రాజకుటుంబంలో నరకం చూశా,చచ్చిపోదామనుకున్నా..సంచలన నిజాలు బయటపెట్టిన హ్యారీ-మేఘన్ దంపతులు

రాజకుటుంబంలో నరకం చూశా,చచ్చిపోదామనుకున్నా..సంచలన నిజాలు బయటపెట్టిన హ్యారీ-మేఘన్ దంపతులు

Harry బ్రిటిష్ రాజకుటుంబం నుంచి విడిపోయిన​ హ్యారీ,మేఘన్​ మార్కెల్​ దంపతులు తొలిసారిగా అమెరికాలోని పాపులర్​ టీవీ షో ఓఫ్రా విన్ఫ్రేకి ఇచ్చిన ఇంటర్యూ ఇచ్చారు. బ్రిటన్‌ రాణి ఎలిజబిత్‌ 2 మనవడు అయిన ప్రిన్స్‌ హ్యారీ.. 2018లో అమెరికా నటి మేఘన్‌ మర్కెల్‌ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. 2019లో వీరికి కుమారుడు ఆర్చీ పుట్టాడు. అయితే కుటుంబంతో విభేదాల కారణంగా గతేడాది హ్యారీ దంపతులు రాజకుటుంబం నుంచి బయటకు వచ్చేసి మేఘన్‌ స్వస్థలం కాలిఫోర్నియా వెళ్లిపోయిన విషయం తెలిసిందే. అయితే రాజకుటుంబం నుంచి బయటికొచ్చిన తర్వాత తొలిసారిగా ఇప్పుడు ఇచ్చిన ఇంటర్యూలో ఈ దంపతులు సంచలన విషయాలను వెల్లడించారు. తమ వివాహం జరిగిన తీరు, ఆ సమయంలో జరిగిన సంఘటనలను ఈ దంపతులు బయటపెట్టారు.

ముందే రహస్య పెళ్లి జరిగింది
రాజకుటుంబం అధికారికంగా వివాహం నిర్వహించడానికి మూడు రోజుల ముందే తాము రహస్యంగా పెళ్లిచేసుకున్నట్టు మేఘన్ తెలిపారు. ఈ విషయం ఎవరికీ తెలియదు, కానీ, ఆర్చ్‌బిషప్‌ను పిలిచి మేమే ఆయనతో చెప్పామని అన్నారు. ‘‘ఈ విషయం, ఈ దృశ్యం ప్రపంచం కోసం, కానీ మా ఇద్దరి మధ్య బంధం ముడిపడిపోయింది’’ అని ఆర్చ్‌బిషప్‌తో చెప్పినట్టు ఆమె తెలిపారు. మే-19,2018న బెర్క్‌షైర్ కౌంటీలోని విన్సర్ పట్టణంలోని రాజ భవనం విన్సర్ క్యాజిల్‌ లో హ్యారీ- మేఘన్ మార్కెల్‌కు అధికారికంగా వివాహం జరిగిన విషయం తెలిసిందే.

ఆ ప్రచారం నిజమే

తమ పెళ్లికి ముందు తోడికోడలు, విలియమ్స్ భార్య కేట్ మిడిల్టన్ తనపై కేకలు వేసినట్టు మీడియాలో జరిగిన ప్రచారం నిజమేనని మేఘన్ ధ్రువీకరించింది. తమ పెళ్లికి కొన్ని రోజుల ముందు కేట్ దేని గురించో కలత చెందిందని తెలిపింది. పెళ్లి రోజున ఫ్లవర్‌ గర్ల్‌ దుస్తుల విషయంలో కేట్‌ కాస్త అసంతృప్తికి గురయ్యారని.. డ్రస్ గురించి ఆమె తనపై కేకలు వేసినట్లు మేఘల్ చెప్పారు. ఇది నిజంగా తన మనోభావాలను బాధించిందని, అయితే, ఆ తర్వాత కేట్‌ క్షమాపణలు చెప్పడంతో ఆ సమస్య సద్దుమణిగిందణి.. కానీ బయట మాత్రం నా వల్లే తప్పు జరిగినట్లు ప్రచారం జరిగిందిని మేఘల్ పేర్కొన్నారు. అదే తన క్యారక్టర్‌పై దాడికి ప్రారంభమని తెలిపింది. తన క్యారక్టర్‌‌పై మీడియా దిగజారుడు వ్యాఖ్యలు చేస్తోందని మేఘల్ మండిపడిపడ్డారు.

రాజకుటుంబంలో ఇబ్బందులు
హ్యారీని పెళ్లి చేసుకోకముందు రాచరికపు జీవితం గురించి నాకు ఏమాత్రం తెలియదు. రాణి ముందు ఎలా ఉండాలి అనేది కూడా అవగాహన లేదు. హ్యారీతో వివాహం అయిన తొలినాళ్లలో ఈ విషయంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నా. ప్యాలెస్‌లోకి వచ్చాక ఇలా ఉండాలి అలా చేయాలంటూ అనేక ఆంక్షలు ఉండేవి. దీంతో ఒక్కోసారి చాలా ఒంటరిగా అనిపించేది. నెలల తరబడి బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది. ఆ సమయంలో చీకట్లో ఉన్నట్లు అనిపించేది. అలా మానసికంగా ఎంతో వేదన అనుభవిస్తున్నా..రాజకుటుంబంలో ఒక్కరు కూడా నాకు సాయం చేయలేదు. పైగా నాపై అసత్య ఆరోపణలు చేశారు. నిందలు వేశారు. వీటన్నింటినీ చూసి ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా. రాజకుటుంబంలో నాకు రక్షణ ఉండదని పెళ్లి అయిన కొద్దిరోజులకే అర్థమైంది. గత నాలుగేళ్లు ఎంతో భారంగా గడిచాయి.. పీడకలాల అనిపించాయని మేఘల్ తెలిపారు.

పుట్టబోయే బిడ్డ రంగు గురించి భయపడ్డారు
తాను గర్భవతిగా ఉన్న సమయంలో పుట్టబోయే బిడ్డ రంగు గురించి కుటుంబంలో చర్చ జరిగిందని మేఘన్ తెలిపారు. తాను నల్లగా ఉన్నాను కాబట్టి..పుట్టే బిడ్డ కూడా నల్లగానే పుడతాడని వారు ఆందోళన చెందారన్నారు. దీని గురించి హ్యారీతో కూడా వారు చర్చించారన్నారు. అంతేగాక, తమ బిడ్డకు భద్రత ఉండదని,టైటిల్‌ కూడా రాదని మాట్లాడుకున్నారుని ఆమె కన్నీటిపర్యంతమయ్యారు.

ట్రాప్ చేశారు

ఈ సందర్భంగా ప్రిన్స్‌ హ్యారీ కూడా సంచలన విషయాలు వెల్లడించారు. కేవలం మేఘన్‌ కోసమే తాను రాజకుటుంబం నుంచి బయటకు రాలేదని హ్యారీ తెలిపారు. తనను ట్రాప్ చేశారని,తనకు ఆ విషయం మొదట్లో తెలియలేదన్నారు. అందులో నుంచి ఎలా బయటపడాలో కూడా అర్థం కాలేదన్నారు. తన తండ్రి, సోదరుడిని కూడా ట్రాప్‌ చేశారని తెలిపారు. తన తండ్రి ప్రిన్స్‌ ఛార్లెస్‌, సోదరుడు ప్రిన్స్‌ విలియంతో సంబంధాలు అంతంతమాత్రంగానే ఉన్నాయన్నారు. పెళ్లి తర్వాత కుటుంబంలో అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయన్నారు. తానెప్పుడూ నా కొడుకుకు రాజకుటుంబలో హోదా రావాలని కోరుకోలేదు. దాని గురించి ఎవరితోనూ చర్చించలేదు. అయినా, సరే తమపై దుష్ప్రచారం జరిగిందన్నారు. తన తల్లి జీవితంలో జరిగినట్లుగానే తన జీవితంలోనూ జరుగుతుందేమోనని భయపడ్డానని.. నిస్సహాయ స్థితిలోనే రాజకుటుంబం నుంచి విడిపోదామని నిర్ణయానికి వచ్చానని హ్యారీ తెలిపారు. రాచరిక విధుల నుంచి వెనక్కి తగ్గుతున్నాం అని ప్రకటించిన తర్వాత 2020 ఆరంభంలో రాజకుటుంబం నుంచి డబ్బులు రావడం ఆగిపోయాని ఆయన తెలిపారు. తండ్రి తనతో మాట్లాడటం మానేశారు. ఆ సమయంలో తన తల్లి ప్రిన్సెస్‌ డయానా తన కోసం వదిలివెళ్లిన డబ్బులతో తన కుటుంబానికి భద్రత ఇవ్వగలిగినట్లు చెప్పారు. నమ్ముకుని వచ్చిన భార్య, కొడుకు ఆర్చీ భవిష్యత్‌ కోసమే బయటకు వచ్చేసినట్లు హ్యారీ తెలిపారు.

త్వరలో ఆడపిల్ల

ఈ సందర్భంగా హ్యారీ దంపతులు ఓ శుభవార్త పంచుకున్నారు. త్వరలో తమకు ఆడపిల్ల పుట్టబోతోందని చెప్పారు. ఈ ఏడాది వేసవిలో తాను అమ్మాయికి జన్మనివ్వబోతున్నానని మేఘన్‌ సంతోషంగా చెప్పారు.