Money Trees : డబ్బులు కాసే చెట్లు! ఎక్కడున్నాయో తెలుసా..!!

  • Published By: nagamani ,Published On : November 10, 2020 / 12:59 PM IST
Money Trees : డబ్బులు కాసే చెట్లు! ఎక్కడున్నాయో తెలుసా..!!

England Money plants  : ఇంట్లో పిల్లలు డబ్బులు దుబారా చేస్తే ‘‘ఏంటీ డబ్బులేమన్నా చెట్లకు కాస్తున్నాయా?’’ కాస్త ఖర్చులు తగ్గించుకోమని మందలిస్తుంటారు. నిజమే మరి డబ్బులు చెట్లకు కాయవు కదా..కష్టపడి సంపాదించుకోవాలి. కానీ నిజంగా డబ్బులు చెట్లకు కాస్తే..!! అటువంటి చెట్లు పట్టుకొచ్చి ఇంట్లో నాటేసుకోమా?..డబ్బులు కాయించేసుకోమా? చక్కగా ధనవంతులైపోమా? కానీ నిజంగానే చెట్లకు డబ్బులు కాసే చెట్లున్నాయి..! అంటే నమ్ముతారా? కానీ ఇది నిజం..ఇంతకీ డబ్బుల కాసే చెట్లు ఎక్కడున్నాయో చెప్పండి తెచ్చి ఇంట్లో నాటేస్తాం అని తెగ ఆతృతపడిపోతున్నారు కదూ..మరి ఆ వివరాలేంటో తెలుసుకుందాం..



ఉడ్‌లాండ్‌లో డబ్బులు కాసే చెట్లు
చెట్లకు పూలు, కాయలు కాయడం చూశాం. కానీ డబ్బులు కూడా కాయటం అంటే చాలా చాలా ఆశ్చర్యమే. అటువంటి చెట్లు ఇంగ్లండ్‌లోని ఉడ్‌లాండ్‌లో చాలా చోట్ల నాణేలతో నిండిన పెద్ద పెద్ద వృక్షాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ చెట్లను హఠాత్తుగాచూస్తే షాక్ అవ్వాల్సిందే. ఎందుకంటే ఒకటో, రెండో కాదు లక్షలాది నాణేలు చెట్ల బెరడుపై అతుక్కుని ఉంటాయి. చెట్లలో నుంచి పొడుచుకుని వచ్చి అచ్చంగా చెట్టుకు కాసినట్టే కనిపిస్తాయి. అందుకే ఈ చెట్లను ‘మనీ ట్రీ’ అని పిలుస్తారు.
https://10tv.in/its-greener-than-you-thought-new-tree-count-in-sahara-shows-surprising-results/



మనీ ట్రీస్ కథాకమామీషు ఏంటో చూద్దాం..
ఇంగ్లండ్ ప్రజలకు పూర్వకాలంలో చాలా వింత వింత నమ్మకాలు ఉండేవి. నాణేలను చెట్ల బెరడుల్లోకి ఇరికిస్తే ధన వంతులమైపోతామని ఆనాటి ప్రజలు నమ్మేవాళ్లు. దాంతో వాటిని చెట్ల బెరడుల్లోకి బలంగా గుచ్చేవారట.




మనం నదుల్లోని నీళ్లల్లోకి నాణాలు విసురుతాం కదా! (రాగినాణాలు ఉండే కాలంలో వచ్చిన నమ్మకం) అలా ఇంగ్లండ్ ప్రజలు కూడా నదుల్లోకి నాణాలు విసిరేవారట. నీళ్ల వేగానికి నాణాలు అడుగునున్న చెట్లలో ఇరుక్కునేవి. దాంతో అవి ఆ చెట్లలో భాగంగా పొలుసుల్లా ఏర్పడిపోయాయట.




ఇంగ్లండ్‌ లోని యార్క్‌షైర్‌ అందమైన అటవీ ప్రాంతం. ఇక్కడో వింత చెట్టుంది. మన తాతల కాలం నాటి ఈ చెట్టు బెరడంతా లెక్కలేనన్ని ముడతలు ఉంటాయి. వాటిలో బోలెడన్ని నాణాలు కూడా ఇరుక్కుని కనిపిస్తాయి. ఇలాంటిదే మరో చెట్టు ‘బోల్టెన్‌ ఆబే’లో కూడా ఉంది. 12వ శతాబ్దపు శిథిలాల మధ్య పెరిగిన ఈ డబ్బు చెట్టు ఆ ప్రాంతానికి ప్రత్యేక ఆకర్షణగా విలసిల్లుతోంది. ఇదండీ డబ్బులు కాసే చెట్ల కథాకమామీషు..