Taliban warns India: ఇండియాకు తాలిబన్ల వార్నింగ్‌

తాలిబన్లు భారత్‌కు వార్నింగ్‌ ఇచ్చారు. ఆఫ్ఘనిస్తాన్‌ సైన్యానికి సాయం చేస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదంటూ ఆ సంస్థ అధికార ప్రతినిధి సుహైల్‌ షాహిన్‌ హెచ్చరించాడు.

Taliban warns India: ఇండియాకు తాలిబన్ల వార్నింగ్‌

Talibans

Taliban warns India: తాలిబన్లు భారత్‌కు వార్నింగ్‌ ఇచ్చారు. ఆఫ్ఘనిస్తాన్‌ సైన్యానికి సాయం చేస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదంటూ ఆ సంస్థ అధికార ప్రతినిధి సుహైల్‌ షాహిన్‌ హెచ్చరించాడు. భారత్‌తో తమకు శత్రుత్వం లేదని.. కానీ అఫ్ఘాన్‌ ప్రభుత్వానికి, సైన్యానికి అండగా ఇండియా తన సైన్యాన్ని తరలిస్తే మాత్రం వారికి మంచిది కాదంటూ ప్రకటించాడు. తమ దేశ విషయాల్లో జోక్యం చేసుకోరాదంటూ వార్నింగ్‌ ఇచ్చాడు. మరోవైపు భారత్‌ మాత్రం అఫ్ఘానిస్తాన్‌ పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేస్తోంది. తుపాకీ రాజ్యానికి ఒప్పుకునేది లేదని ప్రకటించింది.

ఇటు భారత ప్రతినిధులతో స్వయంగా ఎలాంటి మీటింగ్‌ జరిగినట్టు స్పష్టం చేయలేమని చెబుతున్న తాలిబన్‌ అధికార ప్రతినిధి.. దోహాలో జరిగిన సమావేశంలో మాత్రం భారత ప్రతినిధి బృందం పాల్గొన్నట్టు తెలిపాడు. తమ భూభాగం విషయంలో ఎవరి జోక్యం అవసరం లేదని హెచ్చరించాడు. ఇప్పటికే టర్కీలాంటి దేశాలకు గట్టిగా వార్నింగ్‌ ఇచ్చిన తాలిబన్లు.. ఇప్పుడు ఇండియాకు కూడా హెచ్చరించడం చర్చనీయాంశం అయింది. ఏ దేశ ఎంబసీపైనా తాము దాడి చేయబోమని విదేశీ ప్రతినిధులకు ఎలాంటి హానీ తలపెట్టమని ప్రకటించాడు. అదే సమయంలో తమ దేశ అంతర్గత వ్యవహారాల్లో తలదూర్చరాదంటూ హెచ్చరించాడు.

అఫ్ఘానిస్తాన్‌లో తాలిబన్లు రోజు రోజుకు రెచ్చిపోతున్నారు. ఇప్పటికే ప్రధాన నగరాలను ఆక్రమించుకున్న తాలిబన్లు.. రాజధాని కాబూల్‌ను ఆక్రమించేందుకు అడుగులు వేస్తున్నారు. పరిస్థితి విషమించడంతో భారత రాయబార కార్యాలయం సిబ్బందిని స్వదేశానికి రప్పించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. రానున్న 24 గంటల్లో ఆఫ్గనిస్థాన్‌లోని భారత రాయబార కార్యాలయ సిబ్బందిని స్వదేశానికి తీసుకొస్తామని తెలిపింది. ఇందుకోసం ఇప్పటికే ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది.

అమెరికా దళాలు అఫ్ఘాన్‌ నుంచి తరలిపోయిన కొద్ది రోజుల్లోనే తాలిబన్లు దాడులు చేసి చాలా ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. కాందహార్, హెరాత్, లష్కర్‌ఘాలతో కలిపి 18 రాష్ట్రాల రాజధానులను తాలిబన్లు చేజిక్కించుకున్నారు. ఆఫ్ఘాన్ ఆర్థిక మంత్రి ఖలీద్ రాజీనామా చేసి, దేశాన్ని వీడి పారిపోయాడు. ఆ దేశ అధ్యక్షుడు కూడా లొంగిపోయే పరిస్థితి నెలకొంది.

ఇటు తాలిబన్ ఉగ్రవాదులకు పాకిస్థాన్ అండగా ఉంటోంది. తమ దేశంలోని ఉగ్రస్థావరాలను పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ శరణార్థి శిబిరాలుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. భారత వ్యతిరేక ఉగ్ర శిబిరాలను తాలిబన్ పాలిత ఆఫ్ఘాన్‌కు ఎఫ్ఏటీఎఫ్ ఆంక్షల నుంచి బయటపడాలన్నది పాక్ వ్యూహంగా తెలుస్తోంది. ఇటు భారత్‌ చేసిన సాయాన్ని స్వాగతిస్తూనే.. అఫ్ఘానిస్తాన్‌లో ఇండియా నిర్మించిన సల్మా డ్యామ్ సహా పలు ప్రాజెక్టులపై తాలిబన్లు దాడులతో విరుచుకుపడుతున్నారు. దీంతో తాలిబన్ల వైఖరిపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

కాబూల్‌పై ఎలాంటి బలవంతపు పాలననూ తాము గుర్తించబోమని అమెరికాతో కలిసి ప్రకటించింది. ఐక్యరాజ్యసమితి వేదికగా తాలిబన్లకు మద్దతు తెలుపుతున్న పాక్ వైఖరిని తప్పబట్టింది. ఇప్పటికే మజారే షరీఫ్‌లోని దౌత్య కార్యాలయాన్ని పూర్తిగా మూసివేసింది. ఈ క్రమంలోనే ఆఫ్గాన్‌లోని భారతీయులను స్వదేశానికి తిరిగి తీసుకువచ్చేందుకు కసరత్తులను ముమ్మరం చేసింది భారత్.