G7 summit: అఫ్ఘానిస్థాన్‌లో పరిణామాలపై G-7 దేశాల సమావేశం నేడే!

అఫ్ఘానిస్థాన్‌లో పరిణామాలపై చర్చలు జరిపి ఉమ్మడి వ్యూహం రూపొందించేందుకు G-7 దేశాలు సమావేశం అవుతున్నాయి.

G7 summit: అఫ్ఘానిస్థాన్‌లో పరిణామాలపై G-7 దేశాల సమావేశం నేడే!

Biden

G7-Summit: అఫ్ఘానిస్థాన్‌లో శరవేగంగా మారుతున్న పరిణామాలపై చర్చలు జరిపి ఉమ్మడి వ్యూహం, కార్యాచరణ రూపొందించేందుకు G-7 దేశాలు ఇవాళ(24 ఆగస్ట్ 2021) వర్చువల్‌ సమావేశం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నాయి. ఈ బృందంలో సభ్య దేశాలైన అమెరికా, బ్రిటన్ దేశాల అధ్యక్షులు జో బైడెన్, బోరిస్‌ జాన్సన్‌ ఓ అంగీకారానికి వచ్చారు.

ఇద్దరు నేతలు ఫోనులో చర్చించుకున్న తర్వాత అఫ్ఘాన్ శరణార్థులకు మానవతా సాయం అందించే ప్రణాళికలపై G-7 నాయకులు చర్చించనున్నట్లు చెప్పారు. ఈ విషయాన్ని ఇప్పటికే వైట్ హౌస్ ఓ ప్రకటనలో తెలిపింది. అఫ్ఘాన్ నుంచి తమ పౌరులను, యుద్ధ ప్రయత్నంలో సహకరించిన అఫ్ఘాన్‌ పౌరులను, అమాయకులను తరలించడంలో తమ సేనలు చూపిన తెగువ, చొరవలను నేతలిద్దరూ ప్రశంసించగా.. ప్రజాస్వామ్య దేశాలతో కలిసి అఫ్ఘాన్ పరిణామాలపై నిఘా కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు.

శరణార్థులు.. పౌరుల రక్షణకు మానవతా కోణంలో ప్రపంచ సమాజం సాయం అందించాలని ఇరువురు నేతలు చర్చల సమయంలో నిర్ణయం తీసుకున్నారు. అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ కూడా ఖతార్, కువైట్‌ సహా మిత్రదేశాల ప్రతినిధులతో చర్చించారు. ఈ ఏడాది జి-7 దేశాలకు బ్రిటన్ అధ్యక్షత వహిస్తోంది. ఈ బృందంలో బ్రిటన్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్ మరియు యునైటెడ్ స్టేట్స్ ఉన్నాయి.

ఆగస్ట్ 31వ తేదీ లోగా అమెరికా సైన్యం అఫ్ఘాన్ నుంచి వెళ్లిపోవాలంటూ ఇప్పటికే తాలిబాన్లు హెచ్చరించగా.. ఈ క్రమంలో ఈ మీటింగ్ ప్రాధాన్యత సంతరించుకుంది.