Floating City : ప్రపంచంలో తొలిసారిగా..నీటిపై తేలియాడే నగరం ఏర్పాటుకి ఒప్పందం

  ప్రపంచంలో తొలిసారిగా దక్షిణ కొరియాలోని బూసాన్ నగర తీరంలో నీటిపై తేలియాడే నగరాన్ని నిర్మించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా అనేక తీర పట్టణాల తరహాలోనే బూసాన్‌కు కూడా సముద్ర మట్టాల

Floating City : ప్రపంచంలో తొలిసారిగా..నీటిపై తేలియాడే నగరం ఏర్పాటుకి ఒప్పందం

Floating City (1)

Floating City  ప్రపంచంలో తొలిసారిగా దక్షిణ కొరియాలోని బూసాన్ నగర తీరంలో నీటిపై తేలియాడే నగరాన్ని నిర్మించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా అనేక తీర పట్టణాల తరహాలోనే బూసాన్‌కు కూడా సముద్ర మట్టాల పెరుగుదల నుంచి ముప్పు పొంచి ఉంది. ఈ నగరాన్ని వరదలు ముంచెత్తితే వేలమంది నిరాశ్రయులవుతారు,వేలకోట్ల రూపాయల నష్టం వాటిల్లుతుంది. ఈ నేపథ్యంలో ముందుజాగ్రత్తగా సముద్రంలో కొత్త నగరాన్ని నిర్మించుకోవాలని అక్కడి అధికారవర్గాలు నిర్ణయించాయి.

ఇందుకోసం బుసాన్‌ మెట్రోపాలిటన్‌ సిటీ, ఐక్యరాజ్యసమితి ఆవాస సంస్థ, న్యూయార్క్‌కు చెందిన ‘ఓషియానిక్స్’ కంపెనీ మధ్య ఇటీవల చరిత్రాత్మక ఒప్పందం కుదిరింది. వచ్చే ఏడాదే నిర్మాణ పనులు ప్రారంభం కానుండగా..2025 నాటికి పూర్తి చేయనున్నారు. దాదాపు రూ.1490 కోట్ల అంచనా వ్యయంతో 75 హెక్టార్ల విస్తీరణంలో ఈ నగరాన్ని నిర్మించనున్నారు. 10 వేలమంది వరకు ఈ తేలియాడే నగరంలో నివసించేందుకు వీలుంటుంది.

నీటిపై తేలియాడే నగరాన్ని ఎలా నిర్మిస్తారు..దీని ప్రత్యేకతలు?
మానవ సృష్టిత దీవుల సమాహారంగా ఉంటుంది. నీటిపై తేలియాడే వెదురుబొంగుల సహాయంతో మొదట షడ్భుజాకారంలో పునాదుల వంటి వేదికలను(అడుగుభాగం) సృష్టిస్తారు. అలల ధాటికి కొట్టుకుపోకుండా సముద్రగర్భంలో వాటికి లంగరు వేస్తారు. కాంక్రీటు కంటే 2-3 రెట్లు గట్టిదైన సున్నపురాయితో వెదురు వేదికలపై పూత ఏర్పాటుచేస్తారు. వాటిపై ఏడంతస్తుల వరకు భవనాలను నిర్మిస్తారు. మార్కెట్‌, హాస్పిటల్, క్రీడాప్రాంగణం, పాఠశాల, హోటళ్లు, రెస్టారెంట్లు తదితర వసతులన్నీ నగరంలో ఉంటాయి. వరదలు, తుపాన్లు, సునామీల వంటి ప్రకృతి విపత్తులను అది తట్టుకోగలదు.

తేలియాడే నగరాన్ని స్వయం సమృద్ధంగా తీర్చిదిద్దుతారు. భవనాలపై సోలార్ ప్లేట్స్ ను ఏర్పాటుచేసి.. స్థానిక అవసరాలకు సరిపడా పవర్ ను ఉత్పత్తి చేస్తారు. ప్రజలు తమకు కావాల్సిన ఆహారం, తాగునీటిని నగరంలోనే తయారుచేసుకోవాలి. మట్టి అవసరం లేకుండా గాలిలో లేదా తేమ వాతావరణంలో మొక్కలను పెంచడాన్ని ఏరోపోనిక్స్‌ అంటారు. మేలుదాయక బ్యాక్టీరియాను ఉపయోగించుకొని మొక్కలు, చేపల పెంపకం చేపట్టడాన్ని ఆక్వాపోనిక్స్‌ అంటారు. ఈ రెండు విధానాలనూ అనుసరించి నగర ప్రజలు సొంతంగా ఆహారాన్ని ఉత్పత్తి చేసుకోవాలి.

కాగా, ఇలాంటి నగరాల నిర్మాణం కోసం ప్రపంచ వ్యాప్తంగా మరో 10 ప్రభుత్వాలతో న్యూయార్క్‌కు చెందిన ‘ఓషియానిక్స్’ కంపెనీ ప్రస్తుతం చర్చలు జరుపుతోంది.

ALSO READ Rakesh Tikait : రైతుల ఉద్యమానికి ఏడాది…డిమాండ్లు అంగీకరిస్తేనే ఇళ్లకు వెళుతాం