వారానికి మూడు రోజులు సెలవులు.. పార్లమెంటులో బిల్లుకు డిమాండ్!

వారానికి మూడు రోజులు సెలవులు.. పార్లమెంటులో బిల్లుకు డిమాండ్!

ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు పని ఒత్తిడిని తగ్గించే ప్రయత్నాలను, పలు మార్గాలను ప్రభుత్వంలోని నాయకులు ఆలోచిస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే దీర్ఘకాలిక నిర్ణయాలతో ప్రభుత్వాలు చట్టాలు చెయ్యాలనే డిమాండ్ వస్తోంది. లేటెస్ట్‌గా జపాన్‌లో ఉద్యోగులకు వారంలో నాలుగు రోజులు పనిదినాలుగా చేసి మూడు రోజులు వారాంతపు సెలవులు ప్రకటించాలని భావిస్తున్నారు. ఈ మేరకు చట్టం తీసుకుని రావాలని కూడా డిమాండ్ చేస్తున్నారు ఆ దేశ రాజకీయ నాయకులు.

ప్రయోగాత్మకంగా ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి, మూడు రోజుల వారాంత సెలవులను పరిశీలించి విజయవంతం అయినట్లుగా భావిస్తున్నారు. దీంతో చట్టాన్ని అమలు చేయాలని, బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్‌ చేస్తున్నారు. సమయపాలన, కష్టపడి పనిచేయడంలో జపాన్‌ పెట్టింది పేరు కాగా.. అక్కడి ఉద్యోగులంతా సమయానికి ఆఫీసుకు వచ్చి పని చేస్తున్నారు. అందుకే అక్కడి పరిశ్రమల్లో ఉద్యోగుల పాత్రకు విలువ ఉంటుంది. అయితే, ఉద్యోగంలో అభద్రతాభావం కారణంగా.. వారానికి రెండు రోజులు వారాంతపు సెలవులు తీసుకుంటున్నారు.

యాజమాన్యాన్ని మెప్పించి ఉద్యోగ భద్రత పొందడం కోసం.. వచ్చే జీతం సరిపోక మరికొందరు ఉద్యోగులు ఆఫీసుల్లో ఎక్కువసేపు పనిచేస్తున్నారు. సెలవు రోజుల్లో పని చేయడమే కాదు.. కొన్నిసార్లు ఉద్యోగులు పనిచేస్తూ ఆఫీసుల్లోనే నిద్రపోతుంటారు. దీంతో వారు మానసికంగా ఇబ్బందులు ఎదుర్కోవడమే కాదు.. కుటుంబం కోసం సమయం కేటాయించలేకపోతున్నారు. దీంతో కుటుంబ సమస్యలు చట్టాల దృష్టికి ఎక్కువగా వస్తున్నాయి.

ఇటువంటి పరిస్థితులు అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని అక్కడి ప్రభుత్వం కొన్నాళ్ల కిందటే మూడు రోజుల వారాంతపు సెలవుల విధానాన్ని తీసుకురావాలని ఆలోచన చేసింది. కానీ, కరోనా కారణంగా వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ ఎక్కువగా చేస్తుండగా.. ఇప్పుడు ఆ పరిస్థితి నుంచి బయటపడుతూ ఉన్నారు. ఈ క్రమంలో మరోసారి ఇదే చర్చ జరుగుతోంది. ఈ విధానం వల్ల కొవిడ్‌-19 సోకే ప్రమాదం తక్కువగా ఉండటంతోపాటు మోటారు వాహనాల వినియోగం కూడా తగ్గుతుందని, తద్వారా కాలుష్యం కూడా తగ్గే అవకాశం ఉందని అంటున్నారు.

వారానికి ఐదురోజులకు బదులు నాలుగు రోజులే పనిచేస్తే.. కంపెనీలు 20శాతం జీతంలో కోత విధించవచ్చు. అయితే, మూడు రోజులు సెలవులు ఉండటంతో ఆదాయం పెంపుకు మరో ఆదాయ మార్గం చూసుకునే వెసులుబాటు కూడా ఉంటుంది. మూడు రోజులు వీకెండ్స్ ఇస్తే ఆరోగ్యంగా కూడా కాస్త మంచి పరిస్థితులు వచ్చే అవకాశం ఉందని ఆలోచన. జపాన్‌లో కాని ఇది సక్సెస్ అయితే రాబోయే రోజుల్లో ప్రపంచం మొత్తం ఈ ఆలోచన చేయవచ్చు అని కూడా అంటున్నారు. చూడాలి మరి ఈ విధానం ఎంతవరకు సక్సెస్ అవుతుందో..