మొరాకోలో మొట్టమొదటి మహిళా జాలర్లు..సాగరంలో నారీమణుల గెలుపు సంతకం

  • Published By: nagamani ,Published On : July 12, 2020 / 01:39 PM IST
మొరాకోలో మొట్టమొదటి మహిళా జాలర్లు..సాగరంలో నారీమణుల గెలుపు సంతకం

‘‘ఎక్కడమ్మా..నువ్వు లేనిది..ఏమిటమ్మా నువ్వు చేయలేనిది’’ అనే పాట మహిళల విజయానికి వారి ప్రతిభా పాటవాలకు అద్దం పడుతుంది. భూమి..ఆకాశం..ఇలా మహిళల విజయకేతనాలు లేని చోటులేదు. అమ్మగా బిడ్డల ఆకలి తీర్చటం..భార్యగా భాధ్యతలు..ఇలా అన్ని పాత్రలను సమర్థవంతంగా నెరవేర్చటం మాటలుకాదు. అటువంటి అతివలు అమ్మలుగా బిడ్డల కడుపులు నింపటానికి సాగరాన్ని జల్లెడ పడుతున్నారు. సముద్రంలోని కెరటాలకు ఎదురెళ్లి చేపలు పడుతూ కుటుంబాలకు అండగా నిలబడుతున్నారు మొరాకోదేశంలోని మహిళా మణులు. మొరాకో దేశంలో మొట్టమొదటి మహిళా జాలర్లుగా సాగరగర్భాన్ని జల్లెడ పడుతూ చేపల వేట చేస్తున్నారు. వారే ఫతిహ నజీ, ఫాతీమా మెఖ్నాస్‌, సైదా ఫెత్నో, అమీనా మెఖ్నాస్‌ లు. వారినిచూసి మరికొంతమంది మహిళలువారి బాటపడుతున్నారు.

మొరాకో (ఆఫ్రికా)లోని సముద్రతీరంలోని బెలియోనెచ్‌ గ్రామంలోని మహిళలు ఫతిహ నజీ, ఫాతీమా మెఖ్నాస్‌, సైదా ఫెత్నో, అమీనా మెఖ్నాస్‌లు. తెల్లరేసరికల్లా వంటలు చేసేసుకుని చేపలు పట్టే వలలు అందుకొని సముద్రంలో చేపలు పట్టటానికి వెళతారు. అలా రోజంతా సముద్రంలోనే చేపలు పడుతుంటారు. సాయంత్రం అయ్యేసరికి వల నిండా చేపలతో తిరిగివస్తారు. ప్రతీరోజు వీరు చేసే పని అదే.

వీరిని చూసిన మరో 14 మంది మహిళలు జాలర్లుగా మారారు. చేపలు పట్టి..వాటిని అమ్మగా వచ్చిన డబ్బుతో ఇల్లు నడుపుతున్నారు. మొరాకోలో మొట్టమొదటి మహిళా జాలర్లుగా గుర్తింపు సాధించిన వీరిది మోసెస్‌ కొండ ప్రాంతానికి దిగువగా మధ్యధరా సముద్ర తీరం వెంబడి ఉన్న బెలియోనెచ్‌ గ్రామం. ఈ ఊరికి ఏడు కిలోమీటర్ల దూరంలో మొరాకో, యూరప్‌ సరిహద్దు భూభాగమైన స్పెయిన్‌ సిటీ సెవుటా ఉంది.

బెలియోనెచ్‌ గ్రామస్థులు ఉపాధి కోసం సెవుటాకు వెళ్లి పనిచేసి సాయంత్రం బోర్డర్‌ దాటి వచ్చేవారు. ఈక్రమంలో 2000 సంవత్సరం మొదట్లో..స్పెయిన్‌ ప్రభుత్వం ఆ భూభాగాన్ని మూసివేసిది. దీంతో బెలియోనెచ్‌వాసులకు ఉపాధి పోయింది.కూలీపని దొరక్కపోవడంతో ఇల్లు గడవడం కష్టమైపోయింది. దాంతో వాళ్లంతా తమ తాతల కాలంనుంచి వస్తున్న వారి కుల వృత్తి అయిన చేపలు పట్టాన్ని వృత్తిగా చేసుకున్నారు.

ఈ సందర్భంగా ఖేడౌజ్‌ ఘాజిల్ అనే 60 ఏళ్ల వృద్ధురాలు మాట్లాడుతూ..నేను సెవుటా వెళ్లి ఓ ఇంటిలో పనిమనిషిగా..ఆయాగా పనిచేసేదాన్ని. రోజుకు 20 యూరోలు ఇచ్చేవారు. దాంతో హాయిగా ఇంటిల్లిపాది బతికేవాళ్లం.కానీ సరిహద్దు మూసిననాటినుంచి నేను ఇంటిలోనే ఉండిపోవాల్సి వచ్చింది. కుటుంబ గడవటం కోసం మరికొంత మంది మహిళలతో కలిసి చిరిగిపోయిన వలలకు మరమ్మతు చేయడం, పడవల్ని శుభ్రం చేయడం వంటి పనులు చేస్తుండేది.

సరిగా అదే సమయంలో మహిళలకు ఉపాధి చూపాలనే ఆలోచనతో స్థానికంగా ఉండే ఓ సహకార సంస్థ 2018లో 19మంది మహిళలతో జాలర్ల బృందాన్ని తయారు చేసింది.
మొరాకో దేశంలో మొట్టమొదటి మహిళా జాలర్ల బృందం వీరిదే. వీరిలో నలుగురు మహిళలకు మాత్రమే చేపలు పట్టడంలో అనుభవం ఉంది. మిగతావారికి తమ తమ భర్తలకు చేపల వేటలో సాయం చేయడం, చిరిగిన వలలకు మరమ్మతు చేయడం, చేపల్ని మార్కెట్లో అమ్మడం వంటి పనులు తెలుసు అంతే.

దీంతో వీరికి కూడా సముద్రంలో వల ఎలా విసరాలో..చేపలు ఎలా పట్టాలి? గాయపడినవారికి ప్రథమ చికిత్స చేయడం, ప్రమాదవశాత్తు పడవ పట్టు తప్పి సముద్రంలో మునిగిపోయే పరిస్థితి వస్తే నీళ్లలో దూకి ఒడ్డుకు ఎలా చేరాలో వంటి పలు పనుల్లో ట్రైనింగ్ ఇచ్చింది సదరు సంస్థ.

మేము సముద్రం మీద ఆధారపడి బ్రతుకుతున్నాం.సముద్రం నుంచి మమ్మల్ని దూరం చేస్తే నీరు లేని చేప ఎలా చచ్చిపోతుందో మా పరిస్థితి కూడా అంతే..అంటున్నారు అక్కడి మహిళలు. మా పిల్లలతో పాటు, ఊళ్లో వారందరికీ ఆకలి తీర్చే అమ్మ సముద్రమే. సముద్రంలో చేపల వేట చేయటం మాటలుకాదు..ఎన్నో ప్రమాదాలు..శ్రమలకు ఓర్చుకుంటూ రోజంతా సముద్రంలోనే ఉంటూ..ఎటు చూసిన అనంతమైన జలరాశి భయపెడుతుంటే గుండెలు చిక్కబట్టుకుని ప్రాణాలకు తెగించి చేపలు పట్టుకుని కుటుంబాలను గడుపుకుంటున్నామని మహిళలు చెబుతున్నారు.

కానీ ఎంత ప్రమాదం ఉన్నా..సముద్రంతోనే మా జీవితాలు ముడిపడి ఉన్నాయి. సముద్రంతో మా కున్న అనుబంధం విడదీయలేదని అంటున్నారు సహకార సంస్థ అధ్యక్షురాలు అమీనా మెఖ్నాస్‌. ఏ పనైనాసరే..చేసే సమర్థత..చాతుర్యం..తెగింపు మహిళల్లో ఉంటుందని..మహిళలు ఎంతో శక్తిమంతులు అనడానికి ఇంతకన్నా మంచి ఉదాహరణ ఇంకేం ఉంటుందని ఎంతో ఉత్సాహంగా గర్వంగా చెబుతున్నారు అమీనా మెఖ్నాస్.