India: రష్యాపై తీర్మానం.. ఐరాసలో ఓటింగ్‌కు భారత్ దూరం

ఉక్రెయిన్‌పై రష్యా దాడి నేపథ్యంలో, ఉక్రెయిన్‌లో క్షీణించిన మానవ హక్కులపై, ఐరాస మానవ హక్కుల సంఘంలో ప్రవేశ పెట్టిన తీర్మానంపై జరిగిన ఓటింగ్‌కు భారత్ దూరంగా ఉంది.

India: రష్యాపై తీర్మానం.. ఐరాసలో ఓటింగ్‌కు భారత్ దూరం

India

India: ఉక్రెయిన్‌పై రష్యా దాడి నేపథ్యంలో, ఉక్రెయిన్‌లో క్షీణించిన మానవ హక్కులపై, ఐరాస మానవ హక్కుల సంఘంలో ప్రవేశ పెట్టిన తీర్మానంపై జరిగిన ఓటింగ్‌కు భారత్ దూరంగా ఉంది. జెనీవాలోని ఐరాస మానవ హక్కుల సంఘంలో గురువారం ఈ ప్రత్యేక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీనికి 33 సభ్య దేశాలు అనుకూలంగా ఓటు వేయగా, చైనా, ఎరిథ్రియా వ్యతిరేకంగా ఓటు వేశాయి. భారత్ సహా పన్నెండు దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి రష్యాకు వ్యతిరేకంగా ఐరాసలో ప్రవేశపెట్టిన అన్ని తీర్మానాల సందర్భంగా భారత్ ఓటింగ్‌కు దూరంగా ఉంది.

 

కాగా, ఉక్రెయిన్‌లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని, వెంటనే దాడిని నిలిపివేయాలని తీర్మానం సందర్భంగా ఐరాస రష్యాను కోరింది. ఉక్రెయిన్‌పై రష్యా దాడి విషయంలో భారత్, స్థిరమైన, బలమైన అభిప్రాయం కలిగి ఉందని భారత్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. ‘‘ఉక్రెయిన్‌లో జరుగుతున్న పరిణామాలపై తీవ్రమైన సానుభూతి వ్యక్తం చేస్తున్నాం. వెంటనే కాల్పుల విరమణ పాటించి, ఇరు దేశాలు తమ శత్రుత్వాన్ని విడిచిపెట్టాలి. చర్చలు, దౌత్య పరమైన మార్గాలే ఈ సమస్యకు పరిష్కారం అని భావిస్తున్నాం’’ అని భారత్ ప్రకటించింది.