Taliban flag: పాకిస్తాన్‌లో తాలిబాన్లతో చిక్కుల్లో ఇమ్రాన్ ఖాన్.. ఎగిరిన జెండా!

తాలిబాన్లకు సపోర్ట్ చెయ్యడం ద్వారా ప్రపంచంలో ఒంటరిగా అవుతున్న పాకిస్తాన్, దేశీయంగా కూడా ఇబ్బందులను పెంచుకుంటుంది.

Taliban flag: పాకిస్తాన్‌లో తాలిబాన్లతో చిక్కుల్లో ఇమ్రాన్ ఖాన్.. ఎగిరిన జెండా!

Pakistan

Taliban flag: తాలిబాన్లకు సపోర్ట్ చెయ్యడం ద్వారా ప్రపంచంలో ఒంటరిగా అవుతున్న పాకిస్తాన్, దేశీయంగా కూడా ఇబ్బందులను పెంచుకుంటుంది. ఆదివారం ఇస్లామాబాద్‌లోని జామియా హఫ్సా మదరసాలో తాలిబాన్ జెండాలు రెపరెపలాడడం ఇప్పుడు వివాదం అవుతోంది. ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్ల విజయ వేడుకను ఇప్పుడు పాకిస్తాన్‌లో బహిరంగంగా జరుపుకుంటున్నారు. రాజధాని ఇస్లామాబాద్‌తో సహా అనేక నగరాల్లో తాలిబాన్ల జెండాలు ఎగురుతున్నాయి.

అయితే, పాకిస్తాన్, తాలిబాన్లకు సపోర్ట్ చేస్తుందనే అపవాదు వస్తుందనే భయంతో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం ఈ జెండాలను తొలగించడానికి పోలీసులను అక్కడికి పంపింది. జెండాలను తొలగించాలని ఆదేశించగా.. పోలీసులతో మౌలానా అజీజ్, ఆపరేటర్ దురుసుగా ప్రవర్తించారు. దీని వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అమ్మాయిలను హింసించడానికి, పిల్లలను భయపెట్టడానికి పోలీసులు ఇక్కడకు వచ్చారంటూ వారు ఆరోపించి ప్రతిఘటించగా.. పోలీసులు వెనక్కిరాక తప్పలేదు.

ఈ సమయంలో కొంతమంది వ్యక్తుల చేతిలో AK-47 కూడా కనిపించింది. ఈ మొత్తం ఘటనకు సంబంధించిన వీడియో కూడా బయటకు వచ్చింది. ఈ వీడియోలో, మౌలానా పోలీసులతో గొడవ పడుతున్నాడు. ఇది మాత్రమే కాదు, ఇస్లామాబాద్‌లో షరియా చట్టాన్ని అమలు చేయాలన్న తన డిమాండ్‌ను ప్రభుత్వం అంగీకరించిందని అంటున్నారు.

జామియా హఫ్సా సమీపంలో ఉన్న పోలీసులతో మౌలానా అబ్దుల్ అజీజ్ వాదిస్తున్నట్టు వీడియోలో కనిపిస్తుంది. పాకిస్తాన్ తాలిబాన్లు మీ అందరికీ గుణపాఠం చెబుతారని మౌలానా బెదిరిస్తున్నారు. పోలీసులను ఆపడానికి మదర్సాకు చెందిన బురఖా ధరించిన విద్యార్థులు పెద్ద సంఖ్యలో వచ్చినట్లు చెబుతున్నారు. కాగా, పాకిస్తాన్‌లో తాలిబాన్‌ జెండాలు ఎగురడంతో ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ చిక్కుల్లో ఇరుక్కున్నారు. ప్రపంచం ఇప్పటికే ఇమ్రాన్‌ను దోషిగా చూస్తుండగా.. ఈ ఘటన మరింత కలకలం రేపుతోంది.