Afghan Woman Filmmaker : మాతృభూమి నుంచి పారిపోతున్నా..! చచ్చిపోయిన నా ఆత్మ తప్ప నా వద్ద ఇంకేం లేవు

నా గళాన్ని వినిపించటానికి నా మాతృభూమి నుంచి పారిపోతున్నా..చచ్చిపోయిన నా ఆత్మ, నా కెమెరాలు తప్ప నావద్ద ఇంకేమీ లేవు అంటూ అఫ్గాన్ మహిళా ఫిల్మ్ మేకర్ పెట్టిన పోస్టు..కలచివేస్తోంది.

Afghan Woman Filmmaker : మాతృభూమి నుంచి పారిపోతున్నా..! చచ్చిపోయిన నా ఆత్మ తప్ప నా వద్ద ఇంకేం లేవు

Afghan Woman Filmmaker's Heartbreaking Post

Afghan Woman Filmmaker’s Heartbreaking Post : అఫ్గానిస్థాన్ ను తాలిబన్లు హస్తగతం చేసుకున్నాక..ఎంతోమంది జీవితాలు తల్లక్రిందులైపోయాయి. ఛిన్నాభిన్నమైపోయాయి. ముఖ్యంగా యువతుల కలలు కల్లలైపోయాయి.మహిళల జీవితాలు తిరిగి పాత రోజుల్లోకి..చీకటి బతుకుల్లోకి జారిపోతున్నాయి. తాలిబన్ల అరాచకాలకు బాలికలు, యువతుల జీవితాలు ఛిద్రమైపోతున్నాయి. ఎన్నో కలలతో తమకు ఇష్టమైన వృత్తుల్లోకి వెళ్లిన యువతులకు తాలిబన్ల ఆంక్షలు ముళ్లకంచెల్లా మారాయి. ఉద్యోగాలు చేయకూడదు. అసలు ఇంటి గడప దాటకూడదు. కాదంటే కాల్చేస్తాం. ఇదీ తాలిబన్ల అరాచకపు దాష్టీకాలు.

తాలిబన్ల అరాచకాలకు భయపడి ఎంతోమంది తమ గొంతుల్ని ఇనుప సంకెళ్లతో బంధించివేశారు. ఎన్నో గళాలు మూగబోయాయి. వేరే దారి లేక. తాలిబన్ల అరాచకపు పాలనకు భయపడి ఎంతోమంది దేశం విడిచిపోతున్నారు. అలా ఓ మహిళా జర్నలిస్టు అఫ్గాన్ నుంచి వెళ్లిపోయి తన ఆవేదనను వెల్లడించింది.ఆ ఆవేదనలో మాతృభూమి పట్ల ఆమెకున్న ప్రేమాభిమానాలు కనిపిస్తున్నాయి. దేశ విడిచి వెళ్లిన దుస్థితికి ఆమె పడే మానసిక క్షోభ కనిపిస్తోంది. అఫ్గాన్ లో ఫొటో జర్నలిస్ట్,ఫిల్మ్ మేకర్ గా పనిచేసే ‘రోయా హైదరీ’ దేశం విడిచి ఫ్రాన్స్ వెళ్లిపోయాక ఆమె పెట్టిన పోస్ట్ అఫ్గాన్ దుస్థితిని..తెలియజేస్తోంది.

జీవితంపై ఎన్నో ఆశలు.. ఎన్నెన్నో కలలతో ఫోటో జర్నలిస్టు అయ్యింది రోయా హైదరీ. కానీ ఆమె ఆశలు,కలలు అన్నీ తాలిబన్ల రాకతోనే సమాధి అయిపోయాయి. ఆశల్ని గుండెల్లోనే అదిపెట్టేసుకుంది.కలల్ని కలతలుగా మార్చేసుకుంది. అఫ్గాన్లందరిలాగానే ఆమె కూడా దేశం నుంచి వెళ్లిపోవాలనుకుంది. అలా ఆమె ‘జీవితాన్ని వదిలేసి’ కాబూల్ ఎయిర్ పోర్టుకు చేరుకుంది. ఎలాగోలా ఓ విమానమెక్కింది. కొన్ని రోజుల క్రితం ఫ్రాన్స్ లో దిగింది.ఆ తరువాత రోయా పెట్టిన ఓ పోస్ట్ ఇప్పుడు అందరినీ కలచివేస్తోంది. అఫ్గాన్ దుస్థితుల్ని వెల్లడిస్తోంది.

రోయా పోస్టులో ‘‘నా గళాన్ని వినిపించేందుకు.. నా జీవితాన్ని, ఇంటిని వదిలేసి వెళ్తున్నా. మరోసారి నేను నా మాతృభూమి నుంచి పారిపోతున్నా. మరోసారి సున్నా నుంచి జీవితాన్ని మొదలుపెట్టబోతున్నా. అలా దేశ విడిచి వెళ్లిపోతున్న నా వద్ద చచ్చిపోయిన నా ఆత్మ,నా కెమెరాలు తప్ప నా వద్ద ఇంకేమీ లేవు. మళ్లీ వచ్చేంత వరకు మాతృభూమికి భారమైన హృదయంతో ఇదే నా వీడ్కోలు’’ అని ఆమె ట్వీట్ చేసింది. ఆ పోస్ట్ కు కాబూల్ ఎయిర్ పోర్టులో ఆమె దీనంగా కూర్చున్న ఫొటోను జత చేసింది.

‘‘ఎప్పుడూ నేను గొంతెత్తూనే ఉంటా. నా గుండెల్లోని బాధ నన్ను మరింత పటిష్ఠంగా మారుస్తోంది. ఈ యుద్ధం కన్నా నా కళ చాలా గట్టిది. ఈ పిరికిపందల కన్నా నా ప్రజలు చాలా శక్తిమంతులు. నా దేశం మళ్లీ నిలబడుతుంది. నా ప్రజల కోసం.. నా ఇంటి కోసం..అఫ్గానిస్థాన్ కోసం’’ అన్న జబీహుల్లా కవితను ఆమె పోస్ట్ చేసింది.

ఐదు రోజుల క్రితం ఫ్రాన్స్ కు చేరుకున్న రోయా హైదరీ.. చావు ఒకసారే వస్తుందని, తాలిబన్లు తనను చంపినా భయపడనని తెలిపింది. కానీ..మళ్లీ చీకటి బతుకుకు అలవాటు పడటానికి కూడా భయపడిపోయింది. అంత దారుణంగా ఉంటాయి తాలిబన్ల అరాచకాలు. అందుకే మళ్లీ పంజరంలో బందీ కావల్సి వస్తుందన్న భయంతోనే దేశం నుంచి పారిపోయి వచ్చానని తెలిపింది.