US Covid Cases : అమెరికాలో కరోనా కల్లోలం..ఒక్కరోజే 5లక్షల 80వేల కేసులు

అమెరికాలో కరోనా వైరస్ థర్డ్ వేవ్ విలయతాండవం సృష్టిస్తోంది.

US Covid Cases : అమెరికాలో కరోనా కల్లోలం..ఒక్కరోజే 5లక్షల 80వేల కేసులు

Covid18

US Covid Cases :  అమెరికాలో కరోనా వైరస్ థర్డ్ వేవ్ విలయతాండవం సృష్టిస్తోంది. రెండేళ్ల రికార్డులను చెరిపేస్తూ రెట్టింపు సంఖ్యలో కొత్త కేసులు, రోజువారీ మరణాలు భారీగా పెరిగాయి. పాత వేరియంట్లతో కలిసి కొత్త మహమ్మారి ఒమిక్రాన్ అక్కడ విలయవాతావారణానికి కారణమైంది.  గురువారం ఒక్కరోజే ఎన్నడూ లేని విధంగా రికార్డుస్థాయిలో అమెరికాలో 5లక్షల 80 వేల కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఫలితంగా అమెరికాలో ఇప్పటివరకు మొత్తంగా నమోదైన కరోనా కేసుల సంఖ్య 5.5కోట్లు దాటగా,మొత్తం మృతుల సంఖ్య దాదాపు 8.46లక్షలకు చేరింది.

ఇక,చిన్నపిల్లలు కూడా కరోనాతో హాస్పిటల్ లో చేరుతున్న సంఖ్య భారీగా పెరుగుతోంది. డిసెంబర్ 22-28 వారంలో 17 ఏళ్లు లేదా అంతకంటే తక్కువ వయస్సు ఉన్నవారు రోజుకు సగటున 378 మంది పిల్లలు కరోనావైరస్‌తో హాస్పిటల్స్ లో చేరారు. ఈ సంఖ్య వారం ముందు కంటే 66 శాతం పెరిగిందని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(CDC)గురువారం తెలిపింది. మహమ్మారి కాలంలో మునుపటి గరిష్టం-సెప్టెంబరు ఆరంభంలో రోజుకు సగటున 342 మంది పిల్లలు ఆసుపత్రిలో చేరినట్లు CDC తెలిపింది.

అయితే,అమెరికాలో ప్రతిరోజూ మొత్తంగా కోవిడ్ తో హాస్పిటల్స్ లో చేరుతున్నవారిలో పిల్లల శాతం తక్కువగా ఉండటం కొంత ఊరట కలిగించే విషయం. డిసెంబర్ 22-28 వారంలో రోజుకు సగటున దాదాపు 10,200 మంది అన్ని వయస్సుల వారు కోవిడ్ తో హాస్పిటల్స్ లో చేరారు.

ప్రపంచంపై విరుచుకుపడుతున్న ఒమిక్రాన్ వేరియంట్​పై ప్రపంచ ఆరోగ్య సంస్థ మరోసారి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఒమిక్రాన్ వేరియంట్​తో కరోనా కేసులు సునామీలా విరుచుకుపడతాయని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది. డెల్టా, ఒమిక్రాన్ వేరియంట్లు ఉమ్మడి ముప్పుగా ఏర్పడ్డాయని పేర్కొంది. ఈ రెండు వేరియంట్లు ఒకేసారి వ్యాప్తి చెందుతుండటం వల్ల.. కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయని తెలిపింది.

ALSO READ UNICEF Photo Awards :యూనిసెఫ్ ఫోటో ఆఫ్ ది ఇయ‌ర్ అవార్డులు..ఫస్ట్, సెకండ్ భారత్ కే..ఆ ఫోటోల ప్ర‌త్యేకతలు ఇవే..