Great Dog : రోడ్డున పడ్డ పిల్లి పిల్లలు..కంటికి రెప్పలా కాపాడుతున్న కుక్క..

రోడ్డున పడ్డ పిల్లి పిల్లలను కంటికి రెప్పలా కాపాడుతున్న కుక్క సోషల్ మీడియాలో హీరో అయిపోయింది. ఏడు పిల్లిపిల్లలను కంటికి రెప్పలా కాపాడుతున్న కుక్క గ్రేట్ అంటున్నారు నెటిజన్లు.

Great Dog : రోడ్డున పడ్డ పిల్లి పిల్లలు..కంటికి రెప్పలా కాపాడుతున్న కుక్క..

Dog And Small Cats (1)

Great Dog : పిల్లి, కుక్క బద్ద శత్రువులనే విషయం తెలిసిందే.పిల్లి కనిపిస్తే చాలు కుక్క తరిమి తరిమి కొడుతుంది. అలాగే పిల్లి కూడా కుక్కను చూస్తే బెదిరిపారిపోతుంది. ఈ జంతువులు ఒకదానికొకటి ఎదురుపడితే..అరుపులే అరుపులు. కానీ జాతి వైరాన్ని మరచిపోతే అంతా స్నేహమే కదా..ఇది మనుషులకు వర్తించదుగానీ..జంతువులకు వర్తిస్తుంది. ఎందుకంటే జంతువులకు స్వార్థం తెలీదు కాబట్టి. అదిగో అటువంటిదే జరిగింది యూకేలో. ఓ మగ కుక్క పిల్లి పిల్లల్ని ప్రాణంగా కాచికాపాడుతోంది. కంటికి రెప్పలా కాచుకుంటోంది.

ఏం జరిగిందో ఏమోగానీ ఏడు పిల్లలను రోడ్డుమీద పాపం దిక్కుతోచక అటూ ఇటూ తిరుగుతున్నాయి. వాటిని చూసిన ఓ వ్యక్తి ఆ ఏడు పిల్లిపిల్లల్ని చూశాడు. ఆ చుట్టుపక్కల వెదికాడు వాటి తల్లి కనిపిస్తుందేమోనని. కానీ ఎక్కడా తల్లి జాడ లేదు. దీంతో అతను ఆ పిల్లల్ని రెస్క్యూ ఛారిటీ ‘బాటర్సీయా’ కి తరలించారు. అక్కడ వాటిని పరిక్షించిన డాక్టర్లు ఆరోగ్యం బాగానే ఉంది కానీ మంచి ఆకలితో ఉన్నాయని గుర్తించి వెంటనే వాటిని ఆహారం పెట్టారు.

ఈక్రమంలో నైరుతి లండన్‌లోని యానిమల్ రెస్క్యూ ఛారిటీ సంస్థ ‘బాటర్సీయా’ లో హెడ్ నర్సుగా పనిచేస్తున్న రాచెల్ అనే మహిళకు ఈ పిల్లి పిల్లల గురించి తెలిసింది. వాటి పరిస్థితికి చలించిపోయిందామె. ఇంటికి తీసుకెళ్లి పెంచుకుందామనుకుంది. కానీ అప్పటికే వారి ఇంట్లో ఒక లాబ్రడార్ కుక్కను పెంచుకుంటున్నారు. ఆ కుక్క కూడా పిల్లగా ఉన్నప్పుడు ఎవరో వదిలేస్తే తీసుకొచ్చి పెంచుకుంటున్నదే. అలా చిన్నపిల్లగా ఉన్న ఆ కుక్క పిల్లని ఇంటికి తీసుకొచ్చి దానికి ‘బెర్టీ’ అని ముద్దు పేరు పెట్టి.. తన ఇంట్లోనే శాశ్వతంగా ఉంచేసుకున్నారు. అదిప్పుడు పెద్దది అయ్యింది.

ఇప్పుడా పిల్లి పిల్లల్ని ఇంటికి తీసుకొస్తే బెర్టీతో ఆ పిల్లలకు ప్రమాదం జరుగుతుందని భయపడింది రాచెల్.ఇంట్లో బెర్టీ ఉండటంతో ఆ కుక్క.. పిల్లి పిల్లలపై దాడి చేస్తుందేమో అనుకున్నారు. కానీ పిల్లి పిల్లలను అలా వదిలేయటానికి మనస్సు అంగీకరించలేదు. జాగ్రత్తగా బెర్టీ కంటపడకుండా పెంచుదామని పిల్లి పిల్లలను ఇంటికి తీసుకొచ్చింది. కానీ ఆశ్చర్యం..ఆ పిల్లి కూనల్ని చూసిన బెర్టీ ఏమాత్రం అరవలేదు సరికదా..చక్కగా వాటిని నాకుతూ అక్కున చేర్చుకుని యజమానురాలిని ఆశ్చర్యపరిచింది. తన సొంత పిల్లలను సంరక్షించినట్టు వాటిని దగ్గరకు తీసుకుంది.

అది చూసిన రాచెల్ ఆనందం అంతా ఇంతా కాదు. ఆ అపురూప దృశ్యాన్ని చూసిన రాచెల్ రాచెల్ భావోద్వేగానికి లోనైంది. జాతి వైరాన్ని మరచిన తన కుక్క ‘బెర్టి’ గొప్ప మనస్సుని అందరికీ తెలియజేయాలనుకున్నారు. పిల్లి పిల్లల్ని సంరక్షిస్తున్నా బెర్టి ఫోటోలు తీసి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతో అవికాస్తా వైరల్ అయ్యాయి.

“కేవలం ఒక్క ఏడాది వయసున్న బెర్టీ ఎంతో సహనంతో అనాధ పిల్లి పిల్లలను దగ్గరకు తీసుకుంది. వాటిని ఎల్లవేళలా కంటికి రెప్పలా కాపాడుతోంది. పిల్లి పిల్లలకు కొన్ని వారాల వయస్సు మాత్రమే ఉంది. వాటిని పెంచి పెద్ద చేసిన తర్వాత దత్తత తీసుకునేవారు ఉంటే ఇస్తాను” అని ఆమె తెలిపారు. లాబ్రడార్ రిట్రీవర్ బెర్టీ గురించి తెలుసుకున్న నెటిజన్లు ఫిదా అవుతున్నారు. సో గ్రేట్ అంటున్నారు.