Salman Rushdie: సల్మాన్ రష్దీపై దాడి ఎలా జరిగింది.. ‘ది సాటానిక్ వెర్సెస్’ అనే పుస్తకమే ఇందుకు కారణమా..?

భారత సంతతికి చెందిన ప్రముఖ బ్రిటిష్ నవలా రచయిత, బుకర్ ఫ్రైజ్ విజేత సల్మాన్ రష్దీ పై అమెరికా న్యూయార్క్ లో దాడి జరిగింది. చౌతాక్వా ప్రాంతంలోని ఓ ఇనిస్టిట్యూట్ లో రష్దీ ప్రసంగిస్తున్న సమయంలో ఓ వ్యక్తి దూసుకొచ్చి కత్తితో దాడి చేశాడు.

Salman Rushdie: సల్మాన్ రష్దీపై దాడి ఎలా జరిగింది.. ‘ది సాటానిక్ వెర్సెస్’ అనే పుస్తకమే ఇందుకు కారణమా..?

Updated On : August 13, 2022 / 8:26 AM IST

Salman Rushdie: భారత సంతతికి చెందిన ప్రముఖ బ్రిటిష్ నవలా రచయిత, బుకర్ ఫ్రైజ్ విజేత సల్మాన్ రష్దీ పై అమెరికా న్యూయార్క్ లో దాడి జరిగింది. చౌతాక్వా ప్రాంతంలోని ఓ ఇనిస్టిట్యూట్ లో రష్దీ ప్రసంగిస్తున్న సమయంలో ఓ వ్యక్తి దూసుకొచ్చి కత్తితో దాడి చేశాడు. మెడపై, కంటి భాగంలో బలంగా దాడి చేయడంతో రష్డీ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే ఆయన్ను హెలికాప్టర్ లో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉందని, వెంటిలేటర్ పై వైద్యులు చికిత్స అందిస్తున్నట్లు, ఒక కన్ను బాగా దెబ్బతిందని రష్దీ ఏజెంట్ ఆండ్రూ వైలీ తెలిపారు. రష్దీ తన కంటిని కోల్పోయే ప్రమాదముందని, మోచేతిలోని నరాలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయని, కాలేయానికి కత్తి పోట్లు కావడంతో తీవ్రంగా దెబ్బతిందని ఆండ్రూ వెల్లడించారు.

Salman Rushdie

Salman Rushdie

సల్మాన్ రష్దీ నిత్యం రక్షణలో ఉంటారు. అయిన అంతతేలిగ్గా ఓ దుండగుడు మాస్క్ ధరించి స్టేజీపైకొచ్చి కత్తితో ఎలా దాడిచేశాడన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. దాడి వెనుక సల్మాన్ రష్దీ రాసిన ‘ ద సాటానిక్ వెర్సెస్’ అనే పుస్తకమే కారణమన్న వాదన వినిపిస్తోంది. ఇదిలాఉంటే సల్మాన్ పై దాడి చేసిన వ్యక్తిని న్యూయార్క్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాడికి పాల్పడిన వ్యక్తిని న్యూజెర్సీకి చెందిన 24 ఏళ్ల హదీ మటర్‌గా గుర్తించారు.

Salman Rushdie

Salman Rushdie

నిందితుడు హదీ మటర్ రష్దీ పాల్గొన్న సమావేశంకు పాస్ కలిగి ఉన్నాడు. నిందితుడి చిరునామా మాన్‌హాటన్ నుండి హడ్సన్ నదికి ఆవల ఉన్న ఫెయిర్‌వ్యూలో ఉందని న్యూయార్క్ పోలీసులు గుర్తించారు. అయితే హదీ మాటర్ దాడికి గల ఉద్దేశ్యం అస్పష్టంగానే ఉందని పోలీసులు తెలిపారు. రష్దీ పై దాడిచేసిన సమయంలో అతనొక్కడే ఒంటిరిగా ఉన్నాడని పోలీసులు భావిస్తున్నారు. ఘటనా స్థలంలో ఓ బ్యాగు, కొన్ని ఎలక్ట్రానిక్ పరికరాలను పోలీసులు గుర్తించారు. దాడికి పాల్పడిన సమయంలో నిందితుడు హదీ మటర్ ముఖానికి మాస్కు వేసుకొని ఒక్కసారి జనంలోపలి నుంచి వేదిక మీదకొచ్చాడని, దీంతో వేదిక దగ్గరున్న వారిలో పదిహేను మంది రష్దీకి రక్షణగా వెళ్లారని ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు. మెరుపు వేగంతో రష్దీ మెడపై కత్తితో పొడిచినట్లు న్యూయార్క్ పోలీసులు వెల్లడించారు.

Salman Rushdie

Salman Rushdie

రష్దీపై అత్యాయత్నంకు ‘ ది సాటానిక్ వెర్సెస్ ’ పుస్తకమే కారణమన్న వాదన వినిపిస్తోంది. 1988 సంవత్సరంలో రష్దీ ఈ పుస్తకం రాశారు. ఇది రష్దీ నాల్గో పుస్తకం. ఈ నవల ముస్లింలలో పెద్ద దుమారాన్నే రేపింది. ఈ పుస్తకాన్ని దైవద్రోహంగా కొన్ని దేశాలు ప్రకటించి, నిషేధం విధించాయి. ది సాటానిక్ వెర్సెస్ పుస్తకం రాసినందుకు సల్మాన్ రష్దీపై ఇరాన్ అత్యున్నత నాయకుడు అయతొల్లా ఖొమేనీ 1989లో ఫత్వా జారీ చేశాడు. రష్దీని చంపితే 3 మిలియన్ డాలర్లు (రూ. 23.89 కోట్లు) ఇస్తామని ప్రకటించారు. అదేవిధంగా రష్దీని చంపితే 6 లక్షల డాలర్లు (రూ.4.77 కోట్లు) ఇస్తామని 2016లో ఇరాన్ ప్రభుత్వం ప్రకటించినట్లు అక్కడి మీడియా సంస్థల్లో కథనాలుసైతం వచ్చాయి.

Salman Rushdie

Salman Rushdie

ప్రస్తుతం రష్దీపై నిందితుడు హదీ మాటర్  దాడికి పాల్పడటం వెనుక ది సాటానిక్ వెర్సెస్ పుస్తకమే కారణమై ఉండొచ్చని న్యూయార్క్ పోలీసులు భావిస్తున్నారు. రష్దీ మరణానికి పిలుపునిచ్చిన ఇరాన్ ప్రభుత్వం పట్ల నిందితుడు హదీ మాటర్‌కు సానుభూతి ఉందని కొన్ని నివేదికలు పేర్కొన్నాయి. నిందితుడి ఫేస్‌బుక్ ఖాతాలో 1989లో సల్మాన్ రష్దీకి వ్యతిరేకంగా ఫత్వా జారీ చేసిన ఇరాన్ నాయకుడు అయతుల్లా ఖొమేనీ, అతని వారసుడు అయతుల్లా ఖమేనీ ఫోటోలు ఉన్నట్లు గుర్తించారు. అయితే.. న్యూయార్క్ పోలీసులు మాత్రం రష్దీపై నిందితుడు దాడికి పాల్పడడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని చెప్పారు.