Afghan Women: తాలిబాన్ తిరిగొచ్చారనే భయం.. దేశం వదిలి పారిపోతున్న మహిళా లోకం

తాలిబాన్లపై నమ్మకం కుదరడం లేదు. అందుకే కట్టుబట్టలతో దేశం విడిచిపోయేందుకు నానా తంటాలు పడుతున్నారు.

Afghan Women: తాలిబాన్ తిరిగొచ్చారనే భయం..  దేశం వదిలి పారిపోతున్న మహిళా లోకం

Afghan Women

Updated On : August 17, 2021 / 9:36 AM IST

Afghan Women: అఫ్ఘాన్ పగ్గాలు రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ అందుకున్నారు తాలిబాన్లు. ‘ప్రజలకు ఇబ్బంది లేకుండా చూసుకుంటాం. మహిళల భద్రత, పాలన గురించి హామీ’లు ఇచ్చినా అక్కడి వారికి తాలిబాన్లపై నమ్మకం కుదరడం లేదు. అందుకే కట్టుబట్టలతో దేశం విడిచిపోయేందుకు నానా తంటాలు పడుతున్నారు.

అఫ్గాన్‌ భవితవ్యం గురించి ఇంత భయమెందుకు? ముఖ్యంగా మహిళల పరిస్థితేంటి? అనే ప్రశ్నలపై తాలిబన్ల నుంచి క్లారిటీ లేదు. గత పాలన సందర్భంగా తాలిబన్లు స్త్రీలను ఎలా చూశారో అందరికీ తెలుసు. స్త్రీలకు విద్య నిషేదించడం, బురఖా తప్పనిసరి చేయడం, హక్కులను తుడిచిపెట్టేయడం, లైంగిక బానిసలుగా మార్చేయడం వంటివి తలుచుకోగానే ప్రస్తుత అఫ్గాన్‌ మహిళా సమాజం ఉలిక్కిపడుతుంది.

2001 తర్వాత జన్మించిన యువతకు వీరి ఆగడాలపై అవగాహన లేదు. ప్రస్తుతం తాము మారిపోయామని, మహిళా విద్యను కొనసాగిస్తామని తాలిబన్లు ప్రకటించుకుంటున్నా వారికి భయం తగ్గలేదు. ఇప్పటికైతే మహిళల పట్ల ఎలాంటి విధాన నిర్ణయాలు ప్రకటించలేదు. జూలైలో బందక్షాన్, తఖార్‌ ప్రావిన్సులను ఆక్రమించుకున్న అనంతరం తాలిబన్లు ఇచ్చిన ఆదేశాలు గుర్తుకొచ్చి ఆందోళనకు గురవుతున్నారు.

ఆయా ప్రాంతాల్లో ఉండే 15ఏళ్ల నుంచి 45 ఏళ్లలోపు వితంతువుల జాబితాను తమకివ్వాలని జూలైలోనే స్థానిక నాయకులను ఆదేశించారు. తాలిబన్‌ ఫైటర్లను పెళ్లి చేసుకోవడానికి అవసరమని ఆర్డర్ ఇచ్చారు. ఆ ఆదేశాలు అమలయ్యాయా? అక్కడి మహిళల పరిస్థితి ఏంటి? అనే వాటిపై ఇంతవరకు సమాచారం రాలేదు.

పేరుకు మాత్రమే పెళ్లిళ్లు.. ఇవన్నీ యువకులను ఆకర్షించడానికే తాలిబన్లు చేస్తున్న ప్రయత్నాలని విశ్లేషకులు అంటున్నారు. పెళ్లైనవారు భార్య హోదా పొందకపోగా లైంగిక బానిసలుగా మారడం పట్ల చాలా మంది భయపడి పారిపోతున్నారు. మూడు నెలల్లో దాదాపు 9 లక్షలమంది స్వస్థలాలను విడిచిపోయారంటే తాలిబన్‌ టెర్రర్‌ అర్థమవుతుంది.