అమెరికా చట్టసభల్లో బిల్లు : H-1B వీసా జారీలో వారికే ప్రాధాన్యం! 

  • Published By: srihari ,Published On : May 23, 2020 / 07:54 AM IST
అమెరికా చట్టసభల్లో బిల్లు : H-1B వీసా జారీలో వారికే ప్రాధాన్యం! 

హెచ్-1బి వర్క్ వీసాల జారీకి సంబంధించి కీలక సంస్కరణలను ప్రతిపాదిస్తూ అమెరికా కాంగ్రెస్ చట్ట సభల్లో బిల్లు ప్రవేశపెట్టింది. నాన్ ఇమ్మిగ్రాంట్ వీసా ప్రొగ్రామ్స్‌లో భాగంగా అమెరికాలో చదివిన విదేశీ టెక్నాలజీ నిపుణులకే  హెచ్-1బి వర్క్ వీసాల జారీకి ప్రాధాన్యత ఇచ్చేలా ద్వైపాక్షిక గ్రూపు ప్రతినిధుల బృందం బిల్లును ప్రవేశపెట్టింది. హెచ్-1బి, ఎల్-1 వీసా రిఫామ్ యాక్ట్ పేరిట చట్ట సభల్లోని ప్రజాప్రతినిధులు, సెనేట్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. హెచ్-1బి వీసాల వార్షిక కేటాయింపుల్లో మొదటిసారిగా అమెరికా పౌరసత్వం, ఇమ్మిగ్రేషన్ సర్వీసులకు ప్రాధాన్యత తప్పనిసరిగా అవసరమని పేర్కొంది. 

ఈ కొత్త విధానం ప్రకారం.. అమెరికాలో చదివిన చురుకైన విద్యార్థులకు హెచ్-1బి వీసా జారీకి ముందుగా ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపింది. అదనపు డిగ్రీ, అధిక వేతనాలు, విలువైన నైపుణ్యాలు ఉన్నవారికే ప్రాధాన్యత ఇచ్చేలా కీలక చట్టపరమైన సంస్కరణల్లో ప్రతిపాదించారు. అమెరికా ఉద్యోగుల స్థానాన్ని హెచ్-1బి, ఎల్-1 వీసాదారులు భర్తి చేయడాన్ని పూర్తిగా నిషేధించాలని పేర్కొన్నారు. సభలోని సెనేటర్లు చుక్ గ్రాస్లే, డిక్ డర్బిన్ ప్రతినిధులు ఈ బిల్లును ప్రవేశపెట్టారు. కాంగ్రెస్ నేతలైన  Bill Pascrell, Paul Gosar, Ro Khanna, Frank Pallone, Lance Gooden ప్రతినిధులు బిల్లును ప్రవేశపెట్టినవారిలో ఉన్నారు. 

వీసాదారుల కారణంగా ఇతర అమెరికా ఉద్యోగులు, కార్మికుల పనితీరు, పనిప్రదేశంపై ఎలాంటి ప్రతికూల ప్రభావం పడకుండా చూడాలని స్పష్టం చేశారు. 50 కంటే ఎక్కువ మంది పనిచేస్తూ సగం కంటే ఎక్కువమంది హెచ్-1బి లేదా ఎల్-1 వీసాదారులు ఉంటే.. ఆపై హెచ్-1బి వీసాదారులను నియమించడాన్ని నిషేధించాలని ఈ బిల్లు ప్రతిపాదించింది. అంతేకాదు.. లేబర్ డిపార్ట్ మెంట్ కు కూడా మరిన్ని అధికారాలు ఇచ్చేలా ప్రతిపాదించారు. నిబంధనలను ఉల్లంఘించినట్టు తేలితే శిక్షించే అధికారాన్ని కూడా ప్రతిపాదించారు. కంపెనీలు హెచ్-1బి, ఎల్-1 వీసాదారుల వివరాలను కూడా అందజేసేలా బిల్లులో ప్రతిపాదనలు చేశారు. 

Read: ఆకుపచ్చగా మారిన అంటార్కిటికా