3 నిమిషాల్లో 100 ఆసనాలు : యోగాలో 11 ఏళ్ల NRI బాలిక వరల్డ్ రికార్డు

  • Published By: nagamani ,Published On : July 20, 2020 / 03:00 PM IST
3 నిమిషాల్లో 100 ఆసనాలు :  యోగాలో 11 ఏళ్ల NRI బాలిక వరల్డ్ రికార్డు

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఆకాశహర్మ్యంగా పేరు పొందిన బుర్జ్ ఖలీఫా వ‌ద్ద భార‌త సంత‌తి 11ఏళ్ల బాలిక సమృధి కలియా యోగాలో మరో ప్రపంచ రికార్డు సృష్టించింది. ఆదివారం (జులై 19,2020) కేవ‌లం మూడు నిమిషాల 18 సెకన్లలో ఒక చిన్న పెట్టెలో 100 యోగాస‌నాలు వేసి మరో ప్రపంచ రికార్డును బద్దలు కొట్టింది. సమృధి బ్రేక్ చేసిన ఈ రికార్డు యోగాలో మూడవ ప్ర‌పంచ రికార్డు కావటం మరోవిశేషం. సమృధి కలియా తన రికార్డును తానే బద్దలుకొట్టటం మరోవిశేషం. ఈ ప్రతిభకు గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్సస్ లో చోటు సంపాదించింది.

జూన్ 21న ప్ర‌పంచ యోగాదినోత్స‌వం. ఈ దినోత్సవాన్ని పురస్కరించుకుని సమృధి కలియా కేవ‌లం నిమిషంలో 40 యోగాస‌నాలు వేసి ప్ర‌పంచ రికార్డు నెల‌కొల్పిన విష‌యం తెలిసిందే. దుబాయ్‌లోని అంబాసిడర్ స్కూల్‌లో గ్రేడ్ 7 విద్యార్థిని అయిన సమృధి ఎంతో కృషి, పట్టుదలతో ఇటువంటి అద్భుతమైన విజయాలు సాధించవచ్చని చెబుతోంది.

ఆత్మవిశ్వాసంతో ప్రయత్నిస్తే ఏదైనాసాధించవచ్చంటోంది ఈ 11 ఏళ్ల చిచ్చరపిడుగు. కాస్త ధైర్యంతో ముందుకు కొనసాగితే మ‌న‌ కలలన్నీ నిజం చేసుకోవచ్చంటోంది. నిశ్శబ్దంగా కష్టపడండి, విజయానే మీ శబ్దం కావనివ్వండి అంటూ సూచనలు కూడా ఇస్తోంది. ఈరోజు నేను ఈ రికార్డు సాధించాను అంటూ అది కేవలం నా శారీరక సామర్థ్యం కాదు..నా మానసిక సామర్థ్యం అని నేను అనుకుంటున్నాను అని తెలిపింది. ఇక‌ చిన్న వ‌య‌సులో సమృధి కలియా యోగాలో సాధిస్తున్న ప్ర‌పంచ రికార్డుల‌ను చూసి ఆమె త‌ల్లిదండ్రులు ఎంతో ఆనందిస్తున్నారు.