దుక్కలా ఉండేటోడు, పీనుగులా అయిపోయాడు.. అథ్లెట్ కండలు కరిగించేసిన కరోనా

దుక్కలా ఉండేటోడు, పీనుగులా అయిపోయాడు.. అథ్లెట్ కండలు కరిగించేసిన కరోనా

కండలు తిరిగిన బాడీ బిల్డర్ కావొచ్చు, మహా మల్లయోధుడు కావొచ్చు.. ‘డోంట్ కేర్’’ అంటోంది కరోనా. ఎవరైనా నాకు ఒక్కటే. అటాక్ చేశానంటే ప్రాణం తీస్తా లేదా ఏనుగులా ఉండేటోడిని కూడా పీనుగులా చేసిపోతానంటోంది. జాగ్రత్తగా ఉండకపోతే మూల్యం చెల్లించుకోక తప్పదని వార్నింగ్ ఇస్తోంది. కరోనా సామాన్యులనే కాదు వస్తాదులను కూడా వదలడం లేదు. వారి కండలు కరిగించేస్తోంది. ఇప్పటికే కరోనా బారిన పడి అమెరికాకి చెందిన బాడీబిల్డర్ మైక్ షుల్జ్ పీనుగులా మారిపోయాడు. అతడి కండలు పూర్తిగా కరిగిపోయాయి. అతడు బాడీబిల్డర్ అని చెబితే ఎవరూ నమ్మరు. అలా అయిపోయాడు అతడు.

కరోనా దెబ్బకు కరిగిన కండలు:
తాజాగా మరో బాడీబిల్డర్, అథ్లెట్ సైతం అలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నాడు. కరోనా దెబ్బకు అతడి కండలు కూడా కరిగిపోయాయి. దుక్కలా ఉండేవాడు నక్కలా మారిపోయాడు. కరోనాకి ముందు అతడి శరీరమంతా మెలితిరిగిన కండలు ఉండేవి. కరోనా దెబ్బకు కండలు పూర్తిగా కరిగిపోయి, బక్క జీవిలా మారిపోయాడు. పరిస్థితి ఎంతవరకు వెళ్లిందంటే అసలు అతడు బతుకుతాడని ఎవరూ అనుకోలేదు.

25 రోజులు కోమాలోనే:
అతడి పేరు అహ్మద్ అయ్యద్. అథ్లెట్. వయసు 40 ఏళ్లు. కరోనా బారిన పడ్డాడు. 25 రోజులు కోమాలోనే ఉన్నాడు. అమెరికా దేశస్తుడు. వాషింగ్టన్ లో నివాసం ఉంటాడు. రెస్టారెంట్, క్లబ్ ని నడుపుతున్నాడు. అహ్మద్ ఓ అథ్లెట్, మారథాన్స్ లో పాల్గొంటాడు. రేసుల్లో పాల్గొనేవాడు. అంతే కాదు కోచ్ కూడా. బాస్కెట్ బాల్, బాక్సింగ్ అంటే అతడికి పిచ్చి. అందులో ట్రైనింగ్ ఇస్తాడు. అథ్లెట్ కావడంతో బాగా ఎక్సర్ సైజులు చేసేవాడు అహ్మద్. దీంతో కండలు తిరిగిన దేహం అతడి సొంతమైంది.

శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారింది:
ఇది ఇలా ఉండగా, ఓ రోజు అహ్మద్ కు బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయ్యింది. అతడు కరోనా బారిన పడ్డాడు. దీంతో జీవితం మొత్తం మారిపోయింది. ఎంతో సులువుగా బరువులు మోస్తూ చిరుతలా పరుగులు తీసే వాడు.. కరోనా ప్రభావంతో నిలబడటం, నడవటమే కష్టంగా మారింది. మెల్లమెల్లగా శరీరంలో శక్తినంతా కోల్పోయాడు. శ్వాస తీసుకోవడం కూడా కష్టంగా మారింది. తనకు ఫ్లూ వచ్చిందేమో అనుకున్నాడు. అయితే ఫ్రెండ్ సలహాతో మార్చి 15 ఆసుపత్రికి వెళ్లి చెక్ చేయించుకున్నాడు. అక్కడ కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. రిపోర్టులో కరోనా పాజిటివ్ అని వచ్చింది. అతడి ఆరోగ్య పరిస్థితి అప్పటికే విషమంగా ఉంది. దీంతో డాక్టర్లు వెంటనే వెంటిలేటర్ పై ఉంచారు. ఆ ఆసుపత్రిలో వెంటిలేటేర్ పై చికిత్స పొందుతున్న పేషెంట్లలో అహ్మద్ మూడో వాడు.

నెలన్నర తర్వాత ఆసుపత్రి నుంచి డిశ్చార్జి:
సుదీర్ఘమైన ట్రీట్ మెంట్ తర్వాత అహ్మద్ కోలుకున్నాడు. కరోనా రక్కసితో 6 వారాల పాటు పోరాడి విజయం సాధించాడు. ఏప్రిల్ 22న ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యాడు. కానీ..పాపం అతని కండలు మాత్రం.. ఎండలో పెట్టిన ఐస్ క్రీమ్ లా కరిగిపోయాయి. అహ్మద్ ఏకంగా 30 కిలోల బరువు కోల్పోయాడు. ఎడమ చేతిలో బ్లడ్ క్లాట్ అయ్యింది. హార్ట్, లంగ్స్ దెబ్బతిన్నాయి. మనిషి బక్క చిక్కి పోయాడు. అద్దంలో తనను తాను చూసుకున్న అహ్మద్ షాక్ అయ్యాడు. అసలు నేను నేనేనా అని కంగారుపడ్డాడు. నా కండలు తిరిగిన దేహం ఎక్కడ పోయింది? అని కుటుంబసభ్యులను ప్రశ్నించాడు. అహ్మద్.. ఎలా ఉండేటోడివి ఎలాగైపోయావ్.. పోనీలే, కరోనా రక్కసి నుంచి బతికి బైటపడ్డావ్.. కండలది ఏముంది ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు..అని బంధువులు, స్నేహితులు అన్నారు.

కండలు కరిగితే కరిగాయి, ప్రాణాలతో ఉన్నాడు అదే చాలు:
ఏమైతేనేం, అహ్మద్ కరోనా నుంచి కోలుకున్నాడు. ప్రాణాలతో బయటపడ్డాడు. అదే చాలని అంతా అన్నారు. కరోనా ఎంత ప్రమాదమో చెప్పడానికి అహ్మద్ కు జరిగిన అనుభవమే నిదర్శనం అంటున్నారు నిపుణులు. కరోనా ఎవరికైనా సోకుతుందని, అందుకే ప్రజలు కరోనాతో జాగ్రత్తగా ఉండాలని, నిత్యం మాస్క్ ధరించాలని సూచిస్తున్నారు. విచ్చలవిడిగా తిరగకుండా జాగ్రత్త పడాలంటున్నారు. వ్యాక్సిన్ వచ్చే వరకు కరోనా ముప్పు తప్పదని, అప్పటివరకు స్వీయ నియంత్రణ చాలా ముఖ్యం అని చెప్పారు. లాక్ డౌన్ నిబంధనలు కచ్చితంగా పాటించి కరోనా కట్టడికి అంతా సహకరించాలని ప్రభుత్వాలు కోరుతున్నాయి.

Read:లాక్‌డౌన్‌ ఎఫెక్ట్‌ : రక్తంలో 20 శాతం పెరిగిన షుగర్ లెవల్