అతి త్వరలో భారత్ కు రష్యా ఆయుధాలు

  • Published By: venkaiahnaidu ,Published On : June 26, 2020 / 11:43 AM IST
అతి త్వరలో  భారత్ కు రష్యా  ఆయుధాలు

ఇండియా , చైనా సరిహద్దు వివాదం ముదురు పాకాన పడుతోంది . ఒక పక్క చర్చలు సాగుతుండగానే చైనా సరిహద్దుల్లోకి భారీగా సైనిక దళాలను తరలిస్తోంది . చైనా కు ధీటుగా భారత్ కూడా సైనిక దళాలను తరలించింది . పైగా భారత వైమానిక దళం యుద్ధ విమానాలు సరిహద్దు గగన తలం పై నిత్యం చక్కర్లు కొడుతున్నాయి . పెట్రోలింగ్ చేస్తున్నాయి . మరో వైపు అగ్ర రాజ్యం అమెరికా భారత్ కు అండగా రంగం లోకి దిగుతోంది . ఆసియాలో చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఆగడాలకు చెక్ పెట్టక తప్పదని అమెరికా తేల్చి చెప్పింది .

ఒక పక్క ఇండియా కు మద్దతుగా అమెరికా రంగం లో దిగుతోంది. మరో పక్క మరో మిత్ర దేశం రష్యా ఇండియా కు అత్యవసరంగా ఆయుధాలు సరఫరా చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేసింది. రష్యా పర్యటనకు వెళ్లిన రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు  ఈ మేరకు రష్యా తన సమ్మతి తెలిపింది. ఎస్-400  క్షిపణులతో పాటు, రష్యా ఆయుధాలకు విడి భాగాలూ, మందు గుండు తక్షణం సరఫరా చేయవలసిందిగా రాజ్ నాథ్ సింగ్ రష్యా ను కోరారు.

అత్యవసరంగా క్షిపణులు, మందుగుండు, అస్సాల్ట్ రైఫిళ్లు, సరఫరా చేయవలసిందిగా మిత్ర దేశం రష్యా ను ఇండియా కోరింది. ఎమర్జెన్సీ పర్చేస్ రూట్ విధానంలో ఇందుకు వీలు కలిగించాలని కోరింది . రష్యా డిప్యూటీ ప్రధాని యూరీ బోరిసోవ్ ను కలిసి రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఈ అభ్యర్ధన చేశారు. రాజ్ నాథ్ సింగ్ మూడు రోజుల రష్యా పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే . రక్షణ శాఖ , మిలిటరీకి చెందిన సీనియర్ అధికారులు కూడా ఆయన వెంట రష్యా వెళ్లారు. 

 ఇండియా అభ్యర్థనలకు రష్యా సానుకూలంగా స్పందించిందని రాజ్ నాథ్ చెప్పారు . ఆయుధాల సరఫరాకు హామీ కూడా ఇచ్చిందన్నారు . త్వరలోనే అడిగినవన్నీ పంపిస్తామని రష్యా డిప్యూటీ ప్రధాని హామీ ఇచ్చారన్నారు . రష్యా డిప్యూటీ ప్రధానమంత్రి యూరి బోరిసోవ్ తో జరిగిన చర్చలు పూర్తి సంతృప్తినిచ్చాయని రాజ్ నాథ్ సింగ్ చెప్పారు . అత్యవసర కొనుగోళ్ల కోసం కొద్ది రోజుల క్రితమే కేంద్ర ప్రభుత్వం రక్షణ శాఖకు 500  కోట్ల రూపాయలు కేటాయించింది . ఇప్పుడాసొమ్ముతోనే రాజ్ నాథ్ సింగ్ రష్యా నుంచి ఆయుధాల కొనుగోలుకు సిద్ధమయ్యారు . చైనా సరిహద్దుల్లో ఏర్పడ్డ ఉద్రిక్తతల కారణంగా అత్యవసరంగా ఆయుధాల కొనుగోళ్ళకు ఇండియా సిద్ధమయ్యింది. ఇంతకీ రష్యా నుంచి ఇండియా ఎలాంటి ఆయుధాలు కొనుగోలు చేస్తోంది ? 

ఇగ్లా ఎస్ యాంటీ ఎయిర్ మిస్సైల్స్ అర్జెంటుగా కావాలని రష్యా ను ఇండియా కోరింది . ఆ పైన అస్సాల్ట్ రైఫిళ్లు , వాటికి అవసరమైన మందుగుండు కావాలని కోరింది. ఇప్పటికే భారత రక్షణ దళాలు ఉపయోగిస్తున్న రష్యా ఆయుధాలకు అవసరమైన మందుగుండు కూడా సరఫరా చేయాలని కోరింది. మరో పక్క కీలకమైన ఎస్ – 400  క్షిపణి రక్షణ వ్యవస్థ డెలివరీ పై కూడా రాజ్ నాథ్ సింగ్ రష్యా తో చర్చలు జరిపారు. ఇది లాంగ్ రేంజ్ సర్ఫేస్ టూ  ఎయిర్ డిఫెన్స్ సిస్టం . ఇందు కోసం ఇండియా 40,000  కోట్ల రూపాయలు వెచ్చిస్తోంది . ఈ వ్యవస్థ డెలివరీ మరి కాస్త ముందుకు జరపాలని రాజ్ నాథ్ సింగ్ రష్యా ను కోరారు . మరో పక్క అమేథీ లో తలపెట్టిన ఏ కె – 203 రైఫిళ్ల తయారీ ఫ్యాక్టరీ పై కూడా ఇరు దేశాలూ చర్చలు జరిపాయి . 

అన్నీ సక్రమంగా జరిగితే ఈ ఏడాది అక్టోబరులో ఈ ప్రాజెక్టును ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కలిసి శంకుస్థాపన చేయాలని నిర్ణయించారు. రష్యా , ఇండియా కు చెందిన ఆర్డినెన్సు ఫ్యాక్టరీ బోర్డు కలిసి సంయుక్తంగా దీన్ని చేపట్టాయి. కాకపోతే …ధర నిర్ణయం పై తేడాలొచ్చి ఏడాది పాటు ఈ ప్రాజెక్టు ఆలస్యమయింది.

అసలు చైనా సరిహద్దులో ఉన్న రక్షణ దళాలకు ఆధునిక ఆయుధాలు సమకూర్చాలని ఏనాటి నుంచో భారత ప్రభుత్వం భావిస్తోంది. ఎందుకంటే … ప్రస్తుతం అక్కడున్న సైన్యం దేశీయంగా తయారు చేసిన ఇన్సాస్ రైఫిళ్లు ఉపయోగిస్తోంది . చైనా ఆయుధ సంపత్తికి ఇవి సాటిరావు . ప్రారంభం లోనే ఇన్సాస్ పై అనేక అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి . అయినప్పటికీ 1998  లో వీటిని సైన్యానికి అప్పగించారు . చైనా సరిహద్దు అవసరాల రీత్యా ఆధునిక రైఫిళ్లు అత్యవసరమని ఇండియా భావించింది . అందుకే 2019  లో ఫిబ్రవరి లో అమెరికాతో ఇండియా ఒక కాంట్రాక్టు కుదుర్చుకుంది . అమెరికాకు చెందిన సిగ్ సయూర్ రైఫిళ్ల కొనుగోలుకు ఈ కాంట్రక్టు కుదిరింది . 700  కోట్ల రూపాయలతో 72,400  రైఫిళ్లు కొనాలన్నది ప్రతిపాదన . నిర్మలా సీతారామన్ రక్షణ శాఖా మంత్రిగా ఉన్నప్పుడు ఈ కాంట్రక్టు కుదిరింది . ఏడాదిలో అమెరికా రైఫిళ్లు వస్తాయని ఆనాడు నిర్మలా సీతారామన్ ప్రకటించారు .

Read: చంద్రుడిపై toilet కట్టేందుకు సలహాలు కోరుతున్న NASA