Palestinians : గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో 37మంది మృతి..ఇజ్రాయెల్ పై 3వేల రాకెట్లు ఎక్కుబెట్టిన గాజా

గ‌త వారం రోజులుగా ఇజ్రాయెల్ మిలిట‌రీ, పాల‌స్తీనాకు చెందిన హ‌మాస్ మిలిటెంట్ల మధ్య జరగుతున్న యుద్ధం తారాస్థాయికి చేరింది.

Palestinians : గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో 37మంది మృతి..ఇజ్రాయెల్ పై 3వేల రాకెట్లు ఎక్కుబెట్టిన గాజా

Palestinians

గ‌త వారం రోజులుగా ఇజ్రాయెల్ మిలిట‌రీ, పాల‌స్తీనాకు చెందిన హ‌మాస్ మిలిటెంట్ల మధ్య జరగుతున్న యుద్ధం తారాస్థాయికి చేరింది. వీరి మ‌ధ్య గ‌త సోమ‌వారం మొద‌లైన ఘ‌ర్ష‌ణ..భారీగా ఆస్తి, ప్రాణ న‌ష్టానికి దారితీస్తోంది. తాజాగా ఇజ్రాయెల్ సైనిక బ‌ల‌గాలు.. పాల‌స్తీనాలోని గాజా న‌గ‌రంపై వైమానిక దాడుల‌కు పాల్ప‌డ్డాయి.

ఆదివారం ఇజ్రాయెల్​ జరిపిన వైమానిక దాడితో గాజాలో 37 మంది పాల‌స్తీనా పౌరులు మృతి చెందగా..ఇందులో 14 మంది మహిళలు,ఎనిమిది మంది చిన్నారులు కూడా ఉన్నారు. తాజా దాడుల్లో గాజాలోని మూడు భ‌వ‌నాలు కుప్ప‌కూలాయి. ఇప్పటివరకు జరిగిన దాడుల్లో ఇంత భారీ స్థాయిలో విధ్వంసం జరగటం ఇదే ప్రథమం.ఈ దాడిలో మరో 50 మంది వరకు గాయపడ్డారని గాజా వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు సహాయ చర్యలు కొనసాగుతున్నాయని చెప్పింది. కాగా, గాజాలో హమాస్ మిలిటెంట్‌ నాయ‌కులు త‌ల‌దాచుకున్న భ‌వ‌నాలే ల‌క్ష్యంగా ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. ఇజ్రాయెల్ వైమానిక దాడులు గాజా ప్రాంతంలో హమాస్ రాజకీయ విభాగం అధిపతి యాహ్యా సిన్వర్ ఇంటికి తాకినట్లు ఇజ్రాయెల్ సైన్యం ఆదివారం తెలిపింది. కాని అతను చంపబడ్డాడో లేదో చెప్పలేదు.

కాగా,గత సోమవారం నుంచి ఇప్పటివరకు ఇజ్రాయెల్​ దాడుల్లో 55 మంది చిన్నారులు, 33 మంది మహిళలు సహా 188 మంది పాలస్తీనియన్లు మృతి చెందారు. హమాస్​ దాడుల్లో ఇజ్రాయెల్ వైపున కూడా ఓ ఐదేండ్ల బాలుడు, ఒక సైనికుడితోపాటు మొత్తం ఎనిమిది మంది మృతిచెందారు. ఇక,గత సోమవారం నుంచి గాజాలోని హమాస్​ ఉగ్రవాదులు…ఇజ్రాయెల్​ పై సుమారు 3,000 రాకెట్లను ప్రయోగించారని ఇజ్రాయెల్ మేజర్ జనరల్ ఓరి గోర్డిన్ ఆదివారం తెలిపారు. మరోవైపు.. పాలస్తీనా, ఇజ్రాయెల్​ల మధ్య కొనసాగుతున్న సంక్షోభంపై చర్చించడానికి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశం కానుంది.

ఇక, ఇజ్రాయెల్​- పాలస్తీనా మధ్య దాడులు కొనసాగుతున్న వేళ ఇస్లాం నాయకులు ఆదివారం వర్చువల్​గా అత్యవసర సమావేశమయ్యారు. గాజాలో ఇజ్రాయెల్ దాడులు ఆపేలా చూడాలని అంతర్జాతీయ సమాజాన్ని సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి ప్రిన్స్​ ఫైసల్​ బిన్​ ఫర్హాన్​ కోరారు. ఇజ్రాయెల్​ వేర్పాటువాద దేశమని పాలస్తీనా విదేశాంగ మంత్రి రియాద్​ మాలిక్​ ఆరోపించారు. అది గాజా ప్రజలపై తీవ్రమైన దాడులు చేస్తోందని మండిపడ్డారు. దాడులు జరుగుతున్నందువల్ల పదివేల మంది ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారని తెలిపారు.