Taliban : పైశాచికత్వం.. వంట బాలేదని మంటల్లో వేశారు
ఆఫ్ఘానిస్తాన్ లో తాలిబన్ల అరాచకాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయని ఆ దేశానికి చెందిన మాజీ జడ్జి నజ్లా ఆయూబీ ఆరోపించారు.

Taliban
Taliban : ఆఫ్ఘాన్ లో తాలిబన్లు ఇచ్చిన హామీలు నీటిమీద రాతలుగా మారుతున్నాయి. మహిళా హక్కులు, స్త్రీ స్వేచ్ఛపై తాలిబన్ల హామీలు నీటిమూటలుగా మిగిలిపోయాయి. తాలిబన్లు మహిళలను హింసకు గురిచేస్తున్నారంటూ అఫ్గాన్‌కు చెందిన నజ్లా ఆయూబీ అనే మాజీ జడ్జి తెలిపారు. చిన్న కారణాలకు చిత్ర హింసలకు గురి చేస్తున్నారని వ్యాఖ్యానించారు. నజ్లా ‘స్కై న్యూస్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అఫ్గాన్‌లో మహిళలపై జరుగుతున్న అరాచకాలను బయటపెట్టారు. తమకు వండిన వంట బాగాలేదన్న కారణంగా ఉత్తర ఆఫ్ఘాన్ కు చెందిన ఓ మహిళను చిత్రహింసలకు గురిచేసి ఆమెకు నిప్పు పెట్టారని ఆయూబీ తెలిపారు.
తమకు ఆహారం అందించాలంటూ అక్కడ ప్రజలను తాలిబన్లు ఒత్తి చేస్తున్నారని తెలిపారు. స్థానిక యువతులను బందించి తీసుకెళ్లి సెక్స్ బానిసలుగా మార్చేందుకు ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారని ఆరోపణలు చేశారు. తమ ఆదీనంలో ఉన్న ప్రాంతాల్లోని యువతులను తీసుకెళ్లి పెళ్లి చేసుకుంటున్నారని తెలిపారు. ఒకపక్క ఇన్ని దారుణాలకు పాల్పడుతూ మరోపక్క మహిళలు స్వేచ్ఛగా పని చేసుకోవచ్చని బూటకపు హామీలు ఇస్తున్నారని ఆయూబీ మండిపడ్డారు.
ఇక మహిళల హక్కుల కోసం పోరాడేవారు.. తాలిబన్ల చేతిలో హింసకు గురవుతారని భావించి దేశం విడిచి వెళ్లిపోయారు. దేశం విడిచి వెళ్లిన వారిలో నజ్లా ఆయూబీ కూడా ఉన్నారు. ప్రస్తుతం ఆమె అమెరికాలో తలదాచుకున్నారు. గతంలో తాలిబన్లకు వ్యతిరేకంగా పనిచేసిన వారంతా ఇప్పుడు దేశం విడిచి వెళ్లిపోయారు. గతంలో అమెరికా బలగాలకు సహకరించిన వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాయి దళాలు. తాలిబన్ల అరాచకాలు ఇలా ఉంటే.. తినడానికి తిండి లేక అక్కడి ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో మంచి నీరు కూడా దొరకడం లేదు. కాబుల్ విమానాశ్రయం సమీపంలోని హోటళ్లు మొత్తం మూతబడ్డాయి దీంతో ప్రయాణికులకు ఆహారం దొరక్క ఇబ్బంది పడుతున్నారు.