కొండపై అందమైన గ్రామంలో రూ.90లకే ఇల్లు..!!

  • Published By: nagamani ,Published On : December 8, 2020 / 10:57 AM IST
కొండపై అందమైన గ్రామంలో రూ.90లకే ఇల్లు..!!

italy one 1euro house in Castropigano villege : ఒక ఇల్లు కట్టాలన్నా..కొనాలన్నా లక్షల రూపాయలు కావాల్సిందే. కానీ కేవలం రూ.90లకే ఇల్లు కొనుక్కోవచ్చు అంటూ ఎవరైనా నమ్ముతారా? 100 రూపాయలు పెడితే కిలో ఉల్లిపాయలే రావట్లేదు అటువంటిది 90 రూపాయలకు ఏకంగా ఇల్లు కొనుక్కోవచ్చంటే ఎవ్వరూ నమ్మరు. కానీ ఇది నిజమే. కానీ ఇది మనదేశంలో మాత్రం కాదు ఇటలీలో ప్రభుత్వం కేవలం ఒకే ఒక్క యూరోకు ఇళ్లని అమ్ముతోంది. ఇటలీలో ఒక్క యూరో అంటే మన కరెన్సీలో 90 రూపాయలు. మరి ఆ 90 రూపాయల ఇల్లు ఏంటో తెలుసుకుందాం..



అది దక్షిణ ఇటలీలోని మోలిఝో పరిధిలోని క్యాస్ట్రోపిగనానో గ్రామం. ఇది ఓ కొండపై ఉంటుంది. ప్రపంచంలోనే అత్యంత తక్కువ ధరకు ఇళ్లు అందిస్తున్న గ్రామంగా క్యాస్ట్రోపిగనానో పేరొందింది.జనాభా కేవలం 923మంది. ఇక్కడ చాలా ఇళ్లు ఖాళీగా ఉన్నాయి. దీంతో ఇక్కడి ప్రభుత్వం గ్రామంలోని ఇళ్లను విక్రయించాలని నిర్ణయించింది. ఒక్కో ఇంటిని నామమాత్రంగా ఒక్క యూరోకే అంటే మన కరెన్సీలో రూ. 90కే విక్రయిస్తున్నట్లు ప్రకటించింది. మరి ఇంత తక్కువ ధరకే ఇల్లు అంటే షరతులు ఉంటాయి కదా..ఆ షరతులేంటో చూద్దాం..



అయితే ఈ ఇళ్లను కొనుగోలు చేయాలనుకుంటున్నవారికి ఒక షరతు విధించింది. ఇక్కడి ఇళ్లను కొనుగోలు చేసేవారు వాటికి మరమ్మతులు చేయించుకోవాలి. కొనుక్కున్నవారు అదే ఇంట్లో ఉండాలి.
1930లో ఈ గ్రామంలో 2,500 మంది ఉండేవారు. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత చాలా మంది ఈ గ్రామం నుంచి వెళ్లిపోయారు. అలా కాలక్రమేణా 1960 తరువాత యువకులు ఉపాధి కోసం ఇక్కడి నుంచి వేరే ప్రాంతాలకు వలసలు వెళ్లిపోయారు. ప్రస్తుతం ఈ గ్రామంలో ఉండే జనాభాలో 60 శాతం మంది 70 ఏళ్ల పైబడినవారే ఉన్నారు.



దీంతో స్థానిక పరిపాలనా అధికారులు ఈ గ్రామానికి తిరిగి పూర్వపు కళ తీసుకురావాలని ఇటువంటి వినూత్న ప్రయత్నాలు చేపట్టారు. అందుకే ఇంత తక్కువ ధరకే ఇళ్లను అమ్మాలని నిర్ణయించారు. అందుకే ఇల్లు కొనుక్కున్నవాళ్లు ఆ ఇంటిలోనే ఉండాలని షరతులు పెట్టారు. ఈ రకంగానైనా అక్కడి జనాభా పెరుగుతుందని ఆశిస్తున్నారు.


కాగా ఈ గ్రామం అందమైన సముద్ర తీరంలో ఉండటంతోపాటు, ఇక్కడ పలు రిసార్టులు కూడా ఉన్నాయి. పరిపాలనా అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఇక్కడి ఇళ్లను కొనుగోలు చేసేవారు వాటికి మరమ్మతులు చేయించాలి. అదికూడా మూడేళ్లలో ఆ పనులు చేయించాలి. లేకపోతే ఆ ఇంటిని వదులుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ ఇంటిని కొనుక్కోవాలనుకునేవారు ముందుగా 2000 యూరోలు అంటే భారత కరెన్సీలో రూ.1,78,930 డిపాజిట్ చెల్లించాల్సివుంటుంది.