Turkey-Syria Earthquake: 24,000లకు పెరిగిన మృతులు.. కన్నీళ్లు ఎండిపోయిన చోట ఊపిరితో పలకరిస్తున్న రక్తపు ముద్దలు

శిథిలాల కింద ఎవరైనా బతికున్నారేమో అన్న ఆశ కూడా కనుమరుగవుతోంది. కానీ ఇలా అనుకున్న ప్రతీసారి అద్భుతాలు జరుగుతూనే ఉన్నాయి. ఎక్కడో ఒక చోట, ఎవరో ఒకరు ‘మీ రాక కోసమే ఎదురు చూస్తున్నాం’ అన్నట్లుగా మృత్యువును ఓడించి కంటబడుతన్నారు.

Turkey-Syria Earthquake: 24,000లకు పెరిగిన మృతులు.. కన్నీళ్లు ఎండిపోయిన చోట ఊపిరితో పలకరిస్తున్న రక్తపు ముద్దలు

Earthquakes Kill Over 24,000 In Turkey And Syria

Turkey-Syria Earthquake: గుండెలు పిండేసే ఆర్తనాదాలు తగ్గాయి. కన్నీళ్లు ఎండిపోయాయి. అప్పుడప్పుడూ వెల్లువెత్తుతున్న ఏడుపు, మూలుగులు శరీరంలోనూ, మనసులోనూ గాఢమైన గాయం తాలూకు వేదన ఇంకా చెక్కుచెదరలేదని వెల్లడిస్తున్నాయి. భూకంపంతో అతలాకుతలమైన టర్కీ, సిరియాల్లోని పరిస్థితి ఇది. నాలుగు రోజుల క్రితం 7.8 తీవ్రత భూకంపాన్ని చవిచూసిన ఈ దేశాల్లో ఎక్కడ చూసినా శవాల గుట్టలే కనిపిస్తున్నాయి. శిథిలాల కింద ఎవరైనా బతికున్నారేమో అన్న ఆశ కూడా కనుమరుగవుతోంది. కానీ ఇలా అనుకున్న ప్రతీసారి అద్భుతాలు జరుగుతూనే ఉన్నాయి. ఎక్కడో ఒక చోట, ఎవరో ఒకరు ‘మీ రాక కోసమే ఎదురు చూస్తున్నాం’ అన్నట్లుగా మృత్యువును ఓడించి కంటబడుతన్నారు.

కాగా, ఈ ప్రకృతి వైపరీత్యంలో మరణించిన వారి సంఖ్య తాజాగా 24,000 లకు చేరుకుంది. అధికారిక లెక్కల ప్రకారం.. టర్కీలో 19,000 మందికి పైగా మరణించగా, సిరియాలో 3,000 మంది మరణించారు. ఈ భూకంపం వల్ల సుమారు 1.5 కోట్ల మంది ప్రజలపై తీవ్రమైన ప్రభావాన్ని చూపించింది. ప్రాణాలు, ఆస్తులు ప్రకృతి ప్రళయానికి కకావికలమయ్యాయి. ఒక్క ఇల్లూ మిగలలేదు. భూమి కడుపులో నుంచి పునాదులతో సహా బయటికి ఎగిరి పడ్డాయి. నాలుగు రోజులుగా సహాయక చర్యలు కొనసాగుతున్నప్పటికీ, ఇంకా చేయాల్సిన సహాయం ఎంతో ఎంతో మిగిలే ఉంది.

ఇంతటి వైపరిత్యంలోనూ కొన్ని అద్భుతాలు వెలుగు చూస్తున్నాయి. భూకంపం సంభవించి నాలుగు రోజులు గడిచినప్పటికీ ఎక్కడో ఒక ప్రాణం ఇంకా ఊపిరితో కొట్టుమిట్టాడుతూనే ఉంది. సహాయక చర్యలు చేపడుతున్న రెస్క్యూ టీంకు కళ్లు చెమ్మగిల్లే అద్భుతాలు కనిపిస్తున్నాయి. తాజాగా భూకంప కేంద్రమైన గాజియాంటెప్ నగరానికి సమీపంలో అద్నాన్ ముహమ్మద్ కోర్కుట్ అనే యువకుడు శిథిలాల మధ్య ప్రాణాలతో కనిపించాడు. ఈ నాలుగు రోజులు అతడు తన మూత్రాన్ని తాగి జీవించాడట. టర్కీ సరిహద్దు ప్రాంతంలో నాలుగేళ్ల చిన్నారి యాగీజ్ కొమ్సు శిథిలాల మధ్య సజీవంగా కనిపించింది. రెస్క్యూ టీం ఆపరేషన్ అనంతరం ఈ చిన్నారి తన తల్లిని కలవడం మనసుకు హత్తుకునేలా చేసింది. నిజానికి తమ కూతురిని ఇక కలవలేనని ఆ తల్లి అనుకుందట. ఇక టర్కీలోని కిరిఖాన్ ప్రాంతంలో శిథిలాల కింద ఒక మహిళ సజీవంగా దొరికింది.

శిథిలాలలో ఎవరైనా సజీవంగా దొరుకుతారనే ఆశను వదులుకున్న సహాయక బృందాలకు ఇలాంటి అనుభవాలు హృదయాన్ని తాకుతున్నాయట. ఈ విషయమై రెస్క్యూ చీఫ్ స్టీవెన్ బేయర్ మాట్లాడుతూ.. ‘‘జైనెప్ కహ్రామాన్ (40) అనే వ్యక్తి కాంక్రీట్ బ్లాక్‌లో సజీవంగా ఉన్నట్లు గుర్తించాము. వెంటనే అతడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించాం. అదేవిధంగా భూకంపం ధాటికి నాలుగు రోజుల కింద తీవ్రంగా దెబ్బతిన్న ఒక ఇంట్లో 10 రోజుల పాప సహా ఆమె తల్లిని శుక్రవారం సురక్షితంగా కాపాడాము’’ అని పేర్కొన్నారు.

భూకంపం కారణంగా దెబ్బతిన్న టర్కీ, సిరియాలకు ప్రపంచ బ్యాంకు 1.78 బిలియన్ డాలర్ల సహాయాన్ని ఆమోదించింది. ఈ మొత్తాన్ని రెస్క్యూ-రిలీఫ్ పనులు, పునర్నిర్మాణం కోసం ఖర్చు చేయనున్నట్లు సమాచారం. ఇక టర్కీలో భూకంపం దాడికి అక్కడి నిర్మాణ పనుల్లో లోపం కనిపిస్తోందని పరిశీలకులు అంటున్నారు. కొత్త, పాత భవనాలు ఒక్కసారిగా కుప్పకూలాయి. పెద్ద పెద్ద భవనాలు సైతం పేక మేడల్లా శిథిలమయ్యాయి. భూకంప తీవ్రతను తట్టుకునే విధంగా వీటిని నిర్మించలేదని అంటున్నారు.