సౌదీ అరేబియా సైన్యంలోకి మహిళలు..! ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం..!!

సౌదీ అరేబియా సైన్యంలోకి మహిళలు..! ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం..!!

women will join now in saudi arabia army : సౌదీ అరేబియాలో మహిళలపై పలు ఆంక్షలు ఉంటాయనే విషయం తెలిసిందే. కానీ ఇప్పుడిప్పుడే అక్కడి మహిళ పరిస్థితులు మారుతున్నాయి. ముఖ్యంగా సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మ‌హ్మ‌ద్ బిన్ స‌ల్మాన్ హాయంలో మహిళలకు అనుకూలంగా పలు చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీంట్లో భాగంగా సౌదీ అరేబియా ప్రభుత్వం మరో చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. సౌదీ అరేబియా సైన్యంలో మహిళలను చేర్చుకునేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. సౌదీ అరేబియా తీసుకున్న ఈ చారిత్రాత్మక నిర్ణయాన్ని మహిళలు పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేస్తున్నారు. సైన్యంలో మహిళలను తీసుకోవాలని చారిత్రక నిర్ణయం తీసుకోవడం పట్ల సౌదీ యువరాజు ప్రిన్స్ సల్మాన్‌ను అక్కడి మహిళలు ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు.

దాదాపు రెండు సంవత్సరాల పాటు ఎడతెగని చర్చల అనంతరం రక్షణ మంత్రిత్వ శాఖ ఈ ప్రతిపాదనకు ఎట్టకేలకు ఆమోదం తెలిపింది. దీంతో మొదటిసారిగా ఆర్మీలోకి కేవలం నాలుగు పోస్టుల్లో మాత్రమే మహిళల నియామకానికి దరఖాస్తులు ఆమోదించనున్నారు. సైన్యానికి ఎంపికైన మహిళలు ప్రస్తుతం నగరాల్లో మాత్రమే మోహరించబడతారని..వారిని యుద్ధభూమికి పంపించమనీ స్పష్టం చేశారు. కాకపోతే మార్పు మొదలైంది కాబట్టి ఇంకొంత కాలంలో మహిళలకు యుద్ధభూమికి కూడా పంపించే అకాశాలు లేకపోలేదు.

రక్షణ మంత్రిత్వ శాఖ ఆదివారం (ఫిబ్రవరి 21,2021) ఏకీకృత ప్రవేశ పోర్టల్‌ను ప్రారంభించింది. దీనికి మొదటిసారిగా పురుషులతో పాటు మహిళల దరఖాస్తులను కూడా ఆమోదిస్తున్నారు. ప్రస్తుతం, సైనిక్ నుంచి సార్జెంట్ వరకు మొత్తం నాలుగు పోస్టులకు మాత్రమే మహిళలు దరఖాస్తు చేసుకునే అవకాశాలన్ని కల్పించారు. రాయల్ సౌదీ అరేబియా ఆర్మీ, రాయల్ సౌదీ వైమానిక దళం, రాయల్ సౌదీ నేవీ, రాయల్ సౌదీ స్ట్రాటజిక్ మిస్సైల్ ఫోర్స్, రాయల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీస్ కోసం మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటన జారీ చేశారు.

దరఖాస్తు చేసుకునే మహిళలకు షరతులు..నియమాలు
అయితే ఇక్క గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే..సైన్యంలో మహిళల నియామకానికి కొన్ని షరతులు, నియమాలను నిర్ణయించింది రక్షణ మంత్రిత్వ శాఖ. దరఖాస్తులు చేసుకునే మహిళలపై క్రిమినల్ రికార్డులు ఉండకూడదు. వైద్యపరంగా అనర్హమైన మహిళలు దరఖాస్తులను ఎట్టి పరిస్థితుల్లోను అనుమతించరు.

ఇప్పటికే ఏ ప్రభుత్వ ఉద్యోగంలోనైనా ఉద్యోగం చేసి ఉంటే ఆ మహిళలు దరఖాస్తు చేయడానికి అనర్హులు. అలాగే, విదేశీ పౌరసత్వం ఉన్న వ్యక్తిని వివాహం చేసుకున్న మహిళలకు కూడా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం లేవు..ఇక దరఖాస్తు అర్హతల విషయానికి వస్తే..డిగ్రీ కలిగి ఉండి, 21-41 సంవత్సరాల మధ్య వయసు ఉండి.. 155 సెం.మీ పొడవు కలిగి ఉండాలి.

కాగా..మహిళలను సైన్యంలోకి తీసుకునే విషయంపై 30 ఏళ్లనుంచి చర్చలు జరుగుతున్నాయి. కానీ ప్రిన్స్ సల్మాన్ నిర్ణయంతో సైన్యంలో మహిళలు కూడా సేవలందించేందుకు అవకాశం లభించిందని ఆపరేటింగ్ సిస్టమ్ స్పెషలిస్ట్ హలా అల్ యాన్బావి చెప్పారు. 2018 జూన్ నెలలో మహిళలకు మొదటిసారి కార్లు నడిపేందుకు సౌదీ ప్రభుత్వం అనుమతించింది. అలాగే, స్టేడియంలో ఫుట్‌బాల్ మ్యాచ్‌లను చూడటానికి..సినిమా థియేటర్లకు వెళ్లేందుకు కూడా అనుమతించారు. ఇదంతా ప్రిన్స్ సల్మాన్ హయాంలోనే తీసుకున్న నిర్ణయాలు.

ఈక్రమంలో మహిళల విషయంలో మరో ముందు అడుగు వేసిన ప్రిన్స్ సైన్యంలోకి మహిళలకు తీసుకునే చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. దీనిపై మహిళలు ప్రిన్స్ సల్మాన్ పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. కాగా..సౌదీ అరేబియాలో మహిళ‌ల‌పై ఉన్న ఆంక్ష‌ల‌ను క్ర‌మంగా తొల‌గిస్తూ రావటం ఆహ్వానించదగిన విషయం..