జాత్యంహకారానికి వ్యాక్సిన్ లేదు…ట్రంప్ కి కమలా కౌంటర్

  • Published By: venkaiahnaidu ,Published On : August 20, 2020 / 10:04 PM IST
జాత్యంహకారానికి వ్యాక్సిన్ లేదు…ట్రంప్ కి కమలా కౌంటర్

ఈ ఏడాది నవంబరులో జరగనున్న అమెరికా ఎన్నికల్లో డెమొక్రాట్ తరఫున ఉపాధ్యక్ష అభ్యర్థిగా భారతీయ సంతతికి చెందిన కమలా హ్యారిస్‌ను బుధవారం అధికారికంగా పార్టీ ప్రకటించింది. ఆమె దాఖలుచేసిన నామినేషన్‌ను ఆమోదించడంతో అమెరికాలోని అతిపెద్ద పార్టీ తరఫున అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేస్తోన్న తొలి నల్లజాతి మహిళగా కమలా చరిత్ర సృష్టించారు.

వర్చువల్ డెమోక్రటిక్ నేషనల్ కన్వెన్షన్ మూడో సమావేశంలో పాల్గొన్న కమలా హ్యారిస్.. జీవ శాస్త్రవేత్త, తన తల్లి శ్యామల గోపాలన్ పాఠాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కమలా మాట్లాడుతూ.. దేశం ఓ గొప్ప సమాజమనే భావన, విజన్‌ను తన తల్లి నుంచి నేర్చుకున్నానని అన్నారు. మనం ఎక్కడ నుంచి వచ్చాం, ఎలా ఉన్నా, ఎవరిని ప్రేమిస్తున్నామనే బేధం లేకుండా అందరికీ ఈ దేశం స్వాగతం పలుకుతుందని అన్నారు. 1960 నాటి పౌర హక్కుల ఉద్యమం సమయంలో తన తల్లిదండ్రులు వీధుల్లోకి వచ్చి నిరసన వ్యక్తం చేసిన విషయాన్ని తెలియజేశారు. ఆక్లాండ్ కైజర్ హాస్పిటల్‌లో తాను పుట్టిన విషయాన్ని ఆమె ప్రత్యేకంగా గుర్తుచేసుకున్నారు.

తన అర్హత గురించి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు జాత్యహంకారాన్ని ప్రేరేపించేవిగా ఉన్నాయని కమలా హారిస్ అన్నారు. . జాత్యహంకారానికి ఏ వ్యాక్సిన్ లేదని, దానిపై మేము పని చేయాల్సి ఉందని కమలా ఉద్ఘాటించారు. జాతిపరంగా భిన్నమైన వర్గాలను ఏకతాటిపైకి తీసుకురావడానికి తన వంతు ప్రయత్నిస్తానని కమలా హ్యారీస్ హామీ ఇచ్చారు. కన్వెన్షన్‌లో వైస్-ప్రెసిడెంట్ అభ్యర్థిగా కమలా హ్యారిస్‌ను మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా పరిచయం చేశారు. బిడెన్‌కు హ్యారిస్ ఆదర్శ రాజకీయ భాగస్వామి అని ఒబామా అన్నారు. తన ఉద్యోగానికి కమలా చాలా సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. తాను, జో బిడెన్ కలిసి మహమ్మారితో నాశనమైన దేశాన్ని పునరుజ్జీవింపజేసి, జాతి, పక్షపాత ధోరణితో రెండుగా విభజితమైన అమెరికాను ఒక్కటిగా చేస్తామని కమలా హ్యారిస్ హామీ ఇచ్చారు.

కాగా, కమలా హారిస్‌ తల్లి శ్యామలా గోపాలన్‌ చెన్నైకి చెందిన వారన్న సంగతి తెలిసిందే. వైద్య విద్య కోసం అమెరికా వెళ్లిన ఆమె అక్కడే జమైకాకు చెందిన డేవిడ్‌ హారిస్‌ను ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. వీరికి ఇద్దరు కూతుళ్లు కమలా హారిస్‌, మాయా హారిస్‌ ఉన్నారు. అయితే కమలకు ఏడేళ్ల వయస్సు ఉన్నప్పుడే తల్లిదండ్రులు విడిపోగా.. పిల్లల బాధ్యతను తల్లి శ్యామల స్వీకరించారు.

భారతీయ, జమైకా ఇమిగ్రెంట్ దంపతుల కూతురైన కమలా హారిస్ లోగడ శాన్ ఫ్రాన్సిస్కో డిస్ట్రిక్ట్ అటార్నీగా, కాలిఫోర్నియా అటార్నీ జనరల్ గా వ్యవహరించారు.ప్రస్తుతం కమలా కాలిఫోర్నియా నుంచి డెమోక్రటిక్ పార్టీ సెనేటర్‌గా ఉన్నారు.