈ సారి ఎన్నికలలో విఫలం కాకుండా చూస్తుందని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. బిడెన్‌కి విదేశీ వ్యవహారాల నిర్వహణ పట్ల అవగాహన, సుదీర్ఘ రాజకీయ అనుభవం, సాధారణ ప్రజానీకాన్ని మెప్పించగలిగే వాక్చాతుర్యం, జీవితంలో ఒడిదుడుకులను ఎదుర్కొన్న అనుభవం ఉన్నాయని వారు చేప్తున్నారు.

ఎవరో రాసిచ్చిన ప్రసంగాలు చదివే రాజకీయ నాయకులు ఉన్న ప్రస్తుత తరుణంలో బిడెన్ మాత్రం తన మనసులోని మాటలతోనే ప్రసంగాలు చేయడం అక్కడి ప్రజలను అతడిని మరింత దగ్గర చేస్తోంది. ఇది కూడా ట్రంప్‌కు ఇబ్బందికరంగా మారింది. ఎన్నికలు కొన్నాళ్లు వాయిదా వేస్తే పరిస్థితి సద్దుమణుగుతుందని ట్రంప్ భావిస్తున్నారు. ఈలోగా ప్రజల్లోని వ్యతిరేకతను కాస్త తగ్గించుకోవచ్చని అధ్యక్షుడి ఆలోచన.



ఓటమి భయంతో ట్రంప్ ఎన్నికలు వాయిదా వేసే అవకాశం ఉందని నాలుగు నెలల క్రితమే బిడెన్ అనుమానాలు వ్యక్తం చేశారు. ట్రంప్ ఏదో ఒక సాకుతో ఎన్నికలను వాయిదా వేస్తారని, తన మాటలను గుర్తుపెట్టుకోమంటూ జో బిడెన్ అన్నారు. అయితే ఈ వ్యాఖ్యలను ట్రంప్ అప్పట్లో కొట్టిపడేశారు.

నవంబర్ 3వ తేదీనే ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేశారు. తాను ఇప్పటివరకు ఎన్నికల తేదీ మార్చాలనే ఆలోచన కూడా చేయలేదని, ఆ అవసరం కూడా లేదన్నారు. కాని ఇప్పుడు ట్రంప్‌ తన రూట్‌ మార్చాడు. సాధారణంగానే తన మాటలపై నిలబడడని ట్రంప్‌కు పేరుంది. ఇప్పుడు అదే నిజం చేస్తు ఎన్నికల తేదిని మార్చాలంటూ ట్రంప్‌ ట్వీట్‌ చేశారు. జో బిడెన్‌ నాలుగు నెలలు క్రితం చెప్పిన మాటలను నిజం చేశాడు ట్రంప్‌. ఇదంతా చూస్తుంటే ట్రంప్‌కు ఓటమి భయం పట్టుకుందని అర్ధమవుతోంది.